కృష్ణమ్మ పరుగులు

ABN , First Publish Date - 2022-08-10T06:08:15+05:30 IST

ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.

కృష్ణమ్మ పరుగులు

ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద

  ఎగువ నుంచి 1.25 లక్షల క్యూసెక్కుల రాక

  2 అడుగుల మేర 70 గేట్లు ఎత్తివేత... 

  సముద్రంలోకి లక్షా 590 క్యూసెక్కులు

విజయవాడ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి) : ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. బ్యారేజీ వద్ద గరిష్ట నీటిమట్టాన్ని నిర్వహించడానికి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి బ్యారేజీకి లక్షా25వేల369 క్యూసెక్కుల నీరు వస్తోంది. 70 గేట్లను రెండు అడుగుల మేరకు ఎత్తి లక్షా5వేల90 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి 67,742 క్యూసెక్కులు, పాలేరు నుంచి 10,595, కీసర నుంచి 54,032 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతోంది. కాల్వలకు మొత్తం 7395 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. కేఈబీకి 1104, బందరు కాల్వకు 750, ఏలూరు కాల్వకు 1021, రైవస్‌ కాల్వకు 2216, కృష్ణా పశ్చిమ కాల్వకు 2304 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

  గన్నవరం రైతుల కోసం...

గన్నవరం రైతుల కోసం పశ్చిమగోదావరి జిల్లాలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుడి కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. వాస్తవానికి పట్టిసీమ నుంచి పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా నదికి గోదావరి నీరు వచ్చేది. కృష్ణా నదికి జూలై నుంచి వరదలు ప్రారంభం కావడంతో పట్టిసీమతో పనిలేకుండా పోయింది. గన్నవరం రైతుల సాగునీటి అవసరాలు మొత్తం పోలవరం కుడి కాల్వతో ముడిపడి ఉన్నాయి. మోటార్లు ద్వారా నీటిని తోడుకుని చెరువులను నింపుకుంటున్నారు. పట్టిసీమ ఆగడంతో పోలవరం కాల్వలో నీటి సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో కొంతమంది రైతులు కొద్దిరోజుల క్రితం జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును కలిసి పరిస్థితి విన్నవించుకున్నారు. ఆయన ఆదేశాలతో తాడిపూడి ఎత్తిపోతల పథకంలో ఒక పంపును ఆన్‌చేసి 750 క్యూసెక్కుల గోదావరి నీటిని పోలవరం కుడి కాల్వకు వదులుతున్నారు.  



Updated Date - 2022-08-10T06:08:15+05:30 IST