ప్రభంజనగణమన!

ABN , First Publish Date - 2022-08-17T10:32:32+05:30 IST

చుట్టూ ఎక్కడ చూసినా జనం.. అయినా అంతటా మౌనం అనే పరిమళం. పిన్నీసు పడ్డా వినిపించేంతటి ఆ నిశ్శబ్దలోంచి వినిపించింది జనగణమన గీతం.

ప్రభంజనగణమన!

రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయగీతాలాపన


పెద్దసంఖ్యలో పాల్గొన్న ప్రజలు, విద్యార్థులు

అబిడ్స్‌లో నెహ్రూ విగ్రహానికి పూలుజల్లి సీఎం జెండా వందనం 

ప్రత్యేక ఆకర్షణగా వనపర్తిలో 3వేల మీటర్ల జెండా 

మల్లారెడ్డి యూనివర్సిటీలో 30 వేల మంది విద్యార్థులతో కార్యక్రమం

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్స్‌లో చోటు

 (ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

చుట్టూ ఎక్కడ చూసినా జనం.. అయినా అంతటా మౌనం అనే పరిమళం. పిన్నీసు పడ్డా వినిపించేంతటి ఆ నిశ్శబ్దలోంచి వినిపించింది జనగణమన గీతం. నిలువెల్లా దేశభక్తి ఆవహించిన జనం నోటివెంట రాగయుక్తంగా పొంగిన ఆ ఆలాపన 52 సెకన్ల పాటు వీనులకు విందైంది.. ఆ దృశ్యం నేత్రపర్వమైంది!! అనంతరం ‘ జై బోలో భారత్‌ మాతా కీ’ అంటూ చేసిన నినాదాలు రోమాంచితులను చేశాయి. ఇలా రాష్ట్రమంతా సామూహిక జాతీయ గీతాలాపనలో మునిగి తరించింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు మంగళవారం ఉదయం 11:30 గంటలకు గ్రామాల్లోని కూడళ్లు.. పంచాయతీలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు.. అంగన్‌వాడీ కేంద్రాలు.. విద్యా సంస్థలు.. పట్టణ చౌరస్తాల వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ జెండాలు పట్టుకొని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ క్షణంలో రోడ్లపై పాదచారులు, వాహనాలపై వెళుతున్న వారు కూడా ఆగి కార్యక్రమంలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. వివిధ చోట్ల జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు పాల్గొన్నారు.


హైదరాబాద్‌ అబిడ్స్‌ జీపీవో చౌరస్తాలో జరిగిన సామూహిక గీతాలాపనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. ఉదయం 11:23 గంటలకు అక్కడికి చేరుకున్న సీఎం, నెహ్రూ విగ్రహం వద్ద పూలుజల్లి నివాళులర్పించారు. సరిగ్గా 11:30 గంటలకు సైరన్‌ మోగగానే ప్రజలతో కలిసి జాతీయగీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని, శ్రీనివా్‌సగౌడ్‌, ఎంపీలు కేకే, ఒవైసీ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా. 22న ఎల్బీ స్టేడియంలో జరిగే వజ్రోత్సవ ముగింపు వేడుకలకు కేసీఆర్‌ హాజరవుతారని కేకే వెల్లడించారు. కాగా వనపర్తిలో మంత్రి నిరంజన్‌ రెడ్డి తయారు చేయించిన 3వేల మీటర్ల పొడవైన జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ జెండాను మూడు కిలోమీటర్ల మేర పెద్ద సంఖ్యలో జనం పట్టుకొని నిల్చోవడం చూపరులను కట్టిపడేసింది. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌, యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి పాల్గొన్నారు. జేబీఎ్‌సలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సీపీ సజ్జనార్‌, విద్యుత్తుసౌధలో జరిగిన కార్యక్రమంలో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం చిన్ననందిగామలో వరి నాట్ల పనిలో మునిగివున్న మహిళలు సరిగ్గా 11:30 గంటలకు పొలంలోనే నిల్చుని జనగణమన ఆలాపించారు. కరీంనగర్‌ జిల్లా లోయర్‌ మానేరు జలాశయం గేట్ల వద్ద ఇరిగేషన్‌ సిబ్బంది, నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇక పంద్రాగస్టు రోజున ఆర్టీసీ జీహెచ్‌ఎంసీ పరిఽధిలో ప్రకటించిన టీ-24 టికెట్‌ (ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌) రాయితీకి భారీ స్పందన లభించింది. సాధారణ రోజుల్లో సగటున 11వేల మంది ఈ టికెట్‌ను కొంటే పంద్రాగస్టున ఏకంగా 33వేల మంది కొన్నారు.


30వేల మంది పిల్లల మధ్య.. 

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వేడుకల్లో మేడ్చల్‌ జిల్లాలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో  జరిగిన కార్యక్రమం ఎంతో ప్రత్యేకం!! ఎందుకంటే, మంత్రులు హరీశ్‌, మల్లారెడ్డి పాల్గొన్న ఈ వేడుకలో ఏకంగా 30వేల మంది విద్యార్థులతో నిర్వహించారు. ఏకకాలంలో ఇంతమంది విద్యార్థులతో సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించడం ఓ రికార్డు అని ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు అభివర్ణించింది. ఇందుకుగాను  మంత్రి మల్లారెడ్డికి ఆ సంస్థ ప్రతినిధులు అవార్డును అందజేశారు. 


అబిడ్స్‌ చౌరస్తాలోనే ఎందుకు? 

సామూహిక జాతీయ గీతాలాపన కోసం వేదికగా సీఎం కేసీఆర్‌ అబిడ్స్‌ జీపీవో చౌరస్తానే ఎందుకు ఎంచుకున్నారు? అక్కడే కార్యక్రమం నిర్వహించడంలో ఆంతర్యమేంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. పూర్వ హైదరాబాద్‌కు ఆబిడ్స్‌ ప్రధాన చౌరస్తా అని, అందుకే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నా ‘ప్రత్యేక కారణాలు’ ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట స్వాతంత్య్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న కేంద్రంలోని అధికార బీజేపీ, నాటి ప్రధాన ఉద్యమకారుడిగా ఉన్న నెహ్రూకు కనీస ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. పైగా కర్ణాటక ప్రభుత్వం పలు పత్రికలకు స్వాతంత్య్ర ఉద్యమకారులతో కూడిన చిత్రపటాలతో ఇచ్చిన ప్రకటనలో నెహ్రూ ఫొటోను చేర్చకపోవడం వివాదాస్పదమైంది. హైదరాబాద్‌లో అబిడ్స్‌ చౌరస్తా మినహా ఏ ప్రధాన చౌరస్తాలోనూ మాజీ ప్రధాని నెహ్రూ విగ్రహం లేదు. అందుకే వ్యూహాత్మకంగా నెహ్రూ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించినట్లు చెబుతున్నారు. పైగా అబిడ్స్‌, రాష్ట్ర బీజేపీలో కీలకనేత రాజాసింగ్‌ నియోజకవర్గంలో ఉండటం మరో కారణంగా విశ్లేషిస్తున్నారు.

Updated Date - 2022-08-17T10:32:32+05:30 IST