టెట్‌కు సన్నాహం

ABN , First Publish Date - 2022-06-25T05:30:00+05:30 IST

ఉపాధ్యాయ, ఉద్యోగ అర్హతకు టెట్‌ (టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2022 నోటిఫికేషన్‌ వెలువడింది.

టెట్‌కు సన్నాహం

దరఖాస్తుల ప్రక్రియతో కోచింగ్‌ సెంటర్‌లకు పెరిగిన డిమాండ్‌ 

ఆగస్టు 6 నుంచి పరీక్షలు 

ఒకసారి అర్హత సాధిస్తే జీవిత కాలం చెల్లుబాటు

మారిన నిబంధనలు


ఆలూరు, జూన్‌ 25: ఉపాధ్యాయ, ఉద్యోగ అర్హతకు టెట్‌ (టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2022 నోటిఫికేషన్‌ వెలువడింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత నిర్వహిస్తుండడంతో నిరుద్యోగ అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. ఈ నెల 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ఆరంభమైంది. అభ్యర్థులు కంప్యూటర్‌ కేంద్రాలలో దరఖాస్తు చేసేందుకు పరుగులు తీస్తున్నారు. వచ్చే నెల జూలై 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


కోచింగ్‌ సెంటర్‌లకు పెరిగిన డిమాండ్‌..


నాలుగేళ్ల తర్వాత టెట్‌ నోటిఫికేషన్‌ రావడంతో కోచింగ్‌ సెంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇప్పటికే అభ్యర్థులు అవనిగడ్డ, కర్నూలు, ఎమ్మిగనూరు, విజయవాడ ప్రాంతాలకు వెళ్తున్నారు. అక్కడే మకాం వేశారు. ఉమ్మడి జిల్లాలో 2008లో జరిగిన టెట్‌ పరీక్షలకు 20 వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. డీఎడ్‌, బీఎడ్‌ కోర్సులు పూర్తి చేసిన, చదువుతున్న వారు కూడా సన్నద్ధమవుతున్నారు. గతంలో ఎక్కువ, తక్కువ మార్కులు సాధించిన వారు కూడా మరింత మెరుగైన మార్కుల కోసం పోటీ పడే అవకాశం ఉన్నందున ఈ ఏడాది 30 వేలకు పైగా అభ్యర్థులు టెట్‌ పరీక్షలకు హాజరు కావచ్చని అంచనా. ఇదే అదనుగా కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు రాయితీల పేరిట అభ్యర్థులకు వల వేస్తున్నారు. కొన్ని కోచింగ్‌ సెంటర్లు వాయిదాల ఆఫర్లు ఇస్తున్నారు. 10 వేలు, 20 వేలు మరి కొన్ని కోచింగ్‌ సెంటర్లు టెట్‌, డీఎస్సీ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ పేరుతో ప్యాకేజీలు అమలు చేస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు గ్రూప్‌గా ఏర్పడి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కోచింగ్‌లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 


మార్పులు చేర్పులు..

 

1 నుంచి 6వ తరగతుల వరకు పాఠ్యంశాలను నూతన సిలబ్‌సగా నిర్దేశించారు. మిగిలిన తరగతులకు పాత సిలబస్‌ ఉంటుంది. వ్యాయమ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎస్జీటీలకు 1ఏ (సాధారణ పాఠశాలలకు), 1బీ ప్రత్యేక పాఠశాలకు, స్కూల్‌ అసిస్టెంట్‌కు 1 బీ (ప్రత్యేక పాఠశాలలకు) స్కూల్‌ అసిస్టెంట్లకు 2ఏ, 2బీ పేపర్లు ఉంటాయి. 


టెట్‌లో ఒక్కసారి ఉత్తీర్ణత సాధిస్తే చాలు జీవితకాలం అర్హులుగా పరిగణిస్తారు. 


టెట్‌ అర్హత మార్కులు యథాతధం..


టెట్‌ అర్హత మార్కులో ఎన్‌సీటీఈ మార్గదర్శకాల మేరకు గతంలోని నిబంధనలనే యథాతధంగా కొనసాగిస్తారు. జనరల్‌ క్యాటగిరి వారికి 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించాలి. గతంలో టెట్‌ అర్హత 7 ఏళ్ల పాటు చెల్లుబాటు అయ్యేది. అయితే ఒక్కసారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్‌ జీవితకాలం చెల్లుబాటయ్యేలా సవరణ చేశారు. 


ఆగస్టు 6 నుంచి పరీక్షలు..


ఆగస్టు 6 నుంచి 21 వరకు టెట్‌ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయి. ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు నిర్వహిస్తారు. తుది ఫలితాలు సెప్టెంబర్‌ 14న విడుదల కానున్నాయి. 

Updated Date - 2022-06-25T05:30:00+05:30 IST