2024 లోక్‌సభ ఎన్నికలపై ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్

ABN , First Publish Date - 2022-03-11T18:17:02+05:30 IST

ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాన

2024 లోక్‌సభ ఎన్నికలపై ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తిప్పికొట్టారు. ప్రశాంత్ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశం కోసం సంగ్రామం 2024లోనే జరుగుతుందని, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు భవిష్యత్తును నిర్ణయించలేవని స్పష్టం చేశారు. 


ప్రధాని మోదీ గురువారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో 2017లో గెలిచినందువల్లే 2019లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినట్లు నిపుణులు చెప్పారన్నారు. ఇప్పుడు కూడా తాను దానినే నమ్ముతున్నానని తెలిపారు.  దీనిపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ, రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై ఉండబోదని తెలిపారు. అయ్యగారికి ఈ విషయం తెలుసునన్నారు. అందుకే ఆయన తెలివైన ప్రయత్నం చేస్తున్నారన్నారు. 


‘‘భారత దేశం కోసం సంగ్రామం 2024లోనే జరుగుతుంది, నిర్ణయమవుతుంది, అంతేకానీ ఏ రాష్ట్ర ఎన్నికల్లోనూ కాదు. అయ్య గారికి ఈ విషయం తెలుసు. అందుకే ప్రతిపక్షంపై నిర్ణయాత్మక మానసిక సానుకూలత, పైచేయి సాధించడానికి రాష్ట్ర ఎన్నికల ఫలితాల చుట్టూ వెర్రిని సృష్టించే తెలివైన ప్రయత్నం. ఈ తప్పుడు కథనం ఉచ్చులో పడొద్దు, దానిలో భాగం కావొద్దు’’ అని తెలిపారు. 


ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో 403 స్థానాలకుగానూ, బీజేపీ కూటమి 273 స్థానాలను సాధించింది. ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకుగానూ బీజేపీ 47 స్థానాలను సాధించింది. మణిపూర్‌లో 60 స్థానాల్లో 32 స్థానాలను కైవసం చేసుకుంది. గోవాలో 40 స్థానాల్లో 20 స్థానాలను దక్కించుకుంది. 


పంజాబ్‌లో 117 స్థానాల్లో 90 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ సాధించింది. 


Updated Date - 2022-03-11T18:17:02+05:30 IST