
రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి... రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే న్యాయ వ్యవస్థ ఏం చేయాలి? రాజధాని రైతుల పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన చర్చను గమనించిన తర్వాత ఈ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కోర్టు తీర్పును ముక్కలు ముక్కలుగా విడగొట్టి ప్రస్తావించిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల హక్కులను తన ప్రభుత్వం హరించిన విషయాన్ని మాత్రం జగన్‌రెడ్డి తన ప్రసంగంలో విస్మరించారు. చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం ఏమిటని వక్తలు వ్యాఖ్యానించారు. చట్ట సభలు చేసే చట్టాలు న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయని, సదరు చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉండాలని మాత్రం విస్మరించారు. ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ పౌరుల ప్రాథమిక హక్కులను హరించినప్పుడు న్యాయస్థానాలే జోక్యం చేసుకుంటాయి. హైకోర్టు తీర్పు అసంబద్ధంగా ఉంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ప్రభుత్వాలకు ఉంటుంది. అంతేగానీ... 175 మంది సభ్యులున్న సభలో తనకు 151 మంది సభ్యుల బలం ఉందని, తన అధికారాన్ని ఎవరూ ప్రశ్నించకూడదన్న ధోరణి ప్రదర్శించడం ప్రమాదకరం. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం సహజం. ప్రభుత్వ చర్యలకు, నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. శాసనసభలో 86 శాతం మంది సభ్యుల బలం ఉన్నంత మాత్రాన తన ప్రభుత్వం ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని జగన్ అండ్ కో భావించడం వింతగా ఉంది. న్యాయ వ్యవస్థకు సుద్దులు చెప్పడానికి ప్రయత్నించిన జగన్‌రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వ చర్యల నుంచి ఉపశమనం కోసం ఇదే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. అయినా, వివేకా హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు చేయకుండా కట్టడి చేయాలని ఇదే జగన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకోలేదా? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న తనకు తిరుగులేని అధికారం ఉందని భావిస్తున్న జగన్‌రెడ్డి... అప్పుడు చంద్రబాబుకు కూడా ఇంతే అధికారం ఉంటుందని ఎందుకు గుర్తించలేదో? వివేకా హత్య దర్యాప్తుపై మాట్లాడకుండా అప్పటి ముఖ్యమంత్రిని కట్టడి చేయాలని జగన్‌రెడ్డి కోరుకోవడం సమర్థనీయమా? అది సమర్థనీయమైతే ఇప్పుడు రైతుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు సమర్థనీయం కాకుండా ఎలా పోతుంది? న్యాయ వ్యవస్థనే ముద్దాయిగా బోనులో నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న జగన్‌రెడ్డి గతంలో ఇదే న్యాయ వ్యవస్థను ఆశ్రయించి బెయిల్ పొందలేదా? 2004లో అధికారంలోకి రాకముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమిటి? 2009 నాటికి ఆ కుటుంబానికి అన్ని ఆస్తులు, అన్ని కంపెనీలు ఎలా వచ్చాయో అందరికీ తెలిసిందే. అక్రమ సంపాదన కళ్లెదురుగా కనిపిస్తున్నప్పటికీ తాను నిర్దోషినని, అన్యాయంగా సీబీఐ కేసుల్లో ఇరికించారని జగన్‌రెడ్డి ఇప్పటికీ వాదిస్తున్నారు కదా! అలా వాదించే హక్కును కూడా రాజ్యాంగమే ఇచ్చింది. పదహారు నెలల జైలు జీవితం తర్వాత జగన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జగన్‌కు అప్పుడు బెయిల్ ఇవ్వడాన్ని కూడా కొంతమంది ఆక్షేపించారు. అంతమాత్రాన బెయిలు ఇచ్చి కోర్టు తప్పు చేసిందని నిందించడం సబబు కాదే? తాజాగా ముఖ్యమంత్రికి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. జగన్‌కు బెయిల్ రద్దు చేయకపోవడం ఏమిటి? అని ఒక వర్గం ఆక్షేపించింది. జగన్‌రెడ్డి కూడా వారితో స్వరం కలుపుతారా? భారతీ సిమెంట్‌కు సున్నపురాయి గనుల లీజు పునరుద్ధరించడానికి చంద్రబాబు ప్రభుత్వం నిరాకరించినప్పుడు జగన్ అండ్ కో ఇదే హైకోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందలేదా? సరస్వతీ సిమెంట్ విషయంలో కూడా న్యాయస్థానం నుంచి ఊరట పొందారు కదా? ఇతరులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి ఉపశమనం పొందిన జగన్‌రెడ్డి... ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన నిర్ణయాలను, చట్టాలను ఎవరూ ప్రశ్నించకూడదని, న్యాయస్థానాలు తప్పు పట్టకూడదని భావించడం ఏమిటి? నిజంగా నేరం చేసిన వాడు కూడా తాను నిర్దోషిననే న్యాయస్థానంలో వాదిస్తాడు. అయితే, కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదటే కోర్టు సదరు వ్యక్తి నేరం చేశాడా లేదా అని తీర్పు ఇస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనకున్న హక్కులను ఉపయోగించుకొని ఉపశమనం పొందిన జగన్‌రెడ్డి... నేడు ముఖ్యమంత్రిగా తన నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పు పట్టకూడదని భావించడంవల్లనే న్యాయవ్యవస్థతో తరచుగా వివాదాలు తలెత్తుతున్నాయి. శాసనసభలో తిరుగులేని మెజారిటీ ఉన్నంత మాత్రాన చట్టాలు, రాజ్యాంగ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఏదైనా చేయవచ్చునని జగన్‌రెడ్డి భావిస్తుండవచ్చుగానీ అది కుదరదు. నాడైనా నేడైనా ప్రభుత్వ చర్యల వల్ల ఇబ్బందిపడే వారే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు–ఆశ్రయిస్తారు. ఇందులో అసాధారణమేమీ లేదు. కానీ, జగన్ అండ్ కో తమది తిరుగులేని అధికారమని, తమనెవరూ ప్రశ్నించకూడదని భావిస్తున్నారు. ఈ కారణంగా జగన్ ప్రభుత్వ చర్యలను తప్పు పడుతున్న అన్ని వ్యవస్థలపై బురద చల్లుతున్నారు. న్యాయ వ్యవస్థకు మసిపూసే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయస్థానాలను ఎవరో మేనేజ్ చేస్తున్నారనీ, జగన్‌రెడ్డికి న్యాయవ్యవస్థ అన్యాయం చేస్తోందని నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవినీతి కేసులలో న్యాయస్థానం మున్ముందు జగన్‌ను దోషిగా నిర్ధారించి శిక్ష విధించినా.. ఇదే వాదంతో ప్రజలను తప్పుదారి పట్టించవచ్చునన్నది జగన్ అండ్ కో ఆలోచన కావొచ్చు.
ఇదో విచిత్రం...
రాజధాని రైతులకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై చర్చను ప్రారంభించిన ధర్మాన ప్రసాదరావు, చర్చను ముగించిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పలు కేసులలో ముద్దాయిలుగా ఉండటం గమనార్హం. మామూలుగా అయితే ముద్దాయిలుగా ఉన్నవారు న్యాయవ్యవస్థపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడానికి జంకుతారు. కానీ... జగన్ అండ్ కో ఏ జంకూ గొంకూ లేకుండా న్యాయవ్యవస్థనే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయగలగడం కూడా రాజ్యాంగం కల్పించిన వెసులుబాటే. ఈ వెసులుబాటు కారణంగానే జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజధానికి భూములిచ్చిన రైతులతో గత ప్రభుత్వం స్పష్టమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించజాలదు. న్యాయస్థానం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం సదరు భూములను అభివృద్ధి చేయాలని ఆదేశించింది. ఇందులో ఆక్షేపించడానికి, పరిధి దాటిందని చెప్పడానికి ఏముంది? రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే అధికారం రాష్ర్టాలదే అని జగన్‌రెడ్డి చేస్తున్న వాదన వాస్తవమే. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర విభజన జరిగినందున, పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని కేంద్రం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలన్నది సిఫారసు చేయడానికి శివరామకృష్ణన్ కమిటీని కూడా కేంద్రమే నియమించింది. పునర్విభజన చట్టంలో ‘ద కాపిటల్’ అని పేర్కొన్నందున మూడు రాజధానుల ఏర్పాటుకు అనువుగా మరో చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మూడు రాజధానులు పెట్టాలనుకుంటే కేంద్రం చేసిన పునర్విభజన చట్టానికి సవరణ చేయాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. శాసనసభకు చట్టాలు చేసే అధికారమే లేదా? అని ప్రజలను తప్పుదారి పట్టించడానికి జగన్ అండ్ కో ప్రయత్నిస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి