పరిష్కారం అప్పుడే సాధ్యం

ABN , First Publish Date - 2022-04-15T05:30:00+05:30 IST

ఈ రోజుల్లో ఎంతోమంది చదువులు పూర్తయ్యాక ఉద్యోగాల వేటలో చిన్న గ్రామాలను వదలి మహా నగరాలకు వెళ్తున్నారు.

పరిష్కారం అప్పుడే సాధ్యం

ఈ రోజుల్లో ఎంతోమంది చదువులు పూర్తయ్యాక ఉద్యోగాల వేటలో చిన్న గ్రామాలను వదలి మహా నగరాలకు వెళ్తున్నారు. అక్కడ జనసందోహంలో పడి కొట్టుకుపోతూ... ఒంటరితనంతో ఆవేదనకు గురవుతున్నారు. నగరాలకు వెళ్ళినవారికి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. మిత్రులు ఏర్పడతారు. కానీ, సొంత కుటుంబాలకు దూరమైపోతున్నారు. తమకు ఇష్టమైన వాళ్ళను చూసేందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వేధించే ఒంటరితనం నుంచి ఎలా బయటపడాలో అర్థం కాదు. 


చిన్నప్పుడు మీరు ఆటపాటల్లో గడుపుతారు. కాస్త పెద్దయ్యాక బడికి వెళ్తారు. అక్కడ స్నేహితులు తయారవుతారు. మీరు చదువుకుంటూ, బాధ్యతలను అర్థం చేసుకుంటారు. మరికాస్త పెరిగాక మన సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకుంటారు. క్రమంగా మీలో ఆశలు, ఆశయాలు, ఆలోచనలు, కోరికలు పెరుగుతాయి. డాక్టరో, ఇంజనీరో కావాలనిపిస్తుంది. ఆ చదువులు పూర్తి చేసి, కోరుకున్న ఉద్యోగం సంపాదిస్తారు. ఇదంతా గమనిస్తే... ‘రివర్స్‌ ఇంజనీరింగ్‌లా అనిపిస్తుంది. ఎందుకంటే, మీరు ఏదో ఒక లక్ష్యం ఏర్పరచుకున్నారు. మీరు ఏం చేసినా ఆ లక్ష్యం నెరవేరాలనేది మీ ఆకాంక్ష. దాని కోసం మీ సమయాన్నీ, శక్తి సామర్థ్యాలనూ ధారపోస్తున్నారు. క్రమంగా ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. దాంతో మీ జీవితం హాయిగా, ప్రశాంతంగా సాగిపోతుందన్న భావనతోనే మీరు ఇవన్నీ చేస్తారు. ఆ తరువాత ఎలాంటి ఇబ్బందీ ఉండదనుకుంటారు. కానీ లక్ష్యం చేరుకున్నవారిలో... ఇంకా ఏదో పొందాలనే ఆశ యథాతథంగా ఉంటుంది. మరోవైపు బంధాలకు దూరమవుతారు. 


ఈ జీవితం మనకు లభించింది దేనికి? రివర్స్‌ ఇంజనీరింగ్‌ కోసమా? లేదా వేరొకదాని కోసమా? నిజానికి జీవితంలో ఏ స్థితిలో ఉన్నా అసలైన ఆనందాన్ని పొందగలిగే అవకాశం మీ ముందే ఉంది. మీరు మీ జీవితంలో ఏదో ఒకటి మాత్రమే కాదు... ఎన్నో సాధించగలరు. కానీ ఏది చేసినా మనస్ఫూర్తిగా చెయ్యాలి. అప్పుడు మీకు అది ఒక పనిలా అనిపించదు... ఆనందంగా అనిపిస్తుంది. దాని వల్ల మీరు పూర్తి ప్రయోజనం కూడా పొందుతారు. 


ఇక, ఒంటరితనం విషయానికి వస్తే... కుటుంబ సభ్యులతో ఉన్నవారిని కూడా ఒక విధంగా అది వేధిస్తూనే ఉంటుంది. గ్రామంలో ఉన్నవారు ‘నేను ఎంత చదువుకున్నా సరైన అవకాశాలు లేవు. నా పరిస్థితి ఏమీ బాగోలేదు’ అని బాధపడుతూ ఉంటారు. తల్లితండ్రులతో కలిసి ఉన్నప్పటికీ, ‘అయ్యో! నేను సిటీకి ఎందుకు వెళ్ళలేకపోయాను?’ అని ఆవేదన చెందుతూ ఉంటారు. ఇక నగరాల్లో ఉన్నవారు ‘అయ్యో! నా తల్లితండ్రులతో ఉంటే ఎంత బాగుండేదో!’ అనుకుంటారు. ఇలా ఇద్దరూ ‘అయ్యో!’ అనే అనుకుంటారు. 


మీరు రోడ్డు పక్కన దుకాణంలో ఒక సూట్‌ చూశారు. బాగుందని దాన్ని కొనుక్కున్నారు. ఇక మరెప్పుడూ ఇంకో సూట్‌ కొనరా? రెండు, మూడు నెలల తరువాతో, ఆ సూట్‌ సరిపోకపోతేనో, మరో సూట్‌ కావాలనిపిస్తేనో తప్పకుండా కొంటారు. అలాంటప్పుడు మొదటిది ఎందుకు కొన్నట్టు? ఎందుకంటే అప్పుడది మీకది నచ్చింది కాబట్టి. అలాగే, మీ స్థితిగతులు మారినప్పుడు మిగిలిన అంశాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. పరిస్థితులు మారడం అనేది సహజం,


సముద్రంలో అలల్ని లెక్కించలేం. అదే విధంగా ఈ భవసాగరం కూడా సముద్రం లాంటిదే. మన మనసులో అలలు వస్తూ ఉంటాయి. అలల్ని లెక్కించకండి. మీరు కూర్చున్న నావ ఆ అలల తాకిడికి మునిగిపోకుండా చూసుకోండి. ఒంటరితనం మిమ్మల్ని వేధించడం మొదలెడితే... మీ నావ మునిగే ప్రమాదం ఉంది. ‘ఇదంతా మనసు పన్నే పన్నాగం’ అని గుర్తించండి. ఒక్కొక్కరికీ ఒక్కో విధమైన కష్టం, ఒక్కో విధమైన బాధ ఉంటాయి. అవి కలవరపెడుతూ ఉంటాయి. మరి, సుఖశాంతులు ఎవరికి ఉంటాయి? తమలోని దివ్యత్వాన్ని తెలుసుకున్నవారికి, తనలో ఉన్న ఆ దైవాన్ని గుర్తించిన వారికి ఉంటాయి. 


మీరు ఎక్కడికి వెళ్ళినా... మీతో పాటు... మీలో భగవంతుడు ఉన్నాడు. ఆయన మీకు అసలైన మిత్రుడు, మీరు కోరుకొనే అసలైన ప్రేమ, సంతోషం, సాఫల్యత... అన్నీ మీలోనే ఉన్నాయి. కాబట్టి ఒంటరితనంతో కుంగిపోవాల్సిన అవసరం లేదు. మీ సమస్యకు పరిష్కారం... మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, మీ జీవితంలో మీకు లభ్యమైనదాన్ని గుర్తించడం. అలా గుర్తించని నాడు మీ జీవితంలో ఏ మార్పూ రాదని గ్రహించండి. 



ప్రేమ్‌ రావత్‌, 9848054435

Updated Date - 2022-04-15T05:30:00+05:30 IST