వనామీపై సునామీ

ABN , First Publish Date - 2021-07-22T05:04:18+05:30 IST

వనామీపై సునామీ

వనామీపై సునామీ
చనిపోయిన రొయ్యలు

ఆక్వా రైతులకు ప్రతికూల వాతావరణం

వర్షాలకు ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయి చనిపోతున్న రొయ్యలు

వైరస్‌ ప్రభావం కూడా ఎక్కువే.. 

జిల్లావ్యాప్తంగా రూ.కోట్లలో నష్టం

ముదినేపల్లి/కలిదిండి : వాతావరణంలో మార్పులు ఆక్వా రంగాన్ని నాశనం చేస్తున్నాయి.  రొయ్యలకు వైరస్‌ సోకి పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి. వారం రోజులుగా వాతావరణంలో చల్లదనం పెరగటంతో చెరువుల్లో ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడి పోయి రొయ్యలు చనిపోతున్నాయి. దీంతో చెరువుల్లో ఎడతెరిపి లేకుండా ఏరియేటర్లను తిప్పుతూనే ఉన్నారు. నీటి మార్పిడి కూడా ఇదే సీజన్‌లో జరుగుతుంది. కాబట్టి వైరస్‌లు సంభవిస్తాయి. వైట్‌ స్పాట్‌, ఈహెచ్‌పీ వ్యాధులు సోకి రొయ్యలు అధిక సంఖ్యలో చనిపోతున్నాయి.

భారీగా చనిపోతున్న రొయ్యలు

ముదినేపల్లి మండలంలో సుమారు 4వేల ఎకరాల రొయ్యల చెరువుల్లో వైరస్‌ వ్యాప్తి చెంది కోట్లాది రూపాయల నష్టాలు సంభవించాయి. సుమారు 2వేల ఎకరాల్లోని రొయ్యలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ మండలంలోని వివిధ గ్రామాల రైతుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. వర్షాలు కురవటం, వాతావరణంలో చల్లదనం పెరగటం వంటి కారణాలతో సుమారు రూ.300 కోట్ల విలువైన రొయ్యలు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక కలిదిండి మండలంలో సుమారు 15వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. మట్టగుంట, యడవల్లి, కొండంగి, సంతోషపురం, కాళ్లపాలెం, మూల్లంక, సున్నంపూడి గ్రామాల్లోని చెరువుల్లో రొయ్యలు చనిపోతుండటంతో చిన్నసైజు రొయ్యలనే పట్టుబడి చే స్తున్నారు. ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. కనీసం ఖర్చులు కూడా రాకపోవటంతో అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన రొయ్యలు ఎరుపు రంగులోకి మారటంతో వ్యాపారులు కొనట్లేదు. ఆకస్మాత్తుగా రొయ్యలు చనిపోతుండటంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు కొంటున్నారు. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. 

ఏరియేటర్లే శరణ్యం

వాతావరణంలో చల్లదనం పెరిగినప్పుడు ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతాయి. వీటిని పెంచేందుకు చెరువుల్లో ఏరియేటర్లను నిరంతరం వినియోగించటం ప్రధానం. మేత తక్కువ వాడాలి, మినరల్స్‌, ప్రోబయోటిక్స్‌ పదిరోజులకోసారి వినియోగించాలి.  - హేమానందకుమార్‌, మత్స్యశాఖ అధికారి 




Updated Date - 2021-07-22T05:04:18+05:30 IST