సాగుకు సన్నద్ధం!

ABN , First Publish Date - 2021-05-16T05:13:36+05:30 IST

ఖరీఫ్‌ సాగుకు రంగం సిద్ధమవుతోంది. ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో విత్తనాల సరఫరాలో వ్యవసాయ శాఖ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రైతులు కోరిన విత్తనం అందించలేకపోతోంది. సబ్సిడీలు అంతంతమాత్రంగానే ఇస్తోంది. దీంతో రైతులపై అధిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో ఖరీఫ్‌నకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సుమారు 2.10 లక్షల హెక్టార్ల పరిధిలో వరిసాగుకు 77,200 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని గుర్తించారు. ఈ మేరకు ఏపీ సీడ్స్‌, నూజివీడు ప్రైవేట్‌ సీడ్స్‌, తణుకు, తెలంగాణ లోని హుజరతాబాద్‌ ప్రాంతాల నుంచి ఈ విత్తనాలను తెప్పించి రైతులకు అందించే దిశగా చర్యలు చేపడుతున్నారు.

సాగుకు సన్నద్ధం!

 ‘ఖరీఫ్‌’ విత్తనాల పంపిణీకి సన్నాహాలు

 జిల్లాకు 77,200 క్వింటాళ్లు అవసరమని అధికారుల ప్రణాళికలు

 గోదాముల్లో 28,930 క్వింటాళ్లు సిద్ధం 

 సంపద స్వర్ణకు సబ్సిడీ ఎత్తివేత!

 ‘పచ్చిరొట్ట’ పంపిణీకి చర్యలు

(టెక్కలి)

ఖరీఫ్‌ సాగుకు రంగం సిద్ధమవుతోంది. ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో విత్తనాల సరఫరాలో వ్యవసాయ శాఖ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రైతులు కోరిన విత్తనం అందించలేకపోతోంది. సబ్సిడీలు అంతంతమాత్రంగానే ఇస్తోంది. దీంతో రైతులపై అధిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో ఖరీఫ్‌నకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సుమారు 2.10 లక్షల హెక్టార్ల పరిధిలో వరిసాగుకు 77,200 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని గుర్తించారు. ఈ మేరకు  ఏపీ సీడ్స్‌, నూజివీడు ప్రైవేట్‌ సీడ్స్‌, తణుకు, తెలంగాణ లోని హుజరతాబాద్‌ ప్రాంతాల నుంచి ఈ విత్తనాలను తెప్పించి రైతులకు  అందించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 28,930 క్వింటాళ్లను సిద్ధం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఈసారి రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. ఏటా వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఎదలు వేసిన రైతులకు పెట్టుబడి అధికమవుతోంది. జూన్‌, జూలై నెలల్లో సాగునీరు అందక, సకాలంలో మందులు కొట్టలేక దిగుబడి తగ్గుతోంది. ఎద పంటలో పండించిన బియ్యం కూడా ముక్కలు అవుతుండడంతో ఉడుపు వ్యవసాయంపైనే రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ దిశగా అధికారులు ప్రోత్సాహం కల్పిస్తున్నారు. ఈ ఏడాది కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు విడిచిపెట్టేలా చర్యలు చేపడుతున్నారు. 


ప్రణాళికలు.. నిల్వలు ఇలా

ఎంటీయూ7029 స్వర్ణ 24,811 క్వింటాళ్లు, ఎంటీయూ 1121 శ్రీధుతి 18,119 క్వింటాళ్లు, ఎంటీయూ 1061 ఇంద్ర 7,156 క్వింటాళ్లు, బీపీటీ3299 సోనామసూరి 4,187 క్వింటాళ్లు, సాంబ 12,295 క్వింటాళ్లు, ఎంటీయూ 1064 రకం 3,169 క్వింటాళ్లు, 1224 మార్టూర్‌ సాంబ 2,132 క్వింటాళ్లు, 1232 రకం 100 క్వింటాళ్లు, 1210 రకం 384 క్వింటాళ్లు, శ్రీకాకుళం సన్నాలు 4,449 క్వింటాళ్లు అవసరమని ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం స్వర్ణ 9,570 క్వింటాళ్లు, శ్రీధుతి 6,850 క్వింటాళ్లు, సాంబ 3వేల క్వింటాళ్లు, శ్రీకాకుళం సన్నాలు 3,150 క్వింటాళ్లు, సోనామసూరి 3,200 క్వింటాళ్లు, ఇంద్ర 3,160 క్వింటాళ్ల విత్తనాలు గోదాములకు చేరుకున్నాయి. ఈ ఏడాది సంపద్‌స్వర్ణకు సబ్సిడీ ఎత్తి వేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అధికంగా మార్టూర్‌ సాంబ విత్తనాలు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. తెగుళ్లు, దోమపోటు వంటివి తట్టుకునే శక్తి ఈ విత్తనాలకు ఉందని, చేను కూడా గాలివానలకు పడదని పేర్కొంటున్నారు. సాంబ తరహాలో బియ్యం సన్నరకంగా ఉంటాయని.. అందుకే వీటిని అందజేయాలని నిర్ణయించారు. భూమిలో నత్రజని శాతం పెంచేందుకు పచ్చిరొట్ట విత్తనాలు, పిల్లిపెసర, కట్టిజనుము వంటి విత్తనాలు కూడా ఈ ఏడాది రైతులకు సరఫరా చేయనున్నారు. ఖరీఫ్‌ నాటికి 4,500 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అవసరమని గుర్తించారు. ప్రస్తుతం 730.60 క్వింటాళ్ల విత్తనాలు ఏపీ సీడ్స్‌ వద్ద సిద్ధంగా ఉంచారు. విత్తనాలు  పంపిణీ చేసే సమయం..   సబ్సిడీ విషయమై త్వరలో వెల్లడించనున్నారు. 


రాష్ట్రస్థాయి కమిటీలో ఏడీ తిరుమలరావు 

టెక్కలి, మే 15: రాష్ట్రస్థాయి వ్యవసాయ శాఖ కమిటీలో సభ్యుడిగా టెక్కలి వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు(ఏడీ) బుడుమూరు వెంకట తిరుమలరావుకు చోటు లభించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్‌ హనుమంతు అరుణకుమార్‌ నుంచి తిరుమలరావుకు శనివారం సమాచారం అందింది. ధాన్యం కొనుగోలు సమయంలో రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఉత్తరాంధ్ర నుంచి  తిరుమలరావుకు అవకాశం దక్కింది. రైతుభరోసా కేంద్రాలు గల ప్రాంతాల్లో ఫార్మర్స్‌ ఎడ్వయిజరీ బోర్డు ద్వారా రైతులు ధాన్యం విక్రయించేలా చేయడం. ఆ సమయంలో వ్యవసాయశాఖ, పౌరసరఫరాల విభాగం కలిసి పనిచేసి రైతులకు న్యాయం చేయడం. దళారీల పాత్ర లేకుండా, మిల్లర్లు దోపిడీకి పాల్పడకుండా రైతుల నుంచి కల్లాల్లోనే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేలా ఈ కమిటీ చర్యలు చేపడుతుంది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా వర్చువల్‌ సమావేశాలు నిర్వహించి బ్లూఫ్రింట్‌ కూడా కమిటీలో గల సహాయ సంచాలకులు సిద్ధం చేయాల్సి ఉంది.

Updated Date - 2021-05-16T05:13:36+05:30 IST