గర్భిణులకు సేవాభావంతో వైద్య సేవలందించాలి

ABN , First Publish Date - 2022-05-28T05:51:24+05:30 IST

: వైద్యులు గర్భిణులకు సేవాభావంతో వైద్య సేవలందించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

గర్భిణులకు సేవాభావంతో వైద్య సేవలందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ పాల్గొన్న వైద్యాధికారులు, అంగన్‌వాడి సూపర్‌వైజర్లు

- అనీమియా ముక్త్‌ కరీంనగర్‌ను సాధించేందుకు జిల్లాలో ఏ షీల్డ్‌ యాప్‌

- సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

- కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, మే 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వైద్యులు గర్భిణులకు సేవాభావంతో వైద్య సేవలందించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లతో  ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణుల నమోదు, సాధారణ కాన్పులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వచ్చిన కార్మికులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, ఆశా కార్యకర్తలు గర్భిణులు తీసుకునే ఆహారం, వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందస్తుగా తీసుకోవాల్సిన వైద్యం గురించి అవగాహన కల్పించాలని అన్నారు. గర్భిణుల వివరాలను నమోదు చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరిగిన అనంతరం వారికి లభించే కేసీఆర్‌ కిట్‌, ఇతర ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా జిల్లాలో అనిమియా ముక్త్‌ కరీంనగర్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఈ కార్యక్రమం ద్వారా రక్తహీనతతో ఏ మహిళ కూడా బాధపడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఏ షీల్డ్‌ యాప్‌ను రూపొందించామని, దీనిపై ఆశాలకు శిక్షణను అందిస్తామని తెలిపారు. పీహెచ్‌సీల వారీగా గర్భిణుల వివరాలను సేకరించి పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయించు కునేలా అవగాహన కల్పించాలని, ఓపీల వివరాలను నమోదు చేయాలని, పీహెచ్‌సీల్లో ల్యాబ్‌ టెక్నీషియన్లు అందుబాటులో లేకపోతే ఆశాలను వినియోగించుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన వారికి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కాకుండా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సేవలందించేలా చూడాలని, ఎటువంటి సమస్యలు లేని ఆరోగ్య కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, అవసరమైతే వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వైద్య సహాయాన్ని అందించాలని సూచించారు. పోషన్‌ అభియాన్‌ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించాలని, తల్లిపాలను పిల్లలకు అందించడంపై అవగాహనను కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల, అలీమ్‌, వైద్యాధికారులు, సీడీపీవోలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T05:51:24+05:30 IST