ప్రాక్టికల్స్‌.. వసూల్‌!

ABN , First Publish Date - 2022-09-18T06:05:59+05:30 IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బీఈడీ ప్రయోగ పరీక్షల నిర్వహణలో మాయాజాలం జరిగింది.

ప్రాక్టికల్స్‌.. వసూల్‌!

బీఈడీ అధ్యాపకుల ద్విపాత్రాభినయం

ఏకకాలంలో ఎగ్జామినర్లు, స్క్వాడ్‌గా విధులు

ఓ కళాశాలలో మొదటి విడత ప్రయోగ పరీక్షలకు మంగళం

మార్కాపురం, సెప్టెంబరు 17: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో  బీఈడీ ప్రయోగ పరీక్షల నిర్వహణలో మాయాజాలం జరిగింది. ఈ పరీక్షల్లో అధ్యాపకులు ఏకసమయంలో ఎగ్జామినర్లుగా, స్క్వాడ్‌గా ద్విపాత్రాభినయం చేశారు. ఇక విశ్వవిద్యాలయం విడుదల చేసిన షెడ్యూల్‌ను సైతం లెక్క చేయకుండా మార్కాపురంలోని ఒక బీఈడీ కళాశాల అసలు ప్రయోగ పరీక్షలనే నిర్వహించ లేదు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో 2020-22 బీఈడీ ప్రయోగ పరీక్షలు ఈనెల 14న ప్రారంభమై 16తో ముగిశాయి. తొలివిడత విశ్వవిద్యాలయం పరిధిలోని 64 కళాశాలల్లో నిర్వహించారు. దాదాపు 7 వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు బేస్తవారపేట, తర్లుపాడు, చీరాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిర్వహణ కోసం ఎగ్జామినర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లలో ఒక కేంద్రంలో విధులు నిర్వహించే వారినే మరోకేంద్రంలో స్క్వాడ్‌ బృందం సభ్యులుగా నియమించారు. దీంతో పరీక్ష లక్ష్యాలను వీరు నీరుగార్చారు. కాసుల కోసం సమాజానికి ఉపాధ్యాయులను అందించే గురుతర బాధ్యతకు తిలోదకాలు వదిలారు. విశ్వవిద్యాలయంలోని ఒక అధికారి చక్రం తిప్పి మొదటి విడత బీఈడీ ప్రయోగ పరీక్షలలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఎగ్జామినర్లుగా వ్యవహరిస్తున్న వారినే స్క్వాడ్లుగా నియమించి, ఎగ్జామినర్‌ లేకుండానే పరీక్షల తంతును తూతూమంత్రంగా ముగించారు.

ఓ అధ్యాపకుడిని తర్లుపాడులో ప్రయోగ పరీక్షలు జరుగుతున్న కళాశాలలో ఎగ్జామినర్‌గా నియమించినట్లు రికార్డుల్లో చూపారు. ఆయన మార్కాపురంలోని రెండు కళాశాలలో తనిఖీలు నిర్వహించారు. 

ఫ మరొకరిని చీరాలలో ఒక బీఈడీ కళాశాలలో చీఫ్‌ సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్నట్లు చూపారు. ఆయన్నే రెండో రోజు కందుకూరులో ప్రయోగ పరీక్షలను తనిఖీ చేసినట్లు చూపి నాలుగు కళాశాలల నుంచి నజరానాలు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు అధ్యాపకుడిపై అనేక ఫిర్యాదులున్నా విశ్వవిద్యాలయంలోని కొందరి అండతో ఒకే రోజు రెండు డ్యూటీలను నిర్వహించారు.

 బేస్తవారపేటలోని ఒక కళాశాలలోని చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఒకరోజు స్క్వాడ్‌ బృందం సభ్యుడిగా విధులు నిర్వహిస్తూ రెండోరోజు మార్కాపురంలోని రెండు కళాశాలలను తనిఖీ చేశారు.

 ఏఎన్‌యూలోని ఒకే విద్యాశాఖకు చెందిన స్కాలర్‌, చీరాలలోని ఒక ప్రిన్సిపాల్‌, పలువురి అండతో ఏకకాలంలో రెండు విధులను నిర్వహిస్తూ ప్రయోగ పరీక్షలను పక్కదారి పట్టించారు. వీరిలో కొందరిపై గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. విశ్వవిద్యాలయ అధికారులు ఒకే విడత వందల కిలోమీటర్ల దూరంలో రెండు విధులు నిర్వహిస్తున్నట్లు చూపడం ద్వారా బోధన విద్య ప్రతిష్ఠను దిగజార్చింది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కందుకూరు, దర్శిల్లో కొందరు తనిఖీ బృందం సభ్యులు ఒక్కో కళాశాల నుంచి రూ.15వేల నుంచి రూ.25వేల వరకూ జేబులో వేసుకున్నారు. చీరాలకు చెందిన ఒక తనిఖీ బృందం సభ్యుడు ముందుగా తనిఖీల సమాచారం తెలియజేసి కవర్లు సిద్ధం చేయమన్నట్లు సమాచారం. 

పొదిలిలోని ఒక బీఈడీ కళాశాల యాజమాన్యం అసలు ప్రయోగ పరీక్షలను నిర్వహించలేదు. వర్సిటీ షెడ్యూల్‌ ప్రకారం మైనారిటీ గుర్తింపు ఉన్న సదరు కళాశాలలో తొలివిడత ఈ నెల 14 నుంచి 16 వరకూ ప్రయోగ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఆ కళాశాల యాజమాన్యం నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకొని నాల్గో విడతలో పరీక్షలకు అనుమతి ఇచ్చేందుకు వర్సిటీ అధికారులు పెద్దమొత్తంలో డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం.


Updated Date - 2022-09-18T06:05:59+05:30 IST