పీఆర్‌ వర్కుల బేరం !

ABN , First Publish Date - 2021-02-26T05:02:03+05:30 IST

జిల్లాలోని అధికార పార్టీ నేతలు మరో అడుగు ముందుకేశారు. ఇది ఏ అభివృద్ధి విషయంలోనో అనుకుంటే పొరపాటే..! వర్కులు తాము సూచించిన వారికి వచ్చేలా చేయడంలో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.

పీఆర్‌ వర్కుల బేరం !
పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయం

గ్రామీణ రహదారుల పనులపై అధికార పార్టీ నేతల పెత్తనం

కేంద్ర సహకారంతో రూ.71 కోట్లతో 13 రోడ్ల అభివృద్ధి

టెండర్లు పిలవకముందే బేరసారాలు

పది పర్సంట్‌ వరకు ఇవ్వాలంటూ డిమాండ్‌ 

డబ్బులొచ్చే పనులు కావడంతో కాంట్రాక్టర్ల ఆసక్తి.. మరోవైపు పర్సంటేజీతో వెనకడుగు


నెల్లూరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అధికార పార్టీ నేతలు మరో అడుగు ముందుకేశారు. ఇది ఏ అభివృద్ధి విషయంలోనో అనుకుంటే పొరపాటే..! వర్కులు తాము సూచించిన వారికి వచ్చేలా చేయడంలో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలో ఏదైనా వర్కుకు టెండర్లు పిలిచాక ఆసక్తి కలిగిన కాంట్రాక్టర్లు పోటీపడేవారు. ఇదే సమయంలో అధికార పార్టీ నేతలు లేక వారికి సంబంధించిన వ్యక్తులు కూడా టెండర్లు వేసేవారు. టెండర్ల సమయంలో ఇతర కాంట్రాక్టర్లు పాల్గొనకుండా వారిపై ఒత్తిడి తెచ్చి పనులు దక్కించుకునేవారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో వివాదాలు కూడా రేగాయి. 

 తాజాగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 13 ప్రధాన రహదారుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చజెండా ఊపాయి. నెల్లూరు నగర నియోజకవర్గం మినహాయిస్తే మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో అభివృద్ధి పరచనున్న రోడ్లున్నాయి. రూ.67 కోట్లతో నిర్మాణం, మరో రూ.4 కోట్లతో నిర్వహణ కలిపి దాదాపు రూ.71 కోట్ల విలువైన రోడ్డు పనులకు త్వరలో టెండర్లు పిలిచేందుకు పంచాయతీరాజ్‌(పీ ఆర్‌) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ వర్కులను ఎలాగైనా ‘క్యాష్‌’ చేసుకోవాలని భావించిన కొందరు అధికార పార్టీ నేతలు ముందుగానే బేరసారాలు మాట్లాడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎక్కువ పర్సంటేజీ ఇస్తే వారికి వర్కులు ఇచ్చేలా తెరవెనుక పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే టెండర్లలో ఎవరూ పోటీ పడకుండా ఇప్పటి నుంచే కాంట్రా క్టర్లకు పరోక్షంగా బెదిరింపు హెచ్చరికలు పంపుతుండడం చర్చనీయాంశమైంది. ‘మన ప్రాంతాల్లో మనల్ని కాదని ఎలా రోడ్డు పనులు చేస్తారో చూస్తాం’ అంటూ మాట్లాడుతుండ డంతో కాంట్రాక్టర్లు డైలమాలో పడ్డారు. 


13 రోడ్లు.. రూ.71 కోట్లు


ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన(పీఎంజీఎస్‌వై) పథకం భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 13 గ్రామీణ ప్రాంత రోడ్లను అభివృద్ధి చేస్తోంది. కేంద్రం 60 శాతం నిధులు సమకూరుస్తుండగా మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. పీఎంజీఎస్‌వై ఫేజ్‌-3లో కీలకమైన రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ఈ రోడ్ల నిర్మాణాలకు రూ.67 కోట్లు వెచ్చిస్తుండగా ఐదేళ్ల పాటు మెయింటెనెన్స్‌కు మరో రూ.4 కోట్లను ఖర్చు చేస్తున్నా రు. వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తి చేసేలా పంచాయతీ రాజ్‌ అధికారులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇవి కేంద్ర భాగస్వామ్యంతో జరిగే పనులు కావడంతో బిల్లుల విషయంలో ఇబ్బంది ఉండదు. త్వరగానే బిల్లుల చెల్లింపు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అలానే ఈ పనుల ఎస్టిమేషన్లు కూడా పక్కాగా ఉంటాయని, పనులు చేసిన వారికి నాలుగు రూపాయలు మిగిలే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు కూడా ఈ పనులపై ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్ర పరిధిలో చేసిన వర్కులకు కొన్నేళ్ల నుంచి బిల్లులు రాలేదు. ఇటీవల కొన్ని పనులకు టెండర్లు పూర్తయినప్పటికీ బిల్లులు వస్తాయో రావోనన్న భయంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎప్పుడూ లేని విధంగా దారుణ పరిస్థితులు నెలకొనడంతో కాంట్రాక్టర్లు ఆర్థికంగా చితికిపోతు న్నారు. ఈ కారణంగా కేంద్ర వర్కులైనా చేసుకుందామను కున్న వారికి అధికార పార్టీ నేతలు షాక్‌ ఇస్తున్నారు. 


వారిని కాదని టెండర్లు వేస్తే...


ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిని కాదని టెండర్లు వేస్తే తర్వాత పనులు చేయడం కష్టమని పలువురు కాంట్రాక్టర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. కొన్ని నియోజకవర్గాల్లో పది శాతం వరకు పర్సంటేజీ అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంత పర్సంటేజీ ఇస్తే వర్కులను లెస్‌కు వేయడం కష్టమని, ఒకవేళ వేసినా పనుల్లో నాణ్యత తగ్గించాల్సి ఉంటుందని కాంట్రాక్టర్ల వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు పనుల టెండర్లలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. ఎటువంటి ఒత్తిళ్లు లేకపోతే కాంట్రాక్టర్లు లెస్‌కు వేయడంతో పాటు పనులు కూడా నాణ్యతగా చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2021-02-26T05:02:03+05:30 IST