మూడు రాజధానుల నినాదాన్ని ఎత్తుకున్న ప్రభుత్వం... ఇప్పుడు పరిపాలనా వికేంద్రీకరణ అని చెప్పడం వింతగా ఉంది. అలాంటప్పుడు మూడు రాజధానుల గుంజాటన ఎందుకు? కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను విశాఖలో, మరికొన్నింటిని రాయలసీమలో ఏర్పాటుచేసి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుతో అభివృద్ధి జరిగిపోయిందని ప్రజలను నమ్మించవచ్చు కదా? పరిపాలనా వికేంద్రీకరణకు ఏ చట్టమూ అవసరం లేదే? అధికార వికేంద్రీకరణ గురించి విన్నాంగానీ పరిపాలనా వికేంద్రీకరణ గురించి ఇప్పుడే వింటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను స్థానిక సంస్థలకు బదిలీ చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికై రాజ్యాంగ సవరణలు చేశారు. ఆ తర్వాత వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదు. జగన్‌రెడ్డి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించకుండా పరిపాలనా వికేంద్రీకరణ పేరిట ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తోంది. న్యాయ రాజధాని పేరిట హైకోర్టును ఏర్పాటు చేసినంత మాత్రాన రాయలసీమ అభివృద్ధి చెందుతుందని చెప్పడం ఆ ప్రాంత ప్రజలను మోసం చేయడం కాదా? హైదరాబాద్ పాత బస్తీలో మూసీ నది ఒడ్డున హైకోర్టు దశాబ్దాలుగా ఉంది. అక్కడ అభివృద్ధి జరగలేదే? ఇప్పుడు విస్తరించిన సైబరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఏవీ లేవు. అక్కడ కంపెనీలు ఏర్పాటుకావడం వల్ల లక్షలాది మందికి ఉపాధి లభించడంతో పాటు ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఈ వాస్తవాలను మరుగునపరచి ప్రజలను తప్పుదారి పట్టించడం రాష్ర్టానికి ద్రోహం చేయడం కాదా? హైదరాబాద్‌లో అసెంబ్లీ ఉన్న ప్రాంతం కూడా ఇప్పుడు కళావిహీనంగా ఉండిపోవడానికి అభివృద్ధి సరికొత్త ప్రాంతాలకు విస్తరించడమే కారణం. చంద్రబాబు నాయుడికి ఈ ప్రాంతంపై ప్రేమ ఉండివుంటే విజయవాడ లేదా గుంటూరులో రాజధాని పెట్టివుండేవారని జగన్‌రెడ్డి ఇప్పుడు అంటున్నారుకానీ... జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి కనీసం 30 వేల ఎకరాల భూమి ఉండాలని కోరలేదా?
ఎంత తేడా...
రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లవుతోంది. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం రాజధాని కూడా లేకుండా చేసినందుకు సిగ్గుగా అనిపించడం లేదా? మూడు రాజధానుల సంగతి అటుంచి ఒక్క రాజధాని కూడా కట్టే శక్తి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి లేదని తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న ఖర్మ ఇది! ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికైనా తమకు ఏం కావాలో తేల్చుకోవాలి. మాకు అభివృద్ధి వద్దు, కులమతాల రొచ్చులోనే మునిగి తేలుతామని భావిస్తే అది వారి ఇష్టం. రాష్ట్రం విడిపోక ముందు తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం లక్షా 20 వేలు! ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత అది 2 లక్షలా 70 వేలకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రజల తలసరి అప్పు కొండలా పెరిగిపోతోంది. అధికారం నిలబెట్టుకోవడంకోసం అడ్డగోలుగా అప్పులు చేస్తున్న జగన్‌రెడ్డి పాలనపై ప్రజలు గొంతెత్తని పక్షంలో శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే చూడవలసి వస్తుంది. మద్యం విషయమై మాట్లాడుతూ ప్రతిపక్ష వైఖరి కారణంగా మద్యం ఆదాయం తగ్గి అక్క చెల్లెమ్మలకు మేళ్లు చేయలేని పరిస్థితిని తనకు కల్పించే కుట్ర చేస్తున్నారని జగన్‌రెడ్డి ఆరోపించడాన్ని బట్టి ఆ రాష్ట్ర పరిస్థితి ఏమిటో తెలుస్తోంది. మగవాళ్లు తాగుతూ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చితే... వారి ఇళ్లలోని ఆడవారికి పంచిపెడతానని జగన్‌రెడ్డి వాదించడం ఆయన ప్రభుత్వ పోకడలకు పరాకాష్ఠ. సంక్షేమాన్ని మద్యం అమ్మకాలతో ముడిపెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో అందరూ తాగుబోతులుగా మారాల్సి వస్తుందేమో!
