Prakash Raj Vs BJP Politics: బీజేపీని వ్యతిరేకించడంలో దిట్ట ప్రకాశ్ రాజ్

ABN , First Publish Date - 2022-09-01T22:56:07+05:30 IST

బహు భాషా నటుడు ప్రకాశ్ రాజ్‌ భారతీయ జనతా పార్టీ అనుసరించే విధానాలను

Prakash Raj Vs BJP Politics: బీజేపీని వ్యతిరేకించడంలో దిట్ట ప్రకాశ్ రాజ్

న్యూఢిల్లీ : బహు భాషా నటుడు ప్రకాశ్ రాజ్‌ భారతీయ జనతా పార్టీ అనుసరించే విధానాలను ఎండగట్టడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. తాను హిందుత్వానికి వ్యతిరేకం కాదని, కేవలం మోదీ, అమిత్ షాలకు మాత్రమే వ్యతిరేకమని ఆయన బల్ల గుద్ది  మరీ ప్రకటించుకుంటారు. అసలు వాళ్లిద్దరూ హిందువులే కాదని కుండబద్దలు కొడుతుంటారు. #జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన ఇచ్చే ట్వీట్లు కొందరికి ఆగ్రహాన్ని తెప్పిస్తే, మరికొందరికి సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తూ ఉంటాయి. అలాగే వినాయక చవితి సందర్భంగా ఆయన మరొక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్యానం చేసుకుంటూండగా, వినాయకులు ఆయనకు ఇరువైపులా నిల్చున్నట్లు, వినాయకుడు ఆరెస్సెస్ యూనిఫాం ధరించినట్లు, కేజీఎఫ్, అల్లు అర్జున్‌లను గుర్తు చేస్తూ వినాయకుడి విగ్రహాలను రూపొందించడాన్ని గట్టిగా ప్రశ్నించారు.  ఇలాంటివాటి వల్ల మనోభావాలు దెబ్బతినవా? అని నిలదీశారు.


మైనస్ మార్కులు

ప్రకాశ్ రాజ్ సందర్భం వచ్చిన ప్రతిసారీ కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల పనితీరును ప్రశ్నిస్తూనే ఉంటారు. గత నెలలో కర్ణాటకలోని మైసూరులో మైసూరు జిల్లా పాత్రికేయుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు. విలేకర్ల ప్రశ్నలకు స్పందిస్తూ, అవకాశం ఉంటే కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలకు తాను మైనస్ మార్కులు ఇస్తానన్నారు. మైనస్ మార్కులివ్వడానికి వీల్లేదు కాబట్టి, తాను ఆ ప్రభుత్వాలకు సున్నా మార్కులు ఇస్తున్నానని చెప్పారు. 30 కన్నా తక్కువ మార్కులు వస్తే ఫెయిలయినట్లే కదా! అన్నారు. సాగు భూముల కొనుగోళ్ళపై ఆంక్షలన్నీ తొలగించారని, ఉద్యోగ కల్పనకు ఏమాత్రం కృషి చేయడం లేదని, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో దాని ప్రభావం నిత్యావసరాల ధరలపై పడుతోందని మండిపడ్డారు. దార్శనికత లేకుండా ప్రభుత్వాలను ఎలా నడుపుతారని నిలదీశారు. 


ఇంటింటా త్రివర్ణ పతాకంపై...

స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ఇంటింటా త్రివర్ణ పతాకం కార్యక్రమం గురించి విలేకర్లు ప్రస్తావించినపుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ, నిత్యావసరాల ధరలను తగ్గించడం, ఉద్యోగాలను కల్పించడం ద్వారా  దేశ భక్తిని ప్రోత్సహించాలన్నారు. చేనేత పరిశ్రమలోని కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతూ ఉంటే జాతీయ జెండాలను పాలిస్టర్‌తో తయారు చేయడానికి అనుమతించడంపై మండిపడ్డారు. పాలపై సైతం జీఎస్‌టీని విధిస్తున్నారని, ఇటువంటి సమయంలో తాను ఆ ప్రభుత్వాలకు ఎలా మార్కులివ్వగలనని ప్రశ్నించారు. 


గళమెత్తే నటుడు

ప్రకాశ్ రాజ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు. దీనిపై అప్పట్లో ఆయన స్పందిస్తూ, తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజా గళంగానే ఉన్నానని, అదే శక్తిమంతమైనదని తాను భావిస్తానని తెలిపారు. తాను గళమెత్తే నటుడిగానే కొనసాగుతానని తెలిపారు. 


