అధికారం అండగా..

ABN , First Publish Date - 2021-06-23T07:37:56+05:30 IST

జిల్లాలో గత కొన్నేళ్లుగా రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం జరుగుతుండగా వారికి అధికారంలో ఏపార్టీ ఉన్నా ఆ నేతల నుంచి అంతోఇంతో సహకారం ఉండేది.

అధికారం అండగా..
ఉప్పుగుండూరులోని రైసు మిల్లులో పట్టుబడిన బియ్యంతో పౌరసరఫరాల శాఖ అధికారులు

రెచ్చిపోతున్న రేషన్‌ మాఫియా

అక్రమ వ్యాపారం కోసమే లీజుకు రైసుమిల్లులు 

రూ.కోట్లలో సంపాదన, అధికారులకు వాటాలు

ఇటీవల కాలంలో భారీగా వెలుగుచూస్తున్న అక్రమాలు

తాజాగా జిల్లాలో రూ.54లక్షల విలువైన బియ్యం పట్టివేత

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలో గత కొన్నేళ్లుగా రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం జరుగుతుండగా వారికి అధికారంలో ఏపార్టీ ఉన్నా ఆ నేతల నుంచి అంతోఇంతో సహకారం ఉండేది. అలాంటిది ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్‌ బియ్యం దందాలో పలు నియోజకవర్గాల్లో అధికారపార్టీకి చెందిన కీలక నేతల ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంటుండగా, మరికొన్నిచోట్ల వారి సమీప బంధువులు లేదా ముఖ్య అనుచరులు వ్యాపారంలోకి దిగారు. దీంతో జిల్లా అంతటా రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లాలో మొత్తం 9.99లక్షల కార్డులు ఉండగా నెలవారీ లక్షా 50వేల క్వింటాళ్ల రేషన్‌ బియ్యం ప్రభుత్వం కేటాయిస్తోంది. కొవిడ్‌ నేపథ్యంలో ప్రస్తుతం నెలకు రెండు కోటాలు ఇస్తుండటంతో 3 లక్షల క్వింటాళ్ల కేటాయింపు ఉంది. అయితే అందులో మూడొంతులకుపైగా అక్రమంగా తరలివెళ్తున్నాయి. లబ్ధిదారులకు కిలోకు రూ.10 చేతిలో పెట్టి బియ్యం తీసుకుంటున్న డీలర్లు రూ.15 నుంచి రూ.16కు వ్యాపారులకు అమ్ముతున్నారు. వారు రూ.20కి మిల్లర్లకు ఇస్తుండగా మిల్లర్లు రూ.25 లెక్కన బడా వ్యాపారులకు అమ్ముకొని కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు తరలిస్తున్నారు. 


అధికారపార్టీ నేతలే రంగంలోకి..

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు వైసీపీ నేతలే రంగంలోకి దిగి రేషన్‌ బియ్యం మాఫియా నడుపుతున్నారు. కొంతమంది మిల్లుల్లో రీసైక్లింగ్‌ చేసి ప్యాకింగ్‌ చేసి సాధారణ బియ్యంలాగా అమ్మకాలు చేస్తున్నారు. కాగా కొందరు అక్రమ వ్యాపారులు కొన్ని ప్రాంతాల్లో పలు కారణాలతో ఆగిపోయిన రైస్‌మిల్లులు లేదా కొద్దిపాటి రన్నింగ్‌లో ఉన్నవాటిని లీజుల పేరుతో తీసుకొని వాటి కేంద్రంగా అక్రమ రేషన్‌ బియ్యం వ్యాపారం చేస్తున్నారు. తాజాగా మంగళవారం అధికారుల దాడుల్లో నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో భారీగా అక్రమ వ్యాపారం కోసం నిల్వ చేసి ఉన్న రేషన్‌ బియ్యం వ్యవహారం వెలుగుచూసింది. జిల్లాలో అధికారపార్టీలో కీలక నేతగా పేరున్న ప్రజాప్రతినిధికి సమీప బంధువుగా చెప్పుకొనే ఒక వ్యక్తి దాదాపు ఏడాదిన్నరగా జిల్లాకేంద్రం పరిసర ప్రాంతాల్లో జోరుగా ఈ వ్యాపారం చేస్తున్నారు. సదరు వ్యక్తి మరికొంతమందిని భాగస్వాములను చేసుకొని ఉప్పుగుండూరులో ఒక మిల్లును లీజుకు తీసుకున్నారు. ఆ మిల్లు కేంద్రంగా ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని పలు మండలాల నుంచి బియ్యం కొనుగోలు చేసి అక్కడకు తరలిస్తున్నారు. కొంతమేర బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి అమ్మడం, మరికొంత బడా వ్యాపారులకు మంచి రేటుకు అమ్మేస్తున్నట్లు తెలిసింది. 