మీ మాయలు చెల్లవు...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబుతోపాటు రాధాకృష్ణ, రామోజీరావు అంటూ పదే పదే కలవరించారు. మమ్మల్ని చంద్రబాబుతో ముడిపెట్టడం ద్వారా మా విశ్వసనీయత దెబ్బతీయాలన్నది ఆయన ఆలోచన కావొచ్చుగానీ, ఈ ట్రిక్కులు ఇక చెల్లబోవు. మంత్రి కొడాలి నాని అయితే మా మీడియా సంస్థలను 420గా అభివర్ణిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలకోసం మేం చేస్తున్న పోరాటాన్ని మీ విమర్శలూ, దుష్ప్రచారం నిలువరించలేవు. ముఖ్యమంత్రి మమ్మల్ని కలవరిస్తుండగా, అధికార పక్ష సభ్యులు ఆయనను పొగడటంలో పోటీపడ్డారు. ఆత్మస్తుతి–పరనిందలతో శాసనసభా సమావేశాలు గడచిపోయాయి. మధ్యలో ‘ముండ’ భాష ఒకటి. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఏకంగా లోకేశ్‌ను ఉద్దేశించి ‘ముండ’ భాష ప్రయోగించగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పగలబడి నవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్రజాస్వామిక పదాలను శాసనసభలో వాడకూడదన్న స్పృహ లేకుండా శాసనసభ్యులు ‘ముండ’ భాష వాడటం, దానిని ముఖ్యమంత్రి నవ్వులతో స్వాగతించడం, స్పీకర్ కనీసం అభ్యంతరం చెప్పకపోవడం వింతగా ఉంది. హైకోర్టు తీర్పువల్ల శాసనసభ అధికారాలకు భంగం కలిగిందని గొంతు చించుకున్న వాళ్లు ఇటువంటి భాషా ప్రయోగం వల్ల సభా గౌరవం పెరుగుతుందని చెప్పగలరా? నారాయణ స్వామి వాడిన పదం విన్న తర్వాత ఆరు దశాబ్దాల క్రితం అనంతపురం మునిసిపల్ ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి వర్గం, రామాచార్యులు వర్గానికి మధ్య చోటుచేసుకున్న సంవాదంపై రావినూతల శ్రీరాములు ‘ఆంధ్రజ్యోతి’లో రాసిన వ్యాసంలో పేర్కొన్న కొన్ని వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో పప్పూరి రామాచార్యుల వర్గం వారు నీలం సంజీవరెడ్డి వర్గం పోటీకి దింపిన ఒక వార్డు అభ్యర్థినిపై సమాజంలో ‘హీన పరిగణన’ ఉన్న కులానికి చెందిన మహిళను పోటీకి నిలబెట్టారు. దీంతో నీలం సంజీవరెడ్డి వర్గం వారు రామాచార్యులు నిలబెట్టిన అభ్యర్థినిని చులకన చేసి మాట్లాడడం ప్రారంభించారు. దీంతో రామాచార్యులు... నీలం సంజీవరెడ్డి వర్గం నుంచి పోటీ చేస్తున్న మహిళను ‘పతివ్రత’ అంటూ తన పత్రికలో సంబోధించారు. ఇది నీలం సంజీవరెడ్డి వర్గానికి ఇబ్బందిగా పరిణమించి.. రామాచార్యుల వద్దకు వెళ్లి అలా పతివ్రత అని సంబోధించవద్దని కోరారు. దీంతో రామాచార్యులు తదుపరి సంచికలో ‘ఆమె పతివ్రత కాదట’ అని రాశారు. దీంతో నీలం సంజీవరెడ్డి వర్గం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. రామాచార్యులు వంటి చమత్కారులు ఇప్పటి శాసనసభలో ఉన్నారో లేదో తెలియదు. ఉంటే ‘ముండ’ అని పదం వాడిన వారిని ఏమని వ్యాఖ్యానించేవారో ఊహించుకోండి.
ప్రజలకు లేని హక్కులు ప్రజా ప్రతినిధులకా?
