ప్రయాణికుల పాట్లు

Published: Tue, 17 May 2022 00:15:57 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రయాణికుల పాట్లుకొనసాగుతున్న ఆర్యూబీ రీ డిజైన్‌ పనులు, మహబూబాబాద్‌ రైల్వే గేట్‌ వద్ద బారులు తీరిన వాహనాలు

రీ డిజైన్‌తో ఆర్యూబీలో కొనసాగుతున్న పనులు

రైల్వేగేట్‌ వద్ద గంటల పాటు నిరీక్షణ 

జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా రాకపోకలకు బ్రేక్‌ 

పాలకు తీరు, అధికారుల అనాలోచిత చర్యలపై ప్రజల మండిపాటు


మహబూబాబాద్‌ టౌన్‌, మే 16 : మానుకోటలో వాహనదారులు పడరాని పాట్లు పడుతున్నారు. విలీన గ్రామాలు, అనేక శివారు కాలనీలతో నలుదిక్కుల నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించిన పట్టణంలో గృహాలు, జనాభాతో పాటు వాహనాల రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అలాగే వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చే వాహనాల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో  ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. తాజాగా పట్టణ నడిబొడ్డున గతంలో నిర్మించిన రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్యూబీ) రీ డిజైన్‌ పనులతో మార్గం గుండా రాకపోకలకు బ్రేక్‌ పడడంతో వాహనదారులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలలుగా ఆర్యూబీ రీ డిజైన్‌ పనులు జరుగుతుండడంతో కొత్త, పాత బజారులకు వెళ్లేందుకు నిర్మాణాలు జరిగిన సమయాల్లో వాహనదారులు పడారాని పాట్లు పడుతున్నారు. గమ్యస్థానాలకు చేరుకునేందుకు పట్టణం చుట్టూ మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర ప్రయాణిస్తూ ఇబ్బంది పడుతున్నారు.


పాత, కొత్త బజారులకు రైల్వే గేట్‌ ఒక్కటే మార్గం...

జిల్లా కేంద్రంలో రైల్వే అండర్‌ బ్రిడ్జి రీ డిజైన్‌ పనులు కొనసాగుతుండడంతో పాత, కొత్తబజారులకు వెళ్లాలంటే పట్టణంలోని రైల్వే గేటే ఒక్కటే మార్గంగా నిలిచింది. గతంలో రూ.18కోట్లతో రైల్వే మధ్యగేటు ప్రాంతంలో నిర్మించిన రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్యూబీ) గుండానే వాహనాలన్నీ వెళ్తాయి. తాజాగా రూ.2కోట్లతో చేపడుతున్న రీ డిజైన్‌ పనులతో ఆ మార్గం గుండా వెళ్లకపోవడంతో ఉన్న ఒక్క రైల్వే ఏ- క్యాబిన్‌ గేట్‌ నుంచి వెళ్లాల్సి వస్తోంది. ఇక ఊరి చివరలో కురవిరోడ్‌లో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ) గుండా వెళ్లాలంటే దాదాపుగా నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తోంది. పెట్రోల్‌ రేటు గణనీయంగా పెరగడంతో వాహనదారులు ఆలోచిస్తున్నారు. ఇక రాత్రి వేళల్లో ఆర్వోబీ గుండా వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. దీంతో వాహనాలన్నీ ఉన్న ఏకైక మార్గం రైల్వే గేట్‌ నుంచి వెళ్లక తప్పని పరిస్థితి. ఇక గేట్‌ పడితే చాలు దాదాపుగా అర కిలోమీటర్‌ మేర ఆ రోడ్డు వెంట వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుంది. గేట్‌ తీసిన సమయంలో దాదాపుగా 10 నిమిషాలు పైనే ఆ మార్గంలో రైల్వే గేట్‌లో నుంచి వాహనాలు వెళ్తున్నాయంటే వాహనాల రద్ధీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో గత్యంతరం లేక అనంతారం రోడ్‌లోని, సిగ్నల్‌ కాలనీ సమీపంలోని మరమ్మతులకు నోచుకుని అండర్‌ పాస్‌ల నుంచి.. సరిగ్గా లేని రోడ్లపై ద్విచక్ర వాహనదారులు వెళ్తున్నారు. 


రీ డిజైన్‌ ఎందుకంటే...

