అకాల వర్షం.. అపార నష్టం

ABN , First Publish Date - 2022-01-15T04:32:02+05:30 IST

సంక్రాంతి అంటే రైతన్న పండగ.. గాదెల్లో ధాన్యం చూసి సంతోషపడాల్సిన సమయంలో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. పండిన పంట చేతికి వచ్చే తరుణంలో ఉరుము లేని పిడుగులా అకాల వర్షాలు వారిని కంట తడి పెట్టిస్తున్నాయి.

అకాల వర్షం.. అపార నష్టం
సీతానగరంలో వర్షం నీటిలో వరి కుప్పలు

చేతికి అందే పంట చేజారడంతో రైతన్న కంటతడి 

ఇతర పంటలకూ నష్టం

విజయనగరం (ఆంధ్రజ్యోతి)/ కలెక్టరేట్‌, జనవరి 14: సంక్రాంతి అంటే రైతన్న పండగ.. గాదెల్లో ధాన్యం చూసి సంతోషపడాల్సిన సమయంలో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. పండిన పంట చేతికి వచ్చే తరుణంలో ఉరుము లేని పిడుగులా అకాల వర్షాలు వారిని కంట తడి పెట్టిస్తున్నాయి. మొన్న గులాబ్‌ తుఫాన్‌, నిన్న జవాద్‌ తుఫాన్‌, ఇప్పుడు అకాల వర్షాలు అన్నదాతను పట్టి పీడిస్తున్నాయి. మొదటి నుంచి చివరి వరకూ న(క)ష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు మరింత నష్టం వచ్చింది. మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. కోసిన ధాన్యం ఇంకా చాలాచోట్ల పొలాల్లోనే ఉన్నాయి. నూర్పు కూడా చేపట్టలేదు. అవన్నీ అకాల వర్షాలకు తడుస్తున్నాయి. మొలకలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది సెప్టెంబరు చివరిలో గులాబ్‌ తుఫాన్‌ ప్రభావానికి జిల్లాలో 1575 ఎకరాల్లో  వరి, ప్రత్తి, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వచ్చింది. ఆ తర్వాత జవాద్‌ కారణంగా 695 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. ఇప్పుడు ఉపరితల ఆవర్తణ ప్రభావంతో పొలంలో చిన్న చిన్న కుప్పలతో  ఉన్న వరి తడిచి ముద్దవుతోంది. కొన్నిచోట్ల ధాన్యం మొలకలు కూడా వస్తున్నాయి. దీంతో పండిన పంటను ఇంటికి తెచ్చుకుని పరిస్థితి లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ లక్షా 30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా మూడు లక్షల 20 వేల మెట్రిక్‌ టన్నలు ధాన్యం సేకరించాలి. గత నెలలో తుపాన్‌ కారణంగా వరి నూర్పులను రైతులు వాయిదా వేసుకున్నారు. సంక్రాంతి తరువాత నూర్పులు వేసుకుందామని అనుకుంటున్న సమయంలో అకాల వర్షాలు అపార నష్టం తెస్తున్నాయి. 

జిల్లా అంతటా వాన

జిల్లావ్యాప్తంగా వర్షం పడుతోంది. గురువారం 27.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పార్వతీపురంలో అత్యధికంగా 162.8, అత్యల్పంగా విజయనగరంలో 2.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శుక్రవారం వేకువజాము నుంచి అనేక మండలాల్లో వర్షం పడింది. కళ్లాలో ఉన్న ధాన్యాన్ని కాపాడటం కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. గజపతినగరం, బొబ్బిలి, దత్తిరాజేరు, సాలూరు, గంట్యాడ, భోగాపురం మండలాల్లో శుక్రవారం వర్షం పడింది. పెసలు, మినుము పంటలకు కూడా ఈ వర్షాలతో నష్టమే అంటున్నారు. 

అరటితోటలు ధ్వంసం

సాలూరు రూరల్‌ : మరిపిల్లి, భూతాడవలస, మామిడిపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల తాకిడికి అరటితోటలు నేలకొరిగాయి. మండలంలో వంద ఎకరాలకు పైగా అరటి తోటలకు నష్టం వాటిల్లినట్టు రైతులు చెబుతున్నారు. మూడు ఎకరాల అరటి కాపుకొస్తున్న దశలో ధ్వంసమైందని మరిపిల్లికి చెందిన రైతు జన్ని చిన్నారావు  వాపోయాడు. కళ్లాల్లో అమ్మకం కోసం ఉంచిన ధాన్యం సైతం తడిసిపోయినట్టు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

గోనె సంచులు లేక..

గజపతినగరం: నూర్చిన ధాన్యం కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇంతవరకు గోనె సంచులు అందివ్వకపోవడంతో పంటను విక్రయించే అవకాశం లేకపోయిందని చెబుతున్నారు. ఈ కారణంగా కొంత పంట తడిచిపోయిందని వాపోతున్నారు. ఆర్‌బీకేల్లో గోనె సంచులు లేకపోవడంతో మిల్లర్లను ఆశ్రయించాల్సి వస్తోందంటున్నారు. 

వర్షంలోనే వరి కుప్పలు

గరుగుబిల్లి : మండలంలోని కొన్ని గ్రామాల్లో వరి కుప్పలు వర్షంలో తడుస్తున్నాయి. గోనె  సంచుల కొరత, మరోవైపు గిట్టుబాటు ధర లేక రైతులు అధికంగా పంట పొలాల్లోనే ఉంచారు. కుప్పల్లో నీరు చేరడంతో రంగు మారే పరిస్థితి నెలకొంది. వర్షాలు కురుస్తున్న తరుణంలో రైతులకు టార్పాలిన్లు అందించలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారని సీనియర్‌ తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వారపురెడ్డి సత్యనారాయణ విమర్శించారు. 

కొనుగోలు చేయక

 సీతానగరం: మరిపివలస, విప్పలవలస, గుచ్చిమి, పాపామ్మవలస, బుడ్డిపేట, లక్ష్మీపురం గ్రామాల్లో నీటిలో మునిగితేలుతున్న వరికుప్పలు కనిపించాయి. రైతుల కల్లాల్లో కూడా ధాన్యం బస్తాలు ఉన్నాయి. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని రైతులు మండిపడుతున్నారు.



Updated Date - 2022-01-15T04:32:02+05:30 IST