ప్రజా‘వాణి’ వినేవారేరీ?

ABN , First Publish Date - 2021-07-26T05:01:24+05:30 IST

ప్రజా‘వాణి’ వినేవారేరీ?

ప్రజా‘వాణి’ వినేవారేరీ?

‘ధరణి’పై కరుణించరూ కలెక్టర్‌ సారూ!

భూ సమస్యలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు 

కలెక్టర్‌ లాగిన్‌లోనే 700 దరఖాస్తులు పెండింగ్‌

ఖమ్మం కలెక్టరేట్‌, జూలై 25 : ప్రజావాణి సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదం చేస్తోంది. సోమవారం వచ్చిందంటే చాలు తమ ఇబ్బందులను ఏకరువు పెట్టుకునేందుకు జిల్లా పరిపాలనాధికారి కార్యాలయానికి ప్రజలు బారులు తీరుతున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కలెక్టర్‌ లాంటి సర్వోన్నతాధికారులకు పిర్యాదు చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం.. అదీ త్వరితగతిన లభిస్తుందన్న భరోసాతో ఉంటున్నారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం ప్రజా‘వాణి’ని పట్టించుకోవడం లేదని, సమస్యల పరిష్కారం విషయంలో ప్రజలకు భరోసాను కల్పించలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. కొద్దిరోజులుగా ధరణిలో చిన్నచిన్న సమస్యలకు కూడా పరిష్కారం లభించక ప్రజలు, రైతులు తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కలెక్టర్‌ లాగిన్‌లోనే సుమారు 700దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వీపీ గౌతమ్‌.. పెండింగ్‌లో ఉన్న భూ మసస్యలకు పరిష్కారం చూపుతారని జిల్లా ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. 

పలు సమస్యలతో దరఖాస్తుల పెండింగ్‌ 

జిల్లాలో సేత్వార్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌) ఆధారంగా ధరణి వెబ్‌సైట్‌లో ప్రతీ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ దస్ర్తాలను విస్తీర్ణం సహా గతంలో నమోదు చేశారు. ఏయే సర్వే నెంబర్లతోనైతే దస్ర్తాల్లో అదనపు విస్తీర్ణం నమోదు చేసి ఉందో పాస్‌పుస్తకాల ద్వారా వాటి మ్యుటేషన్‌ సాధ్యం కావడం లేదు. సాంకేతిక సమస్యలతో, భూ వివాదాల కారణంగా భూ యాజమాన్య హక్కులపై సమస్యలు పేరుకుపోతున్నాయి. అసలు భూమి ఉన్నా లేకున్నా పాస్‌పుస్తకాలు ఇవ్వడం, భూ క్రయ విక్రయాలు జరిగినా వాటి వివరాలు సక్రమంగా నమోదు కాకపోవడంతో పెండింగ్‌ పడిపోతున్నాయి. జిల్లాలో ఈ తరహా 200 దరఖాస్తులు కలెక్టర్‌ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. రైతులు తమ భూ యాజమాన్య హక్కుల కోసం ఆరాటపడుతున్నారు. జిల్లాలో రెండేళ్ల క్రితం నిర్వహించిన ఎల్‌ఆర్‌యూపీ కార్యక్రమంలో పార్ట్‌ బి కింద వందల కోర్టు వివాదాలు ఉన్న భూములను, అన్నదమ్ములు, ఇతర వివాదాస్పద భూములను ధరణిలోకి ఎక్కించకుండా పెండింగ్‌లో పెట్టారు. సుమారు ఇలాంటి భూములకు పాస్‌పుస్తకాల పంపిణీ చేయలేదు. పార్ట్‌బిలో కోర్టు వివాదాస్పద భూముల జోలికి వెళ్లకుండా మ్యుటేషన్లు, మిస్సింగ్‌ నెంబర్లు, అన్‌సైన్డ్‌  భూములకు సంబందించిన దరఖాస్తులు కలెక్టర్‌ లాగిన్‌లో సుమారు 700 వరకు ఉన్నట్టు సమాచారం. ఇలాంటి దరఖాస్తులపై కలెక్టర్‌ గౌతమ్‌ దృష్టిసారిస్తే సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుంతుందని ప్రజలు భావిస్తున్నారు. 

సమస్యలకు పరిష్కారం లభిస్తుందా...?

ఖమ్మం జిల్లాలో 20 మండలాల్లోని 589 గ్రామపంచాయతీల్లో 7లక్షల6వేల ఎకరాల సాగుభూమి ఉంది. రెండు రెవెన్యూ డివిజన్లలోనూ 3,04,520 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అయితే భూ సరిహద్దుల విషయంలో ఇబ్బందులు తక్కువగానే ఉన్నా నేటికీ పట్టాలు లేని వారి సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదు. రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలను రూపుమాపేందుకు ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాగా.. కొత్త చట్టం ప్రకారం వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వ్యవహారాల్లో ధరణి పోర్టల్‌ కీలకంగా మారింది. వ్యవసాయ భూములను తహసీల్దార్‌, వ్యవసాయేతర భూములను సబ్‌రిజిస్ట్రార్‌ రిజిస్ర్టేషన్‌ చేయడంతో పాటు ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌ విధానం అమల్లోకి వచ్చింది. అయినా జిల్లాలో దాదాపు నిషేధిత భూముల సర్వే నెంబర్లలో తమ సొంత భూములు రిజిస్టర్‌ కాక, క్రమబద్ధీకరణకు నోచుకోక, పట్టాపుస్తకాలు రాక అవస్థలు పడుతున్నారు. సుమారు 450 ఈ తరఖా దరఖాస్తులు కలెక్టర్‌ లాగిన్‌లో పెండింగ్‌లో ఉండగా.. వీటిపరిష్కారం కోసం రైతులు, ప్రజలు ఆర్డీవో, తహసీల్దార్‌, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 

Updated Date - 2021-07-26T05:01:24+05:30 IST