పొరపాటున కూడా ఈ పండ్లను కలిపి తినొద్దు..!

ABN , First Publish Date - 2021-10-01T00:59:16+05:30 IST

పండ్లు ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలుసు. అయితే ఏది ఎప్పుడు, ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు ఒక పండు తీసుకుంటే.. వైద్యుడితో పని లేదని.. ఎలా పడితే అలా తింటే, మొదటికే మోసం

పొరపాటున కూడా ఈ పండ్లను కలిపి తినొద్దు..!

పండ్లు ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలుసు. అయితే ఏది ఎప్పుడు, ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు ఒక పండు తీసుకుంటే.. వైద్యుడితో పని లేదని.. ఎలా పడితే అలా తింటే, మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. పండ్లను విడివిడిగా తీసుకుంటే సమస్య ఉండకపోవచ్చు గానీ.. కలిపి తీసుకునే సమయంలో మాత్రం ఆలోచించాలని చెబుతున్నారు. కొన్ని పండ్లను కలిపి తీసుకుంటే ప్రమాదకరమని తెలుస్తోంది.. అవేంటో తెలుసుకుందాం.. 


కొందరు అన్నం తిన్న వెంటనే పండ్లు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇలా తీసుకుంటే వాటిలో ఉండే పోషకాలేవీ శరీరానికి అందవు. భోజనం చేసిన గంట తర్వాత ఏవైనా పండ్లు తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. పెరుగుతో పాటూ పుల్లని పండ్లను తీసుకుంటే సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. బొప్పాయి, నిమ్మకాయలు కలిపి తీసుకుంటే ప్రమాదకరం. రక్తంలో హిమోగ్లోబిన్‌ హెచ్చు తగ్గులకి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. క్రమేపీ రక్తహీనతకు కూడా దారి తీసే అవకాశం ఉంది. 


అదేవిధంగా ఆరెంజ్, క్యారెట్‌ను కలిపి తినడం కూడా మంచిది కాదట. ఇది శరీరంలో మూత్రపిండ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. నారింజ, క్యారెట్ కలయిక గుండెలో మంట తదితర సమస్యలను తెచ్చిపెడుతుంది. మరోవైపు జామ, అరటిపండును కలిపి తినడం చాలా ప్రమాదమని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పొట్టలో గ్యాస్ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. దీనికితోడు తలనొప్పి పెరగవచ్చని హెచ్చరిస్తున్నారు. 


అలాగే దానిమ్మ, నేరేడు పండ్లను కలిపి తీసుకుంటే.. కడుపులో అసిడిటీ, అజీర్ణం, గుండెల్లో మంట పెరుగుతుంది. ఈ రెండింటిలో చక్కెర, ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల.. ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్‌లను చంపేస్తుందని చెబుతున్నారు. ఇక అరటిపండుతో పాయసం గానీ జామకాయ గానీ కలిపి తీసుకుంటే శరీరంలో టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయట. ఇలా తినడం వల్ల పొట్టలో బరువైన భావన కలుగుతుంది. పనస పండును పాలతో కలిపి తీసుకుంటే చర్మ సమస్యలు.. పుచ్చకాయ, కర్భూజా పండు కలిపి తీసుకుంటే అజీర్తి సమస్య వస్తుంది. ఇలా కొన్ని రకాల పండ్లను కలిపి తీసుకునే కంటే విడివిడిగా తీసుకుంటేనే మంచిదని.. నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-10-01T00:59:16+05:30 IST