మూడో ఫ్రంట్‌ బీజేపీని సవాలు చేయలేదు : ప్రశాంత్ కిశోర్

ABN , First Publish Date - 2021-06-22T21:55:09+05:30 IST

భారతీయ జనతా పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు మూడో ఫ్రంట్ కానీ,

మూడో ఫ్రంట్‌ బీజేపీని సవాలు చేయలేదు : ప్రశాంత్ కిశోర్

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు మూడో ఫ్రంట్ కానీ, నాలుగో ఫ్రంట్ కానీ వస్తుందనే నమ్మకం తనకు లేదని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. బీజేపీని 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


ప్రశాంత్ కిశోర్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత ప్రభుత్వాన్ని విజయవంతంగా సవాల్ చేయగలిగే థర్డ్ లేదా ఫోర్త్ ఫ్రంట్ వస్తుందనే నమ్మకం నాకు లేదు’’ అన్నారు. థర్డ్ ఫ్రంట్ ప్రయోగం గతంలో జరిగిందని, దీనికి పరీక్షలు ఎదురయ్యాయని, ఇది పాతబడిపోయిందని అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు థర్డ్ ఫ్రంట్ తగినది కాదన్నారు. శరద్ పవార్‌తో తాను తీవ్రమైన రాజకీయ చర్చలు జరిగినట్లు తెలిపారు. బీజేపీపై పోరాటానికి చేయవలసినదేమిటో రాష్ట్రాలవారీగా చర్చించినట్లు తెలిపారు. థర్డ్ ఫ్రంట్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రస్తుతం తమ దృష్టిలో లేదన్నారు. 


ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ప్రశాంత్ కిశోర్ వరుస భేటీలు జరుపుతుండటంతోపాటు కొందరు ప్రతిపక్ష నేతలు కూడా మంగళవారం సమావేశమయ్యారు. శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్‌సీపీ, ఏఏపీ, టీఎంసీ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలతోపాటు కొందరు పాత్రికేయులు, ఇతర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T21:55:09+05:30 IST