Gundlakamma project: డెడ్‌ స్టోరేజీకి చేరిన గుండ్లకమ్మ జలాశయం

ABN , First Publish Date - 2022-09-05T01:04:46+05:30 IST

ప్రకాశం జిల్లా (Prakasam District)లోని గుండ్లకమ్మ ప్రాజెక్టు (Gundlakamma project)లో నిల్వ ఉన్న నీటిలో దాదాపు 85శాతం మేర వృథా అయింది.

Gundlakamma project: డెడ్‌ స్టోరేజీకి చేరిన గుండ్లకమ్మ జలాశయం

ఒంగోలు: ప్రకాశం జిల్లా (Prakasam District)లోని గుండ్లకమ్మ ప్రాజెక్టు (Gundlakamma project)లో నిల్వ ఉన్న నీటిలో దాదాపు 85శాతం మేర వృథా అయింది. అది ఇంచుమించు మూడు టీఎంసీల వరకూ ఉంటుంది. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఉన్న 15 గేట్లలో ఈనెల 31వతేదీ రాత్రి ఒక గేటు విరిగిపోయి కొట్టుకుపోయిన విషయం విదితమే. దాని వల్ల రిజర్వాయర్‌లో నీరు బయటకుపోతుండగా తాత్కాలికంగా డమ్మీ గేటు ఏర్పాటు ప్రయత్నాలు మూడు రోజులుగా  ముందుకు సాగలేదు. చివరకు ప్రాజెక్టు నీటిని డెడ్‌ స్టోరేజీకి తెస్తే తప్ప మరమ్మతులు సాధ్యం కాదని నిపుణులు తేల్చడంతో విరిగిపోయిన గేటు ద్వారా పోతున్న దానికితోడు మరో నాలుగు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదిలేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 3.85 టీఎంసీలు కాగా గేటు దెబ్బతినే నాటికి 3.40టీఎంసీలుగా ఉంది. 


అందులో దాదాపు 3 టీఎంసీలకు పైన దిగువకు వదిలేయగా అంతా సముద్రంపాలైంది. ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీకి చేరడంతో ఆదివారం డమ్మీగేటు ఏర్పాటుకు వీలైంది. మూడు రోజుల క్రితం డమ్మీగేటు ఏర్పాటు కోసం ప్రయత్నించి ఒక సెగ్మెంట్‌ను దించగా ప్రవాహ ఉధృతికి అది కూడా వంగిపోయిన విషయం తాజాగా బయటపడింది. దాన్ని క్రేన్‌ సహాయంతో అధికారులు సరిచేయడంతోపాటు ఆదివారం సాయంత్రానికి మరో సెగ్మెంట్‌ అమర్చారు. మరోరెండు సెగ్మెంట్లు పెడితేనే ఆగేటుకు తాత్కాలిక మరమ్మతులు పూర్తవుతాయి. తదనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. కాగా ప్రాజెక్టు గేట్లు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేంత వరకు రిజర్వాయర్‌లో సగం నీటిని కూడా నిల్వ చేసే అవకాశం కనిపించడం లేదు. దీనివల్ల ఈ ఏడాది సాగుపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-09-05T01:04:46+05:30 IST