PK Team సర్వేలో సంచలన విషయాలు.. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..!!

ABN , First Publish Date - 2022-03-12T16:24:49+05:30 IST

టీఆర్‌ఎస్‌. ఒకనాడు ఉద్యమాల ఊపిరి. నేడో ఫక్తు రాజకీయ పార్టీ. ఉద్యమమే పునాదిగా సాగిన ప్రస్థానం ఓ చరిత్రగా మిగిలింది. అధికారం కోసం ఉద్యమకారులనే పక్కన పెట్టే విద్యను టీఆర్‌ఎస్‌ ...

PK Team సర్వేలో సంచలన విషయాలు.. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..!!

తెలంగాణలో పీకే టీమ్‌ చేస్తున్న సర్వేలో టీఆర్‌ఎస్‌లో ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తోంది. ఏ వర్గాలు పార్టీపై అసంతృప్తితో ఉన్నాయని తెలుస్తోంది. సంక్షేమపథకాలు,కేసీఆర్‌ తీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారా? ముఖ్యంగా ఉద్యమకారుల మనోగతం ఎలా ఉంది... పీకేటీమ్‌ చేస్తున్నసర్వేతో టీఆర్‌ఎస్‌ తనను తాను ప్రక్షాళన చేసుకుంటుందా... అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


ఒకనాడు ఉద్యమాల ఊపిరి..నేడో ఫక్తు రాజకీయ పార్టీ

టీఆర్‌ఎస్‌. ఒకనాడు ఉద్యమాల ఊపిరి. నేడో ఫక్తు రాజకీయ పార్టీ. ఉద్యమమే పునాదిగా సాగిన ప్రస్థానం ఓ చరిత్రగా మిగిలింది. అధికారం కోసం ఉద్యమకారులనే పక్కన పెట్టే విద్యను టీఆర్‌ఎస్‌ బాగా వంటపట్టించుకుంది. ఉద్యమకారులపై కేసులు పెట్టినవారే అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్‌కు ప్రియంగా మారారు. అధికారంలోకి రావడానికి ఉద్యమం... అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఫక్తు రాజకీయమంటూ కేసీఆర్‌ ఏనాడో  చెప్పేశారు. దీంతో ఉద్యమకారులు పార్టీలో కొనసాగుతున్నా అసంతృప్తిగానే ఉన్నారు. ఉద్యమకారులకు అతి తక్కువ పదవులు, బంగారు తెలంగాణ పేరుతో కాంగ్రెస్‌, తెలుగుదేశం నుంచి వచ్చినవారికి ఎక్కువ పదవులు ఇవ్వడంపై ఆపార్టీలో అసంతృప్తి పెరగడానికి కారణమవుతోంది. 


ఓ పక్క బండి సంజయ్‌..మరోపక్క రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌పై విమర్శలు

మూడోసారి అధికారంలోకి రావడానికి టీఆర్‌ఎస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేసీఆర్‌పైనా, ప్రభుత్వ పథకాలపైన ప్రజలలో వ్యతిరేకత లేదు. కానీ ఏదో తెలియని అసంతృప్తి ఆ పార్టీని ఆందోళనలోకి నెట్టేస్తోంది. తనను తాను నమ్ముకోలేని పరిస్థితి. ఈ అసంతృప్తిని క్యాష్‌ చేసుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయి. ప్రతి చిన్న అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నాయి.ఓ పక్క బండి సంజయ్‌, మరోపక్క రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌పై విమర్శలతో దాడి చేస్తున్నారు. మరోపక్క జాతీయరాజకీయాలలో కీలక పాత్రపోషించాలని కేసీఆర్‌ ఉవ్విళ్ళూరుతున్నారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతున్నారు. త్వరలో ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తామనే లీకులు ఇస్తున్నారు.


అయితే జాతీయస్థాయిలో తన పవర్‌ చూపాలంటే తెలంగాణలో పట్టు జారకుండా చూసుకోవాలి. అందుకే కేసీఆర్‌ మూడోసారి అధికారం దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో మాగ్జిమమ్‌ సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చి రెండోసారి అలవోకగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తరువాత విపక్ష ఎమ్మెల్యేలు గులాబీగూటికి చేరిపోయారు. దీంతో ఆయా నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్‌ నుంచి ఓడిన ఎమ్మెల్యేలు విపక్షాల నుంచి గెలిచి, టీఆర్‌స్‌లో చేరిన ఎమ్మెల్యేల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. అందుకే ఇలాంటి సీట్ల విషయంలో కేసీఆర్‌ ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారుట.


