అకాల వర్ష బీభత్సం

ABN , First Publish Date - 2022-05-19T06:32:37+05:30 IST

మంగళవారం రాత్రి విడవకుండా పడిన వర్షంతో మామిడి, వరి పంటలకు నష్టం వాటిల్లింది.

అకాల వర్ష బీభత్సం
పెద్దఉప్పరపల్లెలో నేల రాలిన మామిడి కాయలు

మామిడి, వరి, ఉద్యాన పంటలకు అపార నష్టం


సోమల, మే 18: మండలంలో మంగళవారం రాత్రి విడవకుండా పడిన వర్షంతో మామిడి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. సోమల, కందూరు, నెల్లిమంద, సూరయ్యగారిపల్లె, పెద్దఉప్పరపల్లె పంచాయతీల్లో వర్షం బీభత్సం సృష్టించింది.  15కిలోల బాక్స్‌ రూ.950కు చేరుకొని ఆనందించే సమయంలో సాగులో ఉన్న టమోటా పంటపై ఆశలు పెట్టుకున్న రైతులకు వర్షంతో దెబ్బపడింది.  కోతలకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలింది. సోమల - సదుం మార్గంలోని జగనన్న కాలనీలో ఏడు విద్యుత్‌ స్తంభాలు నేల వాలడంతో ఏఈ మహేంద్రరెడ్డి సిబ్బందితో కలసి పునరుద్ధరించారు. సోమల - నంజంపేట మార్గంలోని జీడిరేవుల వంక ఉధృతంగా ప్రవహించింది. పలు చెరువులకు జలకళ సంతరించుకున్నాయి. 


ఉద్యానపంటల నష్టం 


బైరెడ్డిపల్లె: మండలంలో  నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దాదాపు 30 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. కడపనత్తం, గౌనితిమ్మేపల్లె, లక్కనపల్లె, వెంగంవారిపల్లె, పాతపేట, పాతూరునత్తం, బేలుపల్లెలో కాకర, బీన్స్‌, బీర, అరటి, మామిడి పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యానవనశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. మామిడితోటల్లో కాయలు నేలరాలి పోవడంతో కొంతవరకు నష్టం జరిగింది. 


నీట మునిగిన  పొలాలు... బోర్ల నుండి ఉబికి వస్తున్న జలాలు


రామకుప్పం:  మండలంలో మంగళవారం రాత్రి  85.2 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది.  సింగసముద్రం బాబు కాలనీ వద్ద చెక్కెరకుంట నిండి వాననీరు రోడ్డుపైకి రావడంతో రాకపోకలకు కాలనీవాసులు ఇబ్బంది పడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో వాననీటిని కాలనీకి దూరంగా మళ్లించారు. పలు గ్రామాల్లో మామిడి, టమోటా, బీన్స్‌, చిక్కుడు, కాకర తదితర తోటలో వర్షపునీరు నిలిచాయి. దీంతో మొక్కలు కుళ్లిపోయి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆవులకుప్పం సహా పలు గ్రామాల వ్యవసాయ బోర్లలో నీరు ఉబికిపైకి వస్తున్నాయి. వర్షపు నీటితో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నిండుకుండలా మారాయి. 




Updated Date - 2022-05-19T06:32:37+05:30 IST