విలువైన కానుక

ABN , First Publish Date - 2020-12-18T05:33:05+05:30 IST

ఒకసారి ఏసు ప్రభువు, ఆయన శిష్యులు ఒక ఆలయానికి వెళ్ళారు. ఆ ఆలయంలో కానుకల పెట్టె కనిపించే దూరంలో ఏసు ప్రభువు కూర్చున్నాడు.

విలువైన కానుక

ఒకసారి ఏసు ప్రభువు, ఆయన శిష్యులు ఒక ఆలయానికి వెళ్ళారు. ఆ ఆలయంలో కానుకల పెట్టె కనిపించే దూరంలో ఏసు ప్రభువు కూర్చున్నాడు. ఎంతోమంది ఆలయంలోకి వస్తున్నారు. ధనవంతులు ఆ కానుకల పెట్టెలో ఎంతో డబ్బు వేసి వెళ్తున్నారు. ఇంతలో ఒక పేద వితంతువు అక్కడకు వచ్చింది. ఎక్కువ విలువ చేయని రెండు చిన్న నాణేలను కానుకల పెట్టెలో వేసి, వెళ్ళిపోయింది. 


ఇదంతా గమనించిన ఏసు తన శిష్యులను పిలిచాడు. ‘‘నేను నిజం చెబుతున్నాను. కానుకల పెట్టెలో డబ్బు వేసిన వారందరి కన్నా ఎక్కువ వేసింది ఆ పేద వితంతువే. వాళ్ళందరూ తమ సంపదల్లో కాస్త మొత్తాన్ని మాత్రమే వేశారు. ఆమె ఎంతో దీనస్థితిలో ఉంది. బతకడానికి ఆమె దగ్గర ఉన్నది కేవలం ఆ రెండు నాణేలే! అయినా తన దగ్గర ఉన్నదంతా వేసింది’’ అని చెప్పాడు. (మార్కు సువార్త 12: 41-44) 


ధనవంతులు పెద్ద మొత్తాల్లో డబ్బును కానుకల పెట్టెలో వేస్తున్నప్పుడు ఏసు ప్రభువు మౌనంగా ఉన్నాడు. ఎలాంటి స్పందనా కనబరచలేదు. కానీ ఒక పేద వితంతువు ఎంతో విశ్వాసంతో వేసిన కానుకను చూసి ఆయన కదిలిపోయాడు. ధనవంతులు ఇచ్చిన దానికన్నా ఆమె ఇచ్చినదే ఎంతో విలువైనదని ప్రకటించాడు. మానవుల్లో దైవం చూసేది అచంచలమైన, దేనినైనా వదులుకోగలిగే విశ్వాసాన్ని. కానుకల రూపంలో దైవ కార్యాలకు ఎంతో ఇస్తున్నామని చెప్పుకొనేవారు ఎందరో ఉన్నారు. కానీ వారిలో చాలామంది ఇచ్చేది తమ దగ్గర ఉన్నదానిలో స్వల్ప మొత్తాలనే.


ఆ ఇచ్చిన దాని గురించి వారు చేసుకొనే ప్రచారం కూడా ఎక్కువే. దైవం చూసేది ఆర్భాటాల కోసం చేసే ఇలాంటి పనులను కాదు... భారీ మొత్తంలో నగదును కాదు. ఆయన హృదయాలను పరిశీలిస్తాడు. ఆ హృదయాల్లో దైవం పట్ల ప్రేమ, విశ్వాసాల బరువు ఎంత ఉన్నదీ తూకం వేస్తాడు. దాని ఆధారంగా దైవ జనులెవరో విలువ కడతాడు. అలాంటి దైవం దృష్టిలో అలాంటి విలువను పొందడానికి విశ్వాసులం అని చెప్పుకొనేవారందరూ కృషి చేయాలి. 

Updated Date - 2020-12-18T05:33:05+05:30 IST