స్టీల్‌ప్లాంట్‌లో 200 ఆక్సిజన్‌ పడకలు సిద్ధం

ABN , First Publish Date - 2021-05-15T05:08:43+05:30 IST

ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్‌ పడకలు దొరకక కొవిడ్‌ బాధితులు ఊపిరాడక అల్లాడిపోతుంటే...ఆక్సిజన్‌ పడకలు అందుబాటులోకి తీసుకొచ్చిన స్టీల్‌ప్లాంట్‌లో వైద్య సేవలందించడానికి అఽధికారులు ముందుకు రాకపోవడం విచారకరం.

స్టీల్‌ప్లాంట్‌లో 200 ఆక్సిజన్‌ పడకలు సిద్ధం
గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ పడకలను పరిశీలిస్తున్న సీఐటీయూ నాయకులు

అనుమతులు ఇవ్వడంలో అధికారులు తాత్సారం

విశాఖపట్నం, మే 14: ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్‌ పడకలు దొరకక కొవిడ్‌ బాధితులు ఊపిరాడక అల్లాడిపోతుంటే...ఆక్సిజన్‌ పడకలు అందుబాటులోకి తీసుకొచ్చిన స్టీల్‌ప్లాంట్‌లో వైద్య సేవలందించడానికి  అఽధికారులు ముందుకు రాకపోవడం విచారకరం. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో లక్షలు చెల్లించే స్థోమత లేక, ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్‌ పడకలు చాలక రోగులు ఆరు బయటే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో కొవిడ్‌ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ముందుకొచ్చిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం టౌన్‌షిప్‌లోని గురజాడ కళాక్షేత్రంలో 200 ఆక్సిజన్‌ పడకలు సిద్ధం చేసింది.  రోగులకు వైద్య సేవలందించేందుకు అవసరమైన ముందులు, పల్స్‌ ఆక్సి మీటర్‌ వంటివి సిద్ధం చేశారు. అయితే ఇక్కడ వైద్య సేవలందించేందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు అధికారులు తాత్సారం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడ అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేశామని కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌కు ఉక్కు యాజమాన్యం లేఖ రాసింది.  అయితే వైద్య సేవలకు అధికారులు సిద్ధపడకపోవడం విమర్శలకు తావిస్తున్నది. గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన 200 పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వైద్య సేవలు అందించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు అధికారులను కోరారు. ఎమర్జెన్సీ మెడికల్‌ కిట్‌లు, కొంత మంది వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తామని వైద్యశాఖాధికారులు హామీ ఇచ్చినా ఇంతవరకు ఏర్పాటు చేయలేదని స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్‌ పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-15T05:08:43+05:30 IST