అభివృద్ధి ఆర్భాటం వెనుక దోచిపెట్టే వ్యూహాలు!

Published: Wed, 29 Jun 2022 00:35:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అభివృద్ధి ఆర్భాటం వెనుక దోచిపెట్టే వ్యూహాలు!

ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరించటం, పెట్టుబడులను ఉపసంహరించుకోవటం అనే విధానాలను బీజేపీ ప్రభుత్వం అంతకంతకూ దూకుడుగా అవలంబిస్తున్నది. కార్పొరేట్లకు అనుకూలించేలా కార్మిక చట్టాలను సవరించటం కూడా ఈ ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా ఉన్నది. ఈ దిశగానే 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి వేసింది. ఈ జులై 1 నుంచి కొత్త లేబరు చట్టాలను అమలులోకి తెస్తున్నారు. కార్మికుల పని గంటలను పెంచడం, వేతనాలను అతి తక్కువ స్థాయిలో ఉంచడం, సాంఘిక భద్రత సౌకర్యాలను గణనీయంగా తగ్గించడం, కాంట్రాక్ట్‌ లేబరును ఎక్కువగా వినియోగించుకోవడం, కార్మికులను ఉన్నపాటున ఉద్యోగాల నుంచి తీసివేయడానికి వీలుగా నిబంధనలను సరళతరం చేయడం, కార్మిక సంఘాలను పెట్టుకొనే హక్కులను నిర్వీర్యపరచడం, కార్మిక చట్టాల అమలును పర్యవేక్షించే చట్టాలను బలహీనపరచడం లాంటి అనేక చర్యలను ఈ రోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ఒకపక్క కార్మికుల జీవనాలను ఇలా అస్థిరం చేస్తూ, మరోపక్క కార్పొరేట్లకు మాత్రం పన్ను రాయితీలు, కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపులు, చట్టాల నుంచి మినహాయింపులు ఇచ్చి వారి లాభాలను పెంచుతున్నాయి.


భారతదేశంలో ఆదాయాల వ్యత్యాసం మునుపెన్నడూ చూడనంత దారుణమైన స్థితిలో ఉంది. పైస్థాయిలో ఉన్న ఒక్కశాతం మంది దేశ సంపదలో మూడు వంతుల మొత్తాన్ని కలిగి ఉన్నారు. జనాభాలో సగానికి పైగా ఉన్న అట్టడుగు పేదలందరి సంపద కేవలం 6 శాతం మాత్రమే. 2020 నాటికి పై స్థాయిలో ఉన్న పది శాతం మంది వద్ద 57శాతం సంపద పోగుపడి ఉంది. అట్టడుగు స్థాయిలో ఉన్న సగం దేశ జనాభా వద్ద సంపదలో కేవలం 13శాతం మాత్రమే ఉంది. పై ఒక్క శాతం మంది 22శాతం దేశ ఆదాయాన్ని తమవద్ద పోగేసుకున్నారు. ఈ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వమే ఈ అవకాశాన్ని కల్పించింది.


ప్రభుత్వ బ్యాంకుల నుంచి కార్పొరేట్లు తీసుకున్న రూ.10.72 లక్షల కోట్ల ఋణాల్ని కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిందని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ (సీఎంఐఈ) వెల్లడించింది. వీటిలో 85శాతం ఋణాలు కొద్దిమంది కార్పొరేట్‌ కంపెనీలు చెల్లించాల్సినవే. ఏ బడా బాబుల బాకీలు రద్దు చేశారో మాత్రం చెప్పడం లేదు. ఆర్టీఐ కార్యకర్తల ప్రశ్నలకూ సమాధానం లేదు. చిన్న చిన్న ఋణాలు వసూలు కాకపోతే వాటిని మంజూరు చేసిన మేనేజర్లను, అధికారులను జవాబుదారులుగా నిర్ణయించి చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసిన డైరెక్టర్లు, ఉన్నతాధికారులపై ఏ చర్యలూ లేవు.


