ప్రేమ సమాజం భూములపై కన్ను

ABN , First Publish Date - 2022-05-24T06:51:13+05:30 IST

ప్రేమ సమాజం భూములపై అధికార పార్టీ నేతల కళ్లుపడ్డాయి.

ప్రేమ సమాజం భూములపై కన్ను
రుషికొండలో ప్రేమసమాజం భూములు

దీర్ఘకాలిక లీజుకు తీసుకునేందుకు వైసీపీ నేతల వ్యూహం

సహకరిస్తున్న దేవదాయ శాఖ

పార్టీకి రూ.కోటి ఫండ్‌ ఇస్తే వేలం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని హామీ

రూ.25 లక్షలు అడ్వాన్స్‌

వేలంలో భూమి దక్కకపోతే అడ్వాన్స్‌ వదులుకోవలసిందేనని ముందే స్పష్టీకరణ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రేమ సమాజం భూములపై అధికార పార్టీ నేతల కళ్లుపడ్డాయి. ప్రేమ సమాజానికి నగరంలో వందల కోట్ల రూపాయల విలువైన భూములు వున్న సంగతి తెలిసిందే. వాటిలో కొన్నింటిని గతంలో లీజుకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి రాగానే మొత్తం ప్రేమ సమాజాన్నే దేవదాయ శాఖ ద్వారా స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత లీజులు రద్దు చేసి విలువైన భూములు వెనక్కి తీసుకుంది. అందులో రుషికొండ భూములు కూడా ఉన్నాయి. అక్కడ సర్వే నంబర్లు 16, 23, 24లలో 47.33 ఎకరాలు ఉన్నాయి. వాటిలో కొన్ని బీచ్‌ను ఆనుకొని, మరికొన్ని బీచ్‌ రోడ్డు పక్కన ఉన్నాయి. పర్యాటకంగా మంచి డిమాండ్‌ వున్న ప్రాంతం కావడంతో ఆ భూముల్లో రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్‌ పార్లర్లు, రిసార్ట్స్‌ పెట్టాలని వైసీపీలో రియల్‌ ఎస్టేట్‌, తదితర వ్యాపారాలు చేసే పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఆ మేరకు వారిలో కొందరు దేవదాయ శాఖను సంప్రతించారు. భూములు ఖాళీగా ఉన్నందున ఆదాయం ఏమీ రావడం లేదు కాబట్టి,  దీర్ఘకాలిక లీజులు ఇవ్వాలని కోరారు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు పాటు పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకువెళ్లాల్సి వుంటుందని సదరు అధికారులు సెలవిచ్చారు. ప్రేమసమాజం భూములపై పార్టీ కీలక నేతలను పూర్తి అవగాహన ఉన్నందున వారికి చెప్పకుండా ఏమీ చేయలేమని పరిస్థితి వివరించారు.


రూ.కోటికి బేరం

కొద్దిరోజులు చర్చలు జరిగాక...అధికార పార్టీకి కోటి రూపాయల ఫండ్‌ ఇస్తే...ఆ భూములను వేలం వేయడానికి సిద్ధం చేస్తామనే సమాచారం సదరు నేతలకు అందింది. ముందుగా రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వాలని, ఆ తరువాత వేలం పాడుకున్నాక మిగిలిన డబ్బులు ఇవ్వాలని దేవదాయ ఉద్యోగులు వెల్లడించారు. ఇక్కడే పార్టీ నేతలకు అనుమానం కలిగింది. వేలం పాట నిర్వహిస్తే...ఇంకా చాలామంది పాల్గొంటారని, అప్పుడు తమకు వాటిని ఎలా కేటాయిస్తారనే అనుమానం తలెత్తింది. ఇదే విషయాన్ని ఉద్యోగుల వద్ద ప్రస్తావించారు. ఆ భూములను ప్రస్తుతం ఎవరికీ ఇచ్చే ఉద్దేశం లేదని, పెద్దలను ఒప్పించి వేలం పాట వరకు తీసుకురావడానికే కోటి రూపాయలు అవుతుందని వివరించారు. వేలంలో మిగిలిన వారితో పోటీ పడి పాడుకోవలసిందేనని, అందులో తమ ప్రమేయం ఏమీ ఉండబోదని స్పష్టంచేశారు. ఒకవేళ వేలంలో తమకు ఆ భూములు రాకపోతే...అడ్వాన్స్‌గా ఇచ్చే రూ.25 లక్షలు వెనక్కి ఇచ్చేస్తారా? అని సదరు నేతలు ప్రశ్నిస్తే...ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి రావని, వేలం వరకు ప్రాసెస్‌ తెచ్చినందుకు ఆ ఖర్చులు ఉంటాయని, వాటిని మరిచిపోవలసిందేనని స్పష్టంచేశారు. దాంతో సదరు నేతలు పునరాలోచనలో పడ్డారు. ఈ డీల్‌లో ముందుకు వెళ్లాలా? వద్దా? అని సంశయిస్తున్నారు.


పార్టీ ఫండ్‌కి, దేవదాయ శాఖకు సంబంధం ఏమిటి?

ప్రేమ సమాజం భూములను లీజుకు ఇవ్వడానికి దేవదాయ శాఖ ఉద్యోగులు పార్టీ ఫండ్‌ అడగడం ఏమిటనే దానిపై ఇప్పుడు వైసీపీ నేతలు దృష్టి సారించారు. అయితే గియితే పార్టీ నేతలు ఆ విషయం మాట్లాడాలి కానీ దేవదాయ శాఖ ఉద్యోగులు బేరసారాలు ఆడడం ఏమిటి? అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి, నివృత్తి చేసుకోవాలని యోచిస్తున్నారు. దేవదాయ శాఖలో పలువురు పార్టీకి కూడా పనిచేస్తున్నారా? ఈ విషయం మాకు ఇంతవరకు తెలియదే?...అంటూ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-05-24T06:51:13+05:30 IST