ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ చీఫ్ పగ్గాలివ్వాలని సూచించిన పీకే..?

ABN , First Publish Date - 2022-04-27T20:59:05+05:30 IST

ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ చీఫ్ పగ్గాలు ఇవ్వాలని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ అధిష్ఠానానికి ..

ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ చీఫ్ పగ్గాలివ్వాలని సూచించిన పీకే..?

న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ చీఫ్ పగ్గాలు ఇవ్వాలని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ అధిష్ఠానానికి సూచించారా? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. రెండు వారాల వాడివేడి చర్చ అనంతరం కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారంనాడు ఎవరి మార్గం వారు ఎంచుకున్నారు. కాంగ్రెస్‌లో చేరడం లేదని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. పార్టీని పునరుద్ధరించేందుకు అవసరమైన స్వేచ్ఛ, సీనియర్ హోదాను ఆయన ఆశించడం, ఇందుకు భిన్నంగా ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించే సాధికారిక బృందంలో సభ్యుడిగా ఉండాలని అధిష్ఠానం ప్రతిపాదించడం, దానికి  ఆయన తిరస్కరించడంతో కాంగ్రెస్‌లో పీకే చేరతారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. పీకేను కాంగ్రెస్‌లో చేర్చుకునే విషయంలో సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉండగా, తనకంటే కూడా పార్టీలో లోతుగా వేళ్లూనుకున్న సంస్థాగత సమస్యలను గుర్తించే నాయకత్వం, సమష్టి కృషి కాంగ్రెస్‌కు ఇప్పుడు చాలా అవసరమనే అభిప్రాయాన్ని పీకే వ్యక్తం చేశారు.


పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, పార్టీలో సంస్థాగత మార్పులు జరగాలని పీకే సూచించారు. పీఎం అభ్యర్థిగా ఒకరు, పార్టీ చీఫ్‌గా మరొకరు...అంటే రెండింటికీ ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఉండాలనేది ఆయన ప్రధాన సూచన. కాంగ్రెస్‌కు ప్రియాంక గాంధీ సారథ్యం (పార్టీ చీఫ్) వహించాలని పీకే సూచించారట. అయితే పార్టీ నేతలు మాత్రం మరోసారి కాంగ్రెస్ చీఫ్‌ పగ్గాలు రాహుల్‌కు అప్పగించడానికే మొగ్గుచూపారని చెబుతున్నారు.


కాగా, సాధికారిక బృందంలో ఉండేందుకు పీకే నిరాకరించడంతో అదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మంగళవారంనాడు అధికారికంగా ప్రకటించింది. దీనిపై కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్న నిర్ణయం కాబట్టి దానికి తామంతా కట్టుబడి ఉంటామని చెప్పారు. పార్టీని జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పటిష్టం చేసేందుకు ప్రశాంత్ కిషోర్ విలువైన సలహాలను ఇచ్చినట్టు పేర్కొన్నారు. పీకే అనుభవంపై తమకు బలమైన విశ్వాసం ఉందని, పార్టీకి అది ఉపకరించవచ్చని, అయితే ఆయన పార్టీలో చేరకపోవడం పెద్ద నష్టమేమీ కాదని మాజీ  మంత్రి ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కంటూ ఒక చరిత్ర ఉందని, పార్టీ వెంట కిషోర్‌ ఉన్నా, లేకున్నా ఎన్నికల్లో గెలిచే సత్తా పార్టీకి ఉందని అన్నారు.

Updated Date - 2022-04-27T20:59:05+05:30 IST