మరియుపోల్ ఆసుపత్రిపై దాడి ఘటన.. ఆ ‘మహిళ’ చనిపోయింది

ABN , First Publish Date - 2022-03-15T00:17:36+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దురాగతాలకు అద్దంపట్టే ఘటన ఇది. మరియుపోల్‌లోని ప్రసూతి, చిన్నపిల్లలపై ఇటీవల

మరియుపోల్ ఆసుపత్రిపై దాడి ఘటన.. ఆ ‘మహిళ’ చనిపోయింది

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దురాగతాలకు అద్దంపట్టే ఘటన ఇది. మరియుపోల్‌లోని ప్రసూతి, చిన్నపిల్లలపై రష్యా సేనలు గతవారం బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. ఆసుపత్రిపై బాంబు పడిన వెంటనే అప్రమ్తతమైన ఆసుపత్రి సిబ్బంది ఓ గర్భిణిని దెబ్బతిన్న ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలిస్తున్న ఫొటో వెలుగులోకి వచ్చి అక్కడి దారుణ పరిస్థితిని ప్రపంచానికి చాటిచెప్పింది. ఇప్పుడా గర్భిణి, నవజాత శిశువు ఇద్దరూ మరణించిన విషయం తెలిసి ప్రపంచం నివ్వెరపోయింది. 


వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే, అప్పటికే తాను బిడ్డను కోల్పోయిన విషయాన్ని గ్రహించిన ఆమె ‘‘నన్ను ఇప్పుడే చంపేయండి’’ అని వైద్యులను ప్రాధేయపడింది. సిజేరియన్ ద్వారా వైద్యులు బిడ్డను వెలికితీసినప్పటికీ అప్పటికే ఆ చిన్నారి నిర్జీవంగా మారింది. ఆమె తుంటిభాగం నలిగిపోయిందని, పెల్విస్ వేరయిందని వైద్యులు గుర్తించారు. ఆమెను బతికించేందుకు వైద్యులు అరగంటపాటు కష్టపడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ‘‘ఇద్దరూ చనిపోయారు’’ అని సర్జన్ తైమూర్ మారిన్ పేర్కొన్నారు. 


వైద్యులకు ఆమె పేరు తెలుసుకునే అవకాశం కూడా లేకపోయింది. ఆ తర్వాత ఆమె భర్త, తండ్రి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు. నగరంలో సామూహిక ఖననాల కోసం తవ్వుతున్న చోట ఆమెను ఖననం చేయకపోవడంపై వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై బాంబులు వేయడం యుద్ధం నేరం కాదా? అని ఆరోగ్య  కార్యదర్శి సాజిద్ జావిద్ ప్రశ్నించారు.


ఇది భయంకరమైన దారుణమని, అంతర్జాతీయ చట్టం ప్రకారం ఆరోగ్య సంస్థలు, ఆసుపత్రులపై దాడి చేయరాదని అన్నారు. అయితే, ఆసుపత్రిపై దాడిని రష్యా ఖండించింది. ఐక్యరాజ్య సమితి, లండన్‌లో ఆ దేశ రాయబారులు ఈ దాడిని ‘ఫేక్ న్యూస్’గా కొట్టిపడేశారు. 

Updated Date - 2022-03-15T00:17:36+05:30 IST