ప్రణాళిక దారి తప్పిందా?

ABN , First Publish Date - 2022-05-18T06:48:25+05:30 IST

కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేపట్టేటప్పుడు ప్రణాళిక ఉండాలి. అది పది కాలాల పాటు ఉండేలా ప్లాన్‌ చేయాలి.

ప్రణాళిక దారి తప్పిందా?
సీసీ ర్యాంప్‌లు వేయాల్సిన ప్రాంతం

తొరడంవలస జంక్షన్‌ నుంచి అంటిపర్తి గ్రామం వరకు రోడ్డు విస్తరణ

రూ.1.33 కోట్లతో పనులు ప్రారంభం

ఎత్తుపల్లాలు సరి చేయకపోవడం, సీసీ ర్యాంప్‌లు నిర్మించకపోవడంపై విమర్శలు

పాత మట్టి రోడ్డునే విస్తరించడం వల్ల ప్రయోజనం శూన్యమని పలువురి అభిప్రాయం

ఇలా అయితే వర్షాలకు కొట్టుకుపోయే అవకాశం


అరకులోయ, మే 17:కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేపట్టేటప్పుడు ప్రణాళిక ఉండాలి. అది పది కాలాల పాటు ఉండేలా ప్లాన్‌ చేయాలి. దాని వల్ల ప్రజలకు ఎంత వరకు ప్రయోజనం కలుగుతుందో ఆలోచించాలి. అయితే లోతేరు పరిధిలోని తొరడంవలస జంక్షన్‌ నుంచి అంటిపర్తి గ్రామం వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల విషయంలో ఇంజనీరింగ్‌ అధికారులు ఇటువంటిదేమీ చేయలేదన్న విమర్శలున్నాయి. ఈ మార్గంలో ఎత్తుపల్లాలు, మలుపులను తగ్గించి, పలు చోట్ల సీసీ ర్యాంప్‌లను నిర్మించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని పలువురు చెబుతున్నారు.

మారుమూల గ్రామ పంచాయతీ లోతేరు పరిధిలోని తొరడంవలస జంక్షన్‌ నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరాన కొండపై ఉన్న అంటిపర్తి గ్రామం వరకు మిషన్‌ కనెక్ట్‌ పాడేరు పేరుతో రూ.1.33 కోట్ల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఈ పనులను నెల రోజుల క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం మట్టి రోడ్డుగా ఉన్న దీనిని విస్తరించి గ్రావెల్‌ రోడ్డు వేయాలని ఇంజనీరింగ్‌ అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఈ మట్టి రోడ్డు వేశారు. అయితే అప్పట్లో అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు తెలపడంతో పనులు నిలిచిపోయా యి. కొండలపైనా, సరైన రహదారి లేక డోలీమోతలతో  వైద్యం పొందుతున్న కొండశిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ  ప్రత్యేక చొరవతో మిషన్‌ కనెక్ట్‌ పాడేరు పేరుతో రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మండలంలో 16 రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. 

సరైన ప్రణాళిక లేకపోవడంతో..

ఇంజనీరింగ్‌ అధికారులకు సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల పాత రోడ్డును కొంచెం విస్తరించి మట్టిని సరిచేసేస్తున్నారని పలువురు ఆరోపిసు ్తన్నారు. ఎత్తుపల్లాలను తగ్గించకుండా, పలు చోట్ల సీసీ ర్యాంప్‌లు నిర్మించకుండా పనులు చేస్తున్నారని చెబుతున్నారు. దీని వల్ల ప్రయోజనం ఉండదని, వర్షాలు వస్తే రోడ్డు కొట్టుకుపోతుందని అంటు న్నారు. దుద్‌కొండి గ్రామం నుంచి ముసిరిగుడ, అంటిపర్తి మధ్య కొండ ఎక్కుతున్న మాదిరిగా రహదారి అంతా ఘాటీగా ఉంది. అంతే కాకుండా ప్రమాదకర మలుపులు కూడా ఉన్నాయి. ఇటువంటి చోట్ల అవకాశం ఉన్నంత మేర రహదారిని మార్పు చేసి ప్రమాదకర మలుపులు, ఘాటీ తగ్గించే విధంగా ఇంజనీరింగ్‌ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు సూచిస్తున్నారు. అదే విధంగా పలు చోట్ల సీసీ ర్యాంప్‌లు నిర్మించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఇలా అయితే వర్షాకాలంతో సరి..

ప్రస్తుతం నిర్మిస్తున్న రోడ్డు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, వర్షాకాలంలో కొట్టుకు పోతుందని పలువురు చెబుతున్నారు. రహదారి వేసే సమయంలో అవసరమైన చోట అటవీశాఖ అనుమతులు తీసుకోవడంతో పాటు ఆ ప్రాంత రైతుల భూములను కూడా సేకరించి సాధ్యమైనంత వరకు ఎత్తుపల్లాలు, ఎక్కువ మలుపులు లేకుండా పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. అదే విధంగా వర్షాలకు కోతకు గురయ్యే అవకాశం ఉన్న చోట్ల సీసీ ర్యాంప్‌లను నిర్మిస్తే బాగుంటుందని అంటు న్నారు. ఈ విషయంలో ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లు చొరవ చూపాలని అంటున్నారు. పనులను పర్యవేక్షిస్తున్న టీడబ్ల్యూ ఇంజనీరింగ్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మిషన్‌ కనెక్ట్‌ పాడేరు లక్ష్యం నెరవేర్చాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-18T06:48:25+05:30 IST