తెలంగాణలో పీకే టీమ్‌ 22 రకాల సర్వేలు 

సహజంగా కేసీఆర్‌ మంచి వ్యూహకర్త. ప్రసంగకళలో దిట్ట. తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి. అయితే ఇటీవల ఆయన వ్యూహాలు బూమరాంగ్‌ అవుతున్నాయి. హుజూరాబాద్‌, దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఆయన చేయించిన సర్వేలు ఫెయిలయ్యాయి. తాను నమ్మకున్న ఇంటెలిజెన్స్‌ విభాగం,తాను చేయించిన సర్వేలు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో మూడోసారి అధికారం చేపట్టాలంటే పకడ్బందీ సర్వేలు చేయిస్తే తప్ప లాభం లేదని కేసీఆర్‌ భావించారు. అందుకే ఎన్నికల వృత్తి నిపుణుడు పీకేను ఆశ్రయించారు. ఇప్పడీ పీకే టీమ్‌ తెలంగాణలో 22 రకాల సర్వేలు చేస్తోంది. వీటిల్లో వెలుగుచూస్తున్న విషయాలు హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు, ఎంపీల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌, సంక్షేమ పథకాలు, రైతులు, కులాలవారీగా ఓట్లు వాటి ప్రభావం తదితర 22 అంశాలపై పీకే టీమ్‌ సర్వేకు దిగింది.


తీవ్ర అసంతృప్తిలో తెలంగాణ ఉద్యమకారులు

పీకే టీమ్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌ వైఖరిపై ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది.అప్పటి నుంచి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్‌, టీడీపీ నుంచి పెద్దయెత్తున చేరికలను అధిష్ఠానం ప్రోత్సహించింది. ఈ క్రమంలో బంగారు తెలంగాణ బ్యాచ్‌తో పోల్చుకుంటే ఉద్యమ తెలంగాణబ్యాచ్‌కు చాలా తక్కువ పదవులు దక్కాయి. కొందరినైతే ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. కేసీఆర్‌ చెప్పారని ఉద్యమ సమయంలో డబ్బు ఖర్చు పెట్టిన వారికి ఎలాంటి సాయం అందలేదు. ఉద్యమ సమయంలో  టీఆర్‌ఎస్‌ తరఫున పోరాడినందుకు పదవిలో ఉండి కేసులు పెట్టిన వారు.. ఇప్పుడు సొంత పార్టీలో తమ కంటే ఎక్కువ స్థాయిలో ఉండడాన్ని ఉద్యమకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న పనుల కోసం వారి దగ్గరకు వెళ్లాల్సి వస్తుండడాన్ని వారు అవమానకరంగా భావిస్తున్నారు. పార్టీ కోసం కొట్లాడి, కేసులు ఎదుర్కొని తెలంగాణ సాధించుకుంటే.. ఇప్పుడు సొంత పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది.


‘ఉద్యమ కారులకు న్యాయం జరిగిందా?

ప్రత్యేకంగా ఉద్యమకారులు, మొదటి నుంచి టీఆర్‌ఎ్‌సలో ఉన్న వారి గురించి ప్రశాంత్‌ కిషోర్‌ బృందం క్షేత్రస్థాయిలో ఆరా తీసింది. ‘‘ఉద్యమ కారులకు న్యాయం జరిగిందా? మొదటి నుంచి ఉన్నవారు పార్టీలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారా? వారికెందుకు న్యాయం జరగలేదు? ఇప్పటివరకు వారికెందుకు పదవులు రాలేదు...’’ వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది.ఈ మేరకు ఉద్యమకారులంతా పార్టీలో ఉన్నప్పటికీ యాక్టివ్‌గా లేరని తేలింది. తమ కోసం పార్టీ అధిష్ఠానం ఏం చేయలేదని, కనీసం పార్టీ కార్యక్రమాలకు పిలవట్లేదని క్షేత్రస్థాయి నుంచి సమాధానాలు వచ్చినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఉద్యమకారులనే పీకే బృందం స్వయంగా కలిసి వారి నుంచే వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే, చురుగ్గా ఉన్న నాయకులకు పదవులు అందించడంలో విఫలమైనట్లు సర్వేలో గుర్తించారు. 


ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీ పరిస్థితి

ఇక.. ద్వితీయ శ్రేణి నాయకులు అధికారులను ఇబ్బంది పెడుతూ, వారిపై పెత్తనం చేస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయం చేయలేకపోతున్న విషయాన్ని పీకే టీమ్‌ తమ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. అలాగే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీ పరిస్థితి ఏంటన్న అంశాలపైనా సర్వే చేపట్టారు. మొత్తంగా పార్టీలో వర్గాలు, ఉద్యమకారుల తిరుగుబాటు, కుల సమీకరణాలు తదితర అంశాలపై పూర్తి స్థాయి నివేదిక అందించినట్లు తెలుస్తోంది. మరి టీఆర్‌ఎస్‌ తన వైఖరి మార్చుకుని ఉద్యమకారులను ఎంతవరకు గౌరవిస్తుందోనని ఆ పార్టీలో చర్చ మొదలైంది. 

Updated Date - 2022-03-12T16:24:49+05:30 IST