ఈ బ్యాంకులు గానీ, ఏ ఇతర ఆర్థిక సంస్థలు గానీ చిరు వ్యాపారులకు మాత్రం సహాయం చేయటం లేదు. ప్రభుత్వాల విధానాలతో చిన్న, మధ్యతరగతి వ్యాపారులు కుదేలవుతున్నారు. రిటైల్ వర్తక రంగంలోకి విదేశీ, కార్పొరేట్ కంపెనీల ప్రవేశంతో చిన్న, మధ్యతరగతి వ్యాపారాలు మూతపడుతున్నాయి.. వాల్‌మార్ట్, మెట్రో, రిలయన్స్ తదితర సంస్థలు ప్రభుత్వాల అండతో, అనైతిక పద్ధతులతో చిన్నవ్యాపారులను దెబ్బతీస్తున్నాయి. దీనివలన దేశంలో అనేక చోట్ల నిత్యవసర సరుకులు అమ్మే చిన్న, మధ్యతరగతి షాపులు లక్షల సంఖ్యలో మూతపడ్డాయి. ఈ షాపులకు సరుకులు అందించే హోల్‌సేల్ డీలర్ల వద్ద పనిచేసే కమీషన్ ఏజెంట్లు ఉపాధి కోల్పోయారు. ఆన్‌లైన్‌ కంపెనీలు మాత్రం తాత్కాలిక ఆకర్షణలతో అనైతిక పద్ధతులతో వినియోగదారులను ఆకర్షించి, మార్కెట్టును కైవసం చేసుకుంటున్నాయి. మార్కెట్ చేతిలోకి వచ్చిన తర్వాత ప్రజలపై దోపిడీ పద్ధతులను అవలంబిస్తున్నాయి. ఈ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వత్తాసు పలుకుతోంది.


దేశంలో జీడీపీ వృద్ధి రేటు పడిపోతున్నా, స్టాక్ మార్కెట్ సూచీలే దేశాభివృద్ధి చిహ్నాలు అంటూ వాటి ప్రయోజనాల కోసం చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఎల్ఐసి సంస్థను స్టాక్ మార్కెట్టులో లిస్టింగ్ చేశారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను స్టాక్ మార్కెట్టులో అమ్మివేస్తున్నారు. 2047 కల్లా దేశంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఉండకూడదని నీతి ఆయోగ్ చెప్తోంది. అంటే 75 ఏళ్ల నుంచీ దేశాన్ని నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలని, వచ్చే పాతికేళ్ళలో కార్పొరేట్లకు అప్పచెప్పబోతున్నారని అర్థం.


మూడేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 12కు కుదించారు. కార్పొరేట్‌ కంపెనీలకు ఆర్థిక రంగాన్ని కట్టబెట్టే పనిలో భాగంగా 10 పేమెంట్‌ బ్యాంకులకు, 11 స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులకు లైసెన్సులు ఇచ్చారు. రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ తదితర కార్పొరేట్లు బ్యాంకింగ్‌ రంగంలోకి వచ్చాయి. రిజర్వ్‌ బ్యాంకు నియమించిన అంతర్గత కమిటీ ఏకంగా కార్పొరేట్‌ కంపెనీలకే వాణిజ్య బ్యాంకులు ప్రారంభించటానికి అనుమతినివ్వాలని నవంబరు 2020లో సిఫారసు చేసింది. ఇది ప్రపంచ అనుభవానికి విరుద్ధం. ఇప్పటికీ అమెరికాతో సహా అభివృద్ధి చెందిన అనేక దేశాలు కార్పొరేట్‌ కంపెనీలను బ్యాంకింగ్‌ వ్యాపారానికి దూరంగా ఉంచుతాయి. భారతదేశంలో బ్యాంకులను పూర్తిగా ప్రయివేటీకరించే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు అసమర్థంగా ఉన్నాయని, నష్టాలలో ఉన్నాయని, తగిన మూలధనం సమకూర్చటానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని ప్రచారం చేస్తున్నారు.