శాసనసభ లోపల, వెలుపల మంత్రులు, శాసనసభ్యులు వాడుతున్న భాష, వ్యవహరిస్తున్న తీరు గమనిస్తే అధికార పార్టీలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టు అనిపిస్తోంది. అవతలి పక్షం నుంచి వచ్చే ప్రశ్నలు, సవాళ్లకు సమాధానం చెప్పే సత్తా లేనివాళ్లే ముతక భాషను వాడతారు. జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఇదే పని చేస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాల్సిన శాసనసభ అలా ఉంటోందా? సభా గౌరవం దిగజారేలా ప్రవర్తిస్తున్నవారే ‘మా హక్కులు, అధికారాల సంగతేంటి?’ అని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం! ప్రజలకు లేని హక్కులు వారు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు ఎందుకుండాలి? శాసనసభలో ఏది మాట్లాడినా, ఎవరిని నిందించినా రక్షణ ఉంటుందన్న ఉద్దేశంతో కొంతమంది రెచ్చిపోతున్నారు. ఈ రక్షణ కారణంగానే హైకోర్టు తీర్పుపై చర్చ చేశారు. సభలో లేని నాపై ముఖ్యమంత్రి దుష్ప్రచారం చేస్తుంటే మాకున్న ప్రత్యామ్నాయం ఏమిటి? మేమేమైనా అంటే సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇస్తారు కదా? మరి మా హక్కులను ఎవరు రక్షించాలి? మీకు మాత్రమే హక్కులుంటాయా? మాకుండవా? అవున్లే... ముఖ్యమంత్రిగా ఉన్న తనను ఎవరూ ప్రశ్నించకూడదని భావిస్తున్న జగన్‌రెడ్డి పాలనలో ఇంతకంటే ఏం ఆశించగలం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్ అన్నట్టుగా ‘జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు... అయ్యారు. అయితే పాలన ఎలా చేయాలో ఆయనకు తెలియదు’! అధికారం అంటే బాధ్యత అని గుర్తించనప్పుడు ఇలాంటి విపరీత పోకడలే కనిపిస్తాయి. అయితే... శైలజానాథ్‌తో పాటు చాలా మందికి తెలియంది ఏమిటంటే, తాను ఎందుకు ముఖ్యమంత్రి కావాలనుకున్నారో జగన్‌రెడ్డికి మాత్రం బాగా తెలుసు. అందుకే ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. అర్థం చేసుకోలేకపోవడం మన తప్పే. జగన్‌రెడ్డి వ్యవహార శైలిని ఆయన కుటుంబ సభ్యులే భరించలేకపోతున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన తల్లి విజయమ్మ పరితపించారు. అప్పటి వరకు గృహిణి పాత్రకే పరిమితమైన విజయమ్మ... కుమారుడైన జగన్‌రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు ఆయన తరఫున ఎండనకా వాననకా ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో కూడా తన బిడ్డను ఆశీర్వదించాలని ప్రజలను వేడుకున్నారు. తల్లి అవసరాన్ని, రాజశేఖర రెడ్డిపై ప్రజలకు ఉన్న అభిమానాన్ని గుర్తించిన జగన్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించినప్పుడు విజయమ్మను గౌరవ అధ్యక్షురాలిగా ప్రకటించారు. ఇంతకాలం ఆ పదవిలో కొనసాగిన విజయమ్మ ఇటీవల పార్టీ గౌరవ అధ్యక్షురాలి బాధ్యతల నుంచి తప్పుకొంటానని జగన్‌రెడ్డి వద్ద ప్రతిపాదించారు. దీంతో కంగుతిన్న జగన్‌రెడ్డి వచ్చే పార్టీ ప్లీనరీ సమావేశం వరకు పదవిలో కొనసాగవలసిందిగా తల్లిని అభ్యర్థించారు. దీన్నిబట్టి అర్థమవుతున్నది ఏమిటంటే జగన్‌రెడ్డి పోకడలను కన్నతల్లి విజయమ్మ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చెల్లి షర్మిల విషయం అటుంచితే తల్లి మనసును కూడా చూరగొనలేకపోతున్న జగన్ పాలన గొప్ప పాలన అని ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ ఎవరైనా అలా కీర్తిస్తున్నారంటే వారు స్వార్థంతోనే కీర్తిస్తున్నారని చెప్పవచ్చు. తదుపరి ప్లీనరీ సమావేశం తర్వాత వైసీపీతో విజయమ్మ తన సంబంధాలను పూర్తిగా తెగతెంపులు చేసుకుంటారన్నమాట. శభాష్ జగన్‌రెడ్డీ! ఇలాగే సాగిపో ముందుకు! అయితే... బయట పల్లకీ మోత ఉన్నప్పుడు ఇంట్లో ఈగల మోత లేకుండా చూసుకోవాలి సుమా!
ఆర్కే

యూట్యూబ్‌లో
‘కొత్త పలుకు’ కోసం
QR Code
scan
చేయండి