ప్రభాస్ కథానాయకుడిగా ‘కె.జి.యఫ్’ దర్శక, నిర్మాతలు చేయబోయే చిత్రానికి ‘సలార్’ టైటిల్ ఖరారు చేశారు. ప్రభాస్ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. ‘‘అత్యంత కిరాతకమైన, హింసాత్మకమైన మనుషులు ఓ మనిషిని ‘వయలెంట్’ అన్నారు’’ అని ఫస్ట్‌లుక్ పోస్టర్లో పేర్కొన్నారు. దీనిని బట్టి ప్రభాస్ వయలెంట్ మ్యాన్‌గా కనిపించబోతున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ‘సలార్’. ఈ సందర్భంగా చిత్రనిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ ‘‘మా సంస్థలో ‘కె.జి.యఫ్’, ‘కె.జి.యఫ్ 2’ తర్వాత నిర్మిస్తున్న మూడో పాన్ ఇండియా చిత్రమిది. వచ్చే ఏడాది జనవరిలో చిత్రీకరణ ప్రారంభించబోతున్నాం. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ విడుదలైన తర్వాత మా సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. భారతీయ భాషలన్నిటిలోనూ ‘సలార్’ను రూపొందిస్తాం’’ అన్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు.