వానాకాలం సాగుకు ప్రణాళిక సిద్ధం

ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST

వానాకాలంలో లాభదాయకమైన దిగుబడి వచ్చే పంటలు సాగు చేసేలా వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.

వానాకాలం సాగుకు ప్రణాళిక సిద్ధం

సంగారెడ్డి జిల్లాలో 7,45,708,

మెదక్‌ జిల్లాలో 3,31,280 ఎకరాల్లో  పంటల సాగు అంచనా

వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు 

 అందుబాటులో సరిపడా విత్తనాలు  

 తగ్గనున్న వరి, పెరగనున్న పత్తి, మొక్కజొన్న సాగు


సంగారెడ్డి టౌన్‌, మే 20 : వానాకాలంలో లాభదాయకమైన దిగుబడి వచ్చే పంటలు సాగు చేసేలా వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. సంగారెడ్డి జిల్లాలో సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులతో పాటు చెరువులు, బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేస్తుంటారు.  ప్రతి యేటా వానాకాలంలో పత్తి, వరి, కందులు, పెసర, మినుములు తదితర పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతుంటారు. అయితే వరి సాగుచేయవద్దని ప్రభుత్వం ముమ్మరంగా ప్రచారం చేయడంతో పాటు పత్తి సాగు చేయాలని సూచించింది.  గత యాసంగిలో 35వేల ఎకరాల్లో సాగుచేశారు. ఈ వానాకాలంలోనూ వాణిజ్య పంటలతో పాటు చిరుధాన్యాలు సాగు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు అందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందించింది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  


7,45,708 ఎకరాల్లో పంటల సాగు అంచనా

ఈ వానాకాలంలో సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 7,45,708 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గతేడాది వానాకాలంతో పోలిస్తే ఈసారి అధికంగా అంచనా వేశారు. 2021 వానాకాలంలో అన్ని పంటలు కలిపి 7,15,37 ఎకరాల్లో సాