అకాల వర్షం..అతలాకుతలం

ABN , First Publish Date - 2021-05-07T06:56:08+05:30 IST

అకాల వర్షానికి అన్నదాతలు అతలాకుతల మయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురు వారం సాయంత్రం కురిసిన వర్షానికి ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, చందుర్తి, కోనరావుపేట మండ లాల్లో కొనుగోలు కేంద్రాల్లో దాదాపు ఐదు వేల క్వింటాళ్ల వరకు ఆరబోి సన ధాన్యం తడిసిపోయింది.

అకాల వర్షం..అతలాకుతలం
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో వాన నీటికి కొట్టుకుపోయిన ధాన్యం

- ఐదు వేల క్వింటాళ్ల మేర తడిసిన ధాన్యం 

- వరదకు కొట్టుకుపోయిన వడ్లు

సిరిసిల్ల మే 6 (ఆంధ్రజ్యోతి)/గంభీరావుపేట/చందుర్తి/కోనరావుపేట/ వీర్నపల్లి/ఎల్లారెడ్డిపేట: అకాల వర్షానికి అన్నదాతలు అతలాకుతల మయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురు వారం సాయంత్రం కురిసిన వర్షానికి ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, చందుర్తి, కోనరావుపేట మండ లాల్లో కొనుగోలు కేంద్రాల్లో దాదాపు ఐదు వేల క్వింటాళ్ల వరకు ఆరబోి సన ధాన్యం తడిసిపోయింది. వరద నీటికి ధాన్యం కొట్టుకుపోయింది. కోత దశలో ఉన్న వరి పంట నేలరాలింది. 

- గంభీరావుపేటలో..

గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు మల్లుపల్లె, నర్మాల, లింగాపూర్‌, మల్లారెడ్డిపేట గ్రామాల్లో గురువారం సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం పడింది. కోతలకు వచ్చిన వరి పంటలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న దాన్యం నిల్వలు తడిసి పోయాయి. వరుసగా మూడు రోజుల నుండి వర్షం కురుస్తుండటంతో వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న దాన్యం నిల్వలను కాపాడుకోటానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. వర్షం వరుస బీభత్సం సృష్టిస్తుండటంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు. చేతికి వచ్చిన వరి పంట ఓ వైపు, కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం  నిల్వలు మరో వైపు ఉండ డంతో రైతన్నలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. వరుసగా వర్షాలు వస్తుండటంతో అస లు అన్నాదాతలు లబోదిబో మంటున్నారు. మల్లారెడ్డిపేటలో హన్‌మాన్‌ ఆలయంకు సమీపాన మామిడి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. 

- చందుర్తిలో..

చందుర్తి మండలంలోని సనుగుల, దేవుని తండా, రామరావుపల్లి, కిష్టంపేట, బండపల్లి జోగాపూర్‌ గ్రామాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లోని కోతకు సిద్దంగా ఉన్న వరిపంట నేలవాలగా వడ్ల గింజలు రాలి నేలపాలయ్యాయి. మరో వైపు రైతులు ఆయా గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటికి తడిసిపోవడంతో పాటు కొట్టుకుపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో నీరు పోవడానికి కాలువలు తీశారు. కిష్టంపేట, సనుగుల, రామరావుపల్లి గ్రామాల్లో నేలవాలిన వరి పంటను వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్‌, సర్పంచ్‌ కల్పన నరేష్‌, లింగంపల్లి కరుణాకర్‌, కమలా కర్‌రావులు పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరారు.

- కోనరావుపేటలో..

కోనరావుపేట మండలంలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ధాన్యం అంతా తడిసి ముద్దయింది. మండలంలో భారీ వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని నానకుండా కాపాడు కోవడానికి రెండు గంటల పాటు రైతులు ఇబ్బందులు పడ్డారు. అయినా భారీ వర్షానికి కొన్ని గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరదకు ధాన్యం కొట్టుకుపోయింది. ధాన్యాన్ని సేకరించడానికి రైతులు ఇబ్బందులలు పడ్డారు. 

- వీర్నపల్లిలో..

వీర్నపల్లి మండ లంలో గురువారం కురిసిన వర్షానికి పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో దాన్యం తడిసిముద్దయింది. బుధవారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోగా, తాజాగా కురిసిన వర్షానికి రైతన్నలకు మరింత నష్టం వాటిల్లింది.  మండలంలోని అడవిపదిర, లాల్‌సింగ్‌ త ండా, రంగంపేట తదితర గ్రామాల్లో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. 

- ఎల్లారెడ్డిపేటలో..

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు గొల్లపల్లి, పదిర, హరిదాస్‌నగర్‌, వెంకటాపూర్‌, బొప్పాపూర్‌, తదితర గ్రామాల్లో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షానికి నేలపాలయింది. సుమారు 400 క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టేందుకు తీసుకు వచ్చిన ధాన్యం తడిసిపోయింది. వరద ఉధృతికి ధాన్యం కొట్టుకుపోయింది. 

Updated Date - 2021-05-07T06:56:08+05:30 IST