ఏడేళ్ల కుమారుడికి వెలకట్టిన తల్లి

ABN , First Publish Date - 2021-06-20T05:53:44+05:30 IST

పేగుబంధానికి నీళ్లొదిలిన ఓ తల్లి కన్న కొడుకునే విక్రయించిన సంఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంటలో వెలుగుచూసింది.

ఏడేళ్ల కుమారుడికి వెలకట్టిన తల్లి
తల్లిని విచారిస్తున్న ఐసీడీఎస్‌ అధికారులు

రూ. 15 వేలకు విక్రయం 

పోలీసుల అదుపులో తల్లి, మరో వ్యక్తి

నర్సాపూర్‌, జూన్‌ 19: పేగుబంధానికి నీళ్లొదిలిన ఓ తల్లి కన్న కొడుకునే విక్రయించిన సంఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంటలో వెలుగుచూసింది. పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్ర పోచమ్మ భర్త నుంచి విడిపోయి గ్రామంలోనే మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. ఏడేళ్ల కుమారుడు కూడా ఆమెతోనే ఉంటున్నాడు. సహజీవనానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని బాలుడిని అమ్మేయాలని నిర్ణయించింది. ఆరు నెలల క్రితం గ్రామం నుంచి వెళ్లిన పోచమ్మ తన కొడుకును మధ్యవర్తి సహకారంతో రూ.15వేలకు విక్రయించింది. కొడుకుతో వెళ్లిన పోచమ్మ ఈమధ్య గ్రామానికి ఒంటరిగా రావడంతో గ్రామస్థులకు సందేహం కలిగింది. ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సరళ సిబ్బందితో కలిసి శనివారం గ్రామానికివెళ్లి పోచమ్మను విచారించారు. కుమారుడిని రూ. 15 వేలకు అమ్మేశానని ఆమె అంగీకరించింది. ఐసీడీఎస్‌ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీ్‌సస్టేషన్‌కు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. పోచమ్మకు సహకరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. త్వరలోనే బాలుడిని తీసుకువస్తామని, బాధ్యులపై తగిన చట్టపక్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.  

Updated Date - 2021-06-20T05:53:44+05:30 IST