చేపల పెంపకానికి సన్నాహాలు

ABN , First Publish Date - 2022-06-27T06:53:46+05:30 IST

మత్స్య సంపద వృద్ధితోపాటు, మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఏటా ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తోంది.

చేపల పెంపకానికి సన్నాహాలు
చేప పిల్లలను వదులుతున్న సిబ్బంది (పైల్‌)

ఈ ఏడాది 3.16కోట్ల చేపపిల్లల పంపిణీ

చెరువుల పరిమాణాన్ని బట్టి సీడ్‌ 

జిల్లాలో 143 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు

యాదాద్రి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): మత్స్య సంపద వృద్ధితోపాటు, మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఏటా ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తోంది. అందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపల పంపిణీకి సంబంధిత శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. భారీ వర్షాలు కురిసి చెరువులు నిండాక చేపపిల్లలను వదలనున్నారు. హైదరాబాద్‌ నగరానికి జిల్లా చేరువలో ఉండటంతో నగరవాసులకు అవసరమైన చేపలు జిల్లా నుంచి సరఫరా అవుతుంటాయి. అంతేగాక జిల్లాలో ప్రతీ ఆదివారం ప్రధాన రహదారుల వెంట జోరుగా చేపల విక్రయాలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులకు మార్కెటింగ్‌ సౌకర్యంతో ఉండటంతో చేపల పెంపకంపై జిల్లా యంత్రాంగం దృష్టిపెట్టింది. వానాకాలం సీజన్‌ ప్రారంభం కాగా, భారీగా వర్షాలు కురిసిన పక్షంలో చేపల పెంపకానికి సీడ్‌ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 1,115 చెరువులు ఉన్నాయి. చెరువులు నిండితే జిల్లావ్యాప్తంగా 3.16కోట్ల చేపపిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటి ద్వారా 13,675 టన్నుల చేపలు ఉత్పత్తి కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 142 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 133 పురుష సభ్యుల సంఘాల్లో 8,336 మంది సభ్యులు ఉన్నారు. మరో 9 మహిళా సంఘాల్లో 593 మంది సభ్యులు ఉన్నారు. గతంలో జిల్లావ్యాప్తంగా 654 చెరువుల్లో చేపల పెంపకం చేశారు. ఈ సారి కూడా అన్ని చెరువుల్లోనూ చేపల పెంపకానికి సన్నాహాలు చేస్తున్నారు.

చెరువుల సామర్ధ్యాన్ని బట్టి చేపపిల్లల పంపిణీ

చెరువుల సామర్ధ్యానికి మించి చేపపిల్లలను (సీడ్‌) వదులుతుండటంతో ఆశించినమేర అవి ఎదగలేకపోతున్నాయి. దీంతో మత్స్యకారులు నష్టాల పాలవుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి చెరువుల్లో నీటినిల్వ ఆధారంగా చేపలు పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని చెరువుల పరిమాణంపై సమగ్ర సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఈ మేరకు నివేదిక అందించాలని తహసీల్దార్లకు అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో చెరువులు ఉన్నాయి, శిఖం భూమి ఎంత, నీటినిల్వలపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. తహసీల్దార్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా చేపపిల్లలను వదలనున్నారు. కట్ల, రోహు, మ్రిగాల, కామన్‌కార్ప్‌ చేపరకాలు, 12.01టన్నుల రొయ్యపిల్లలు వదలనున్నారు. వీటిలో రోసేన్‌బర్గీ రొయ్య రకాన్ని పంపిణీ చేయనున్నారు.

చేపల పంపిణీకి చర్యలు : రాజారాం, జిల్లా మత్స్యశాఖ అధికారి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపల పెంపకానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. సీడ్‌కోసం టెండర్లు పిలిచాం. ఇప్పటికే టెక్నికల్‌ బిడ్‌ ఓపెన్‌ చేశాం. త్వరలోనే ఫైనాన్సియల్‌ బిడ్‌ను ఓపెన్‌చేసి ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. మత్స్యశాఖ కమిషనర్‌ ఆదేశాల ప్రకారం స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా ఈ ఏడాది 30 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - 2022-06-27T06:53:46+05:30 IST