ప్రశాంత్ కిశోర్ బ్రాండ్‌గా మారిపోయారు: రాజస్తాన్ సీఎం

ABN , First Publish Date - 2022-04-20T22:31:25+05:30 IST

ప్రశాంత్ కిశోర్ ఈ దేశంలో ఒక బ్రాండ్‌గా మారిపోయారు. ఆయన 2014లో నరేంద్రమోదీతో కలిసి పని చేశారు. అనంతరం నితీశ్ కుమార్‌తో పని చేశారు. గతంలో కాంగ్రెస్‌తో పంజాబ్‌లోనూ పని చేశారు. ఇంకా దేశంలోని చాలా మందితో పని చేశారు..

ప్రశాంత్ కిశోర్ బ్రాండ్‌గా మారిపోయారు: రాజస్తాన్ సీఎం

జైపూర్: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈ దేశంలో ఒక బ్రాండ్‌గా మారిపోయారని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అన్నారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి పీకే అనుభవం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీతో పీకే సమావేశమయ్యారు.


కాగా, బుధవారం గెహ్లోత్ ఢిల్లీకి వచ్చారు. పార్టీ అధినేతతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రశాంత్ కిశోర్ ఈ దేశంలో ఒక బ్రాండ్‌గా మారిపోయారు. ఆయన 2014లో నరేంద్రమోదీతో కలిసి పని చేశారు. అనంతరం నితీశ్ కుమార్‌తో పని చేశారు. గతంలో కాంగ్రెస్‌తో పంజాబ్‌లోనూ పని చేశారు. ఇంకా దేశంలోని చాలా మందితో పని చేశారు. మేము కూడా ఏజెన్సీలను నిపుణులను కలుస్తాం. ప్రశాంత్ కిశోర్ అనుభవం విపక్షాల్ని ఏకం చేయడానికి ఉపయోగపడుతుంది’’ అని అన్నారు.


ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరిక దాదాపు ఖాయమైందనే అంటున్నారు. త్వరలోనే ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించనున్నట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఎన్నికల నిర్వహణ, వ్యూహరచన, పొత్తుల ఖరారు బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత పరిస్థితిని, రాష్ట్రాల వారీగా అవలంబించాల్సిన వ్యూహాలను కొద్ది రోజుల క్రితం జరిగిన సమావేశంలో పార్టీ నేతలకు పీకే వివరించినట్లు తెలిసింది. పీకే సలహాలు, సూచనలపై ఈ నేతలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సోనియాకు కార్యాచరణను సూచిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2022-04-20T22:31:25+05:30 IST