నాలుగు నెలల్లో రూ.12కోట్ల విలువైన బియ్యం స్వాధీనం

మంగళవారం అధికారుల దాడుల్లో సుమారు రూ.54లక్షల విలువైన బియ్యం పట్టుబడ్డాయి. కొన్ని గోతాల్లో మరికొంత రాసులుగా మిల్లుల్లో దొరికాయి. దానిపై అధికారులు 6ఏ కేసు నమోదు చేశారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో మరో మిల్లులోనూ సుమారు రూ.10లక్షల విలువైన బియ్యాన్ని అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఇలా గత మూడు నాలుగు నెలల్లో దాదాపు రూ.12కోట్ల విలువైన అక్రమ రేషన్‌ బియ్యాన్ని అధికారుల తనిఖీల్లో గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు 32 కేసులు నమోదు చేశారు. 


ముఖ్యనేతల ప్రత్యక్ష భాగస్వామ్యం

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ అక్రమ వ్యాపారం తీరు చూస్తే కొన్నిచోట్ల ముఖ్యనేతల ప్రత్యక్ష భాగస్వామ్యం కూడా ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు నగరంలో పోలీస్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండే ఒక మిల్లులో నిత్యం రేషన్‌ బియ్యం అక్రమ వ్యవహారం నడుస్తుండగా స్థానిక అధికార పార్టీ నేతల అండదండలు వారికి ఉన్నట్లు సమాచారం. ఒంగోలుకు చెందిన గుర్తింపు ఉన్న వైసీపీ నేత మద్దిపాడు మండలంలో  నడుపుతున్న మిల్లు కేంద్రంగా భారీగా రేషన్‌ బియ్యం అక్రమవ్యాపారం సాగుతోంది. ఒంగోలు పరిసరాలతో పాటు అద్దంకి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా అక్కడికి నిత్యం బియ్యం వస్తున్నాయి. అద్దంకి నియోజకవర్గంలో అద్దంకితోపాటు పంగులూరు మండలంలోని మరో మిల్లు కేంద్రంగా అక్రమవ్యాపారం సాగుతుండగా స్థానిక అధికారపార్టీ నేతల అండదండలు పూర్తిగా అక్రమ వ్యాపారులకు ఉన్నట్లు తెలుస్తోంది. చీరాల, పర్చూరు ప్రాంతాల్లో రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం చేసే వ్యాపారులు స్థానిక నేతలను ప్రసన్నం చేసుకొని ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో అధికారుల దాడుల్లో బెంబేలెత్తిపోయిన చీరాల ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి తిరిగి రెండు నెలల నుంచి రంగంలోకి వచ్చి జోరుగా వ్యాపారం కొనసాగిస్తున్నారు.

 

ఎక్కడికక్కడ దందా

దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలంలో ఒక మిల్లు, దర్శిలో మరో మిల్లు కేంద్రాలుగా జోరుగా బియ్యం అక్రమ వ్యాపా రం  సాగుతోంది. దర్శి, కనిగిరి, వినుకొండ ప్రాంతాల నుంచి ఇక్కడకు బియ్యం నిత్యం భారీగా వస్తున్నాయి. ఆ నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నేతలు ఒక బృందంగా ఏర్పడి ఈ వ్యాపారాన్ని సాగిస్తుండగా స్థాని క అధికారపార్టీ ముఖ్యనేత అండదండలు వారికి ఉన్నట్లు తెలుస్తోంది. కనిగిరి ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన కీలక నేతకు సన్నిహితుడైన ఒక వ్యక్తికి కూడా వ్యాపారంలో వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. కందుకూరు నియోజకవర్గంలో నలుగురైదు గురు అధికారపార్టీ ద్వితీయశ్రేణి నాయకులు ఒక బృందంగా ఏర్పడి కందుకూరు మండ లంలోని ఒక రైస్‌మిల్లు కేంద్రంగా జోరుగా వ్యాపారం చేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ కేంద్రంగా కొన్ని మండలాలు, కొండపి కేం ద్రంగా మరికొన్ని మండలాల రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయి. ఇక పశ్చిమ ప్రాంతంలోని నియోజకవ ర్గాల్లోనూ జోరుగానే ఈ వ్యాపారం కొనసాగుతోంది. అధికారపార్టీ వారితోపాటు అక్ర మ దందా చేస్తున్న కొందరు కీలక వ్యక్తుల మధ్య వస్తున్న విభేదాల కారణంగానే అప్పు డప్పుడూ బియ్యం వ్యవహారం బయటకు రావడం, ఆపై దాడులు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం జరిగిన రేషన్‌ దాడులు అదేతరహా కావడం గమనార్హం.  






Updated Date - 2021-06-23T07:37:56+05:30 IST