ప్రజలదే బాధ్యత

దేశంలో పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశారని, దీనిని చక్కదిద్దడం ఏ నాయకుడికీ సాధ్యం కాదని, కేవలం ప్రజలు మాత్రమే దీనిని సరిదిద్దాలని అన్నారు. 


నా కోసం రోడ్డు వేయండి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేవలం కొద్ది గంటలపాటు పర్యటించేందుకు వచ్చినపుడు కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు వేస్తున్నారని, వీథి దీపాలను మరమ్మతు చేస్తున్నారని, హోర్డింగులను తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. పన్ను చెల్లించే ప్రజల కోసం రోడ్లు వేయాలన్నారు. ‘‘నా కోసం రోడ్లు వేయండి, నేను పన్ను చెల్లిస్తున్నాను’’ అన్నారు. 



జాతీయ చిహ్నంపై...

ఈ ఏడాది జూలైలో నూతన పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. దీనిలోని సింహాలు గర్జిస్తున్నట్లుగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీనిని కూడా ప్రకాశ్ రాజ్ తన #జస్ట్ఆస్కింగ్ సిరీస్‌లోని ఓ ట్వీట్లో ప్రశ్నించారు. శ్రీరాముడు, హనుమంతుడు, జాతీయ చిహ్నం గతంలో ఎలా ఉండేవో, ఇప్పుడు వాటిని ఎలా మార్చారో వివరించే ఫొటోలను ట్వీట్ చేశారు. గతంలో శ్రీరాముడు చిరుమందహాసంతో ఉండేవాడని, ఇప్పుడు విల్లంబులు చేబూని ఆగ్రహంతో కనిపిస్తున్నాడని, అదేవిధంగా హనుమంతుడు ప్రశాంత వదనంతో కనిపించేవాడని, ఇప్పుడు తీవ్రమైన కోపంతో ఉన్నట్లు కనిపిస్తున్నాడని, జాతీయ చిహ్నంలోని సింహాలు ప్రశాంతంగా, గంభీరంగా ఉండేవని, నూతన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నంలోని సింహాలు గర్జిస్తున్నట్లు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. మనం ఎక్కడికి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.


ఆ హంతకులు పేదలే ఎలా?

2018లో ప్రకాశ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మతాన్ని కాపాడటం మంచిదేనని, అయితే హిందుత్వం పేరుతో హత్యలు చేసేవారు పేదలేనని, ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. వాళ్లు మురికివాడల్లోనే ఎందుకు పుడుతున్నారన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు ఉండటం లేదన్నారు. నాయకుల ఇళ్లల్లో అలాంటివాళ్లు ఎందుకు పుట్టడం లేదన్నారు. ఇది సమాజం అడగవలసిన ప్రశ్న అని చెప్పారు. 


భయపడే పరిస్థితి

కర్ణాటకలో బీజేపీ భయపడే పరిస్థితిని సృష్టించిందని, డబ్బు కీలక పాత్ర పోషించిందని అందరూ అంగీకరిస్తారన్నారు. ఓటర్లు ఓటు వేసే ముందు మాటలతో సంతృప్తి చెందడం లేదని, డబ్బును కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికలను ఈ స్థాయికి దిగజార్చింది ఎవరని ప్రశ్నించారు. తమ దారి నుంచి కాంగ్రెస్‌ను తప్పించడమే బీజేపీ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు.


అమిత్ షా ఎక్కడికెళ్లినా ఎవరో ఒకర్ని కొంటారు

‘‘అమిత్ షా ఏం చేస్తారు? మఠాలకు వెళ్తారు, మత పెద్దలను కలుస్తారు, రాజకీయాలను ఎలా మార్చారు? హిందుత్వం అనేది వేరు. హిందూయిజం అనేది వేరు. హిందూయిజం అంటే జీవన విధానం, మనకున్న గొప్ప మతాల్లో అదొకటి. సహనశీలతగల మతం, అది అందరినీ కలుపుకుంటుంది. దాన్ని వాళ్ళు ఎలా మార్చారు? అమిత్ షా ఎక్కడికెళ్లినా ఎవరో ఒకర్ని కొంటారు. ఇలాంటి నేతలా మనకు కావలసింది?’’ అని మండిపడ్డారు.


సమాజానికి తిరిగి ఇవ్వాలనే...

సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశామని, తన ఆదాయంలో 25 శాతం సొమ్మును ఈ ఫౌండేషన్‌‌కు ఇస్తున్నానని తెలిపారు. తెలంగాణాలోని కొండా రెడ్డి పల్లిని దత్తత తీసుకున్నామని చెప్పారు. 


                                               - యెనుములపల్లి వేంకట రమణ మూర్తి



Updated Date - 2022-09-01T22:56:07+05:30 IST