గర్భిణి మృతి

ABN , First Publish Date - 2022-06-26T05:25:58+05:30 IST

మండలంలోని సజ్జలగూడేనికి చెందిన కవిత(24) అనే గర్భిణి మృతి చెందింది.

గర్భిణి మృతి

వైద్యం అందించకపోవడంతోనే మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ

స్టాఫ్‌ నర్సు తీరుపై ఆగ్రహం


కోసిగి, జూన్‌ 25: మండలంలోని సజ్జలగూడేనికి చెందిన కవిత(24) అనే గర్భిణి మృతి చెందింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో కుటుంబ సభ్యులు కోసిగి పీహెచ్‌సీకి తీసుకొచ్చా రు. అయితే ఆమె పరిస్థితి బాగలేకపోవ డంతో అక్కడి నుంచి ఆదోనికి 108 వాహనంలో తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. 


స్టాఫ్‌ నర్స్‌ నిర్లక్ష్యం వల్లే..


గర్భిణిని ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా స్టాఫ్‌ నర్స్‌ దుర్భాషలాడారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. చికిత్స చేయాలని కోరగా పట్టించుకోలేదన్నారు. గర్భిణి పరిస్థితి బాగా లేదని చెప్పి అంబులెన్స్‌ను పిలిపించి ఆదోనికి పంపించారని తెలిపారు. అయితే అంతకన్నా ముందుగానే స్టాఫ్‌ నర్స్‌ ‘కడుపునకు అన్నం తింటారా? గడ్డి తింటారా? ఈ సమయంలో వచ్చి ఇబ్బంది పెడతారా? అంటూ నానా దుర్భాషలాడారని ఆరోపించారు. 


చికిత్స అందించి ఉంటే బతికేది


గర్భిణి కవితతోపాటు నేను కూడా కోసిగి ఆసుపత్రికి వెళ్లా. డ్యూటీలో ఉన్న సారు వచ్చి రాగానే మమ్మల్ని తిట్టడం మొదలు పెట్టారు. కొద్దిసేపటి తర్వాత సీరియస్‌గా ఉందంటూ ఆదోని ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనంలో మమ్మల్ని పంపించారు. అయితే అప్పటికే గర్భిణి మృతి చెందిందని ఆదోని వైద్యులు తెలిపారు. కోసిగిలోనే చికిత్స చేయించి ఉంటే తమ కుమార్తె బతికేది.


 - హరిజన శివమ్మ, గర్భిణి పెద్దమ్మ


గైనకాలజిస్టు లేరు


కోసిగి పీహెచ్‌సీలో గైనకాలజిస్టు లేరు. స్టాఫ్‌ నర్స కాన్పులు చేస్తారు. బీపీ ఎక్కువ ఉండడం వల్ల గర్భిణి చనిపోయినట్లు తెలిసింది. ఆసుపత్రికి రావడానికి ముందుగానే ఆర్‌ఎంపీ వైద్యుడిని సంప్రదించినట్లు మాకు సమాచారం అందింది.


 - డా.మనోజ్‌ కుమార్‌, వైద్యాధికారి

Updated Date - 2022-06-26T05:25:58+05:30 IST