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో  రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్యూబీ) రీ డిజైన్‌ ద్వారా కొంత మంది వ్యాపారస్థులకు మేలు జరగనుంది. గతంలో ఆర్యూబీ నిర్మించిన ప్రాంతాలు కొత్త బజారులోని శ్రీరామమందిరం, ప్రభుత్వ ఆస్పత్రి, రెడ్డి బజారు, పాత బజారులోని బుక్క బజారు ప్రాంతంలో రైల్వే బ్రిడ్జి కింది భాగం సమీపం నుంచి స్లోపుగా పెంచుకుంటూ చుట్టూ నాలుగు దిక్కులా సుమారు 100 మీటర్లకు పైగా దాదాపుగా 10 నుంచి 12 ఫీట్లలోతుతో పెంచుకుంటూ ఆర్యూబీని నిర్మాణం చేపట్టారు. దీంతో అనేక మంది వ్యాపారుల షాపులు మూతపడి నష్టపోయారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్యూబీ రీ డిజైన్‌ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం రైల్వే బ్రిడ్జి సమీపంలో రెండు ఫీట్ల నుంచి చివరి వరకు ఆరు ఫీట్ల ఎత్తు రోడ్డును లేపుతూ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈక్రమంలో గతంలో నిర్మించిన రేలింగ్‌ను తీసివేయడం ద్వారా అనేక షాపులు రోడ్డు వైపునకు వస్తున్నాయి. దీంతో కొంత మంది వ్యాపారస్థులకు మేలు జరగనుంది.


మరో ఆర్యూబీ.. ఆర్వోబీ నిర్మించాలి..

మహబూబాబాద్‌ జిల్లా ఆవిష్కృతం అయిననాటి నుంచి వాహనదారులు ఇక్కట్లు పెరిగిపోయాయి. వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ సమస్యలు మొదలయ్యాయి. దీంతో జిల్లా ఏర్పడ్డ నాటి నుంచి ఔటర్‌ రింగు రోడ్డు డిమాండ్‌  తెరపైకి వచ్చింది. ఎప్పుడు వస్తుందో అంటూ వాహనదారులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు ఔటర్‌ రింగు రోడ్డు నిర్మాణం చేపడుతామని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని తెలంగాణ సర్కార్‌ పూర్వంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. జిల్లా ఏర్పడి ఐదేళ్లు పూర్తయిన ఔటర్‌ రింగురోడ్డుకు మోక్షం లభించలేదు. దీంతో భారీ వాహనాలు సైతం పట్టణ పురవీధుల గుండానే వెళ్తున్నాయి. మరోపక్క గతంలో రూ.58 కోట్లతో మరో  రైల్వే ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ) మంజూరు అయినప్పటికీ దానికి అతిగతి లేకుండా పోయింది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఆర్యూబీ రీడిజైన్‌ పనులతో పాత, కొత్త బజారులకు వెళ్లే ఆ మార్గం మూసివేయడం... రైల్వే గేట్‌ రోడ్‌లో వాహనాల రద్దీ తీవ్రంగా పెరిగింది. వాహనరద్ధీ దృష్ట్యా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలకుల తీరు..అధికారుల అనాలోచిత చర్యలపై ప్రజలు మండిపడుతున్నారు. లక్ష జనాభా దాటిన మానుకోట పట్టణానికి వాహనాల రద్ధీ నేపథ్యంలో మరో ఆర్యూబీ, ఆర్వోబీని నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఔటర్‌ రింగురోడ్డు మరో రైల్వే అండర్‌ బ్రిడ్జి, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణాలతో వాహన తాకిడి, ట్రాఫిక్‌ సమస్య తొలగిపోతుందని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ దిశగా పాలకులు ఆలోచన చేసి తమ కష్టాలను తీర్చాలని కోరుతున్నారు. 


ప్రత్యామ్నాయ మార్గం చూపాలి : ఆకుల రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, మానుకోట 

మహబూబాబాద్‌ పట్టణంలోని నడిబొడ్డున ఉన్న ఆర్యూబీ మార్గం ప్రధానమైంది. రీ డిజైన్‌ పనులు చేపట్టే క్రమంలో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క అనంతారం రోడ్డు మార్గంలోని, సిగ్నల్‌ కాలనీ సమీపంలో ఉన్న అండర్‌ పాస్‌ల వద్ద మరమ్మతు లు చేస్తే ఆయా మార్గాల గుండా ద్విచక్రవాహనాలు, ఆటో లాంటి చిన్న వాహనాలు వెళ్తే రైల్వేగేట్‌ వద్ద వాహనాల తాకిడి తక్కువగా ఉంటుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ను కూడా మంజూరు చేసి నిర్మిస్తే పట్టణంలో భారీ వాహనాల రద్ధీ తగ్గుతుంది. 


మరో ఆర్వోబీ, ఆర్యూబీ మంజూరు చేయాలి : పాపాచారి, వాహనదారుడు, మానుకోట 

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి మరో ఆర్యూబీ, ఆర్వోబీని మంజూరు చేయాలి. రోజు రోజు పెరుగుతున్న జనాభా, వాహనాల రద్ధీతో మరో ఆర్యూబీ, ఆర్వోబీ అవసరం. పాలకులు ఆదిశగా ఆలోచించి తక్షణమే మంజూరు చేయాలి. ఆర్యూబీ రీ డిజైన్‌ పనులు జరిగిన సమయంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారుల కష్టాలను తొలగించే దిశగా అధికారులు, పాలకులు ప్రణాళికలు సిద్ధం చేయాలి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.