ఈ మధ్య విడుదల అయిన కొన్ని వినియోగదారుల విశ్వాస సూచిక సర్వేలలో ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని వెల్లడైంది. స్థూల జాతీయ పొదుపు క్రమేపీ తగ్గుతుండడం ప్రజల విశ్వాస లేమికి నిదర్శనం. మరోపక్క కుటుంబాల ఆదాయం తగ్గుతూ వస్తోంది. కరోనా టైంలో 84శాతం కుటుంబాల ఆదాయం పడిపోయిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. కానీ అదే కరోనా టైంలో దేశంలోని బడా కార్పొరేట్లు, ధనికుల ఆర్జన లక్షల కోట్లు దాటింది. కరోనా మహమ్మారి ప్రబలిన 2020–21లో బడా కార్పొరేట్‌ కంపెనీల లాభం రూ.5.5లక్షల కోట్లు, 2021–22లో రూ.9.3లక్షల కోట్లుగా ఉందని సీఎంఐఈ వెల్లడించింది. ఇది సూపర్‌ రిచ్‌కు (అత్యంత ధనికులకు, కార్పొరేట్లకు) అనుకూలించే ఆర్థిక విధానాల ఫలితమేనని ఆ సంస్థ వివరించింది. 


మరోపక్క నిరుద్యోగమూ అంతే తీవ్రంగా ప్రబలింది. ఉత్తరప్రదేశ్‌లో 363 స్వీపర్ పోస్టులకు 23 లక్షల మంది దరఖాస్తు చేసారంటే పరిస్థితి తీవ్రత ఎంత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. వీరిలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం. గుజరాత్‌లో 3400సచివాలయ ఉద్యోగాలకు 18 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల డిపార్టుమెంటు ఇచ్చిన అధికారిక గణాంకాల ప్రకారం 2014 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలలో 3 లక్షల 70 వేల పర్మినెంట్ ఉద్యోగులు తగ్గిపోయారు. అదే కాలంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లక్షల్లో పెరిగారు. ఉద్యోగాలు ఉన్నవారి పరిస్థితీ ఏమంత బాగోలేదు. వేతన జీవుల భవిష్య నిధిపై వడ్డీరేటు 8.5 నుంచి 8.1శాతానికి తగ్గించి వారి నోట్లో మట్టి కొట్టారు. అడ్డూ అదుపులేని ఆహార ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజల మీద ధరా భారం పెరిగింది. ఈ అంశాల మీద చర్చ జరగకుండా హిజాబ్ అనో, కశ్మీర్ ఫైల్స్ సినిమా అనో, హలాల్ అనో, అజాన్ అనో భావోద్వేగ అంశాలను ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని మరలుస్తున్నారు.


గడిచిన ఎనిమిదేళ్లలో సుపరిపాలన అందించామని, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకున్నామని, ‘బయో–ఎకానమీ’ ఎనిమిది రెట్లు వృద్ధి అయ్యిందని ప్రభుత్వం గొప్పలు చెప్తోంది. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు మాత్రం దీనికి పూర్తి భిన్నమైన నిజాన్ని వెల్లడిస్తున్నాయి. ఒక్క ఆకలి విషయంలోనే కాదు, ప్రజాస్వామ్యం, లింగసమానత్వం, మానవాభివృద్ధి, ఉపాధి, విద్య, వైద్యం వంటి పలు అంశాల్లో మన దేశం నేల చూపులు చూట్టమే తప్ప తలెత్తుకునే పరిస్థితి లేదని తేల్చి చెప్పాయి. గురజాడ అప్పారావు 1910లో రాసిన ‘దేశమును ప్రేమించుమన్నా’ పద్యంలో ‘‘ఈసురోమని మనుషులుంటే / దేశమే గతి బాగుపడునోయ్‌’’ అంటారు. ప్రస్తుతం మన దేశంలో ప్రజల పరిస్థితి ఇదే. ఇక దేశం అభివృద్ధివైపు ఎలా నడుస్తుంది?

ప్రయాగ సతీష్

ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకుడు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.