గర్భిణులూ గాభరా వద్దు

ABN , First Publish Date - 2022-01-23T06:11:31+05:30 IST

సెకండ్‌ వేవ్‌తో పోల్చుకుంటే కొవిడ్‌తో గర్భిణులకు, బాలింతలకు పెద్ద ప్రమాదం కనిపించడం లేదు.

గర్భిణులూ గాభరా వద్దు

అత్యవసరమైతే తప్ప ఆస్పత్రికి రావొద్దు

సీనియర్‌ గైనకాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ పార్ధసారధి రెడ్డి


రకరకాల ఇన్‌ఫెక్షన్ల భయం గర్భిణులకు, బాలింతలకు ఎక్కువగా ఉంటుంది. కొవిడ్‌ ఉపద్రవం ముంచుకొచ్చిన ఈ కాలంలో వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. పాజిటివ్‌ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అప్పుడే పుట్టే బిడ్డ క్షేమంగా ఉంటుంది.మూడో వేవ్‌ ముంచుకొచ్చిన ఈ కాలంలో పాజిటివ్‌ అయితే ఏం చేయాలి? కొవిడ్‌ మందులు వాడితే బిడ్డకు ఏమైనా ముప్పుంటుందా వంటి సందేహాలు సహజంగా ఉంటాయి. వీటికి సమాధానం ఇస్తున్నారు డాక్టర్‌ పార్ధసారధిరెడ్డి. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సీనియర్‌ గైనకాలజి్‌స్టగా ఆయన సేవలందిస్తున్నారు. మూడు వేవ్‌లలోనూ వందలాదిమంది పాజిటివ్‌లకు సేవలందించిన ఆనుభవంతో ఆంధ్రజ్యోతి ద్వారా ఆయన అందిస్తున్న సూచనలు...


తిరుపతి, ఆంధ్రజ్యోతి: సెకండ్‌ వేవ్‌తో పోల్చుకుంటే కొవిడ్‌తో గర్భిణులకు, బాలింతలకు పెద్ద ప్రమాదం కనిపించడం లేదు. అయితే పాజిటివ్‌ అవుతున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతూ ఉంది. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పండుగ ముందు వరకు 2 పాజిటివ్‌ కేసులు ఉంటే, ఇప్పుడు 50 మంది గర్భిణులు కొవిడ్‌తో ఉన్నారు. వీరిని ప్రత్యేకంగా వేరే భవనంలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. నవజాత శిశువులకు పాలు కూడా వాళ్లే ఇస్తున్నారు. మాస్కు ధరించి, చేతికి శానిటైజ్‌ వేసుకుని పాలు పట్టించుకోవచ్చు. గర్భిణి పాజిటివ్‌ అయినా ఒకరిద్దరికి మినహా శిశువులకు రావడంలేదు. వచ్చినవారికి కూడా ఎలాంటి ఇబ్బందులు రావడంలేదు. గర్భిణి పాజిటివ్‌ అయినంత మాత్రాన ఆందోళన పడనవసరం లేదు.  డాక్టర్‌ సలహా మేరకు చికిత్స తీసుకుని ఇంట్లోనే ఉండచ్చు.  రోజూ ఆవిరి పట్టుకుంటే సరిపోతుంది. కొవిడ్‌ ప్రోటోకాల్‌ మందులు డాక్టర్‌ సలహా మేరకు వాడుకోవచ్చు. ఈ మందులు వాడడం వల్ల పుట్టబోయే శిశువు మీద ప్రభావం ఉంటుందేమో అనే ఆందోళన చెందవద్దు.  పెద్ద ప్రభావంచూపవు.


డాక్టర్లూ బాధితులవుతున్నారు

వైద్యసేవలు అందించాల్సిన గైనకాలజిస్టులు పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ అయిపోతున్నారు. 11మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 11మంది పీజీలు,  ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఒక్కొక్కరు చొప్పున వైరస్‌ బారిన పడ్డారు. ఇలాగే కొనసాగితే స్టాఫ్‌ కొరత ఏర్పడుతుంది.  సాధారణంగా రోజుకు 25 నుంచి 30వరకు సాధారణ, సిజేరియన్లు జరుగుతాయి.  కొవిడ్‌ సమయంలో వీరందరికీ చికిత్స అందించాలంటే డాక్టర్లు, సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలి. ఒత్తిడి తగ్గాలంటే ఆరేడు నెలల పాటు గర్భిణులు చిన్న చిన్న వాటికి ఆస్పత్రికి రాకుండా ఉంటే మంచిది. ఇంటిదగ్గరే బీపీ చూసుకుంటూ ఈ నెలరోజులు ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. 


ఈ జాగ్రత్తలు తీసుకోండి


గర్భంతో ఉన్నపుడు సాధారణంగానే ఇన్ఫెక్షన్‌ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు వారు ఐసోలేటెడ్‌గానే ఉండాలి. గుంపులు ఉండే చోటుకు వెళ్లకూడదు.ఆస్పత్రులకు పరీక్షల కోసం వెళ్లేప్పుడు తప్పనిసరిగా కొవిడ్‌ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. చీటికీ మాటికి ఆస్పత్రులకు వెళ్లద్దు. స్కానింగ్‌, వ్యాక్సిన్‌ కోసమే ఆస్పత్రులకు వెళ్లాలి. అత్యవసరమనిపిస్తేనే ఆస్పత్రికి వెళ్లండి. ఇంటిపట్టునే జాగ్రత్తగా ఉండడమే గర్భిణులకు క్షేమం.  

Updated Date - 2022-01-23T06:11:31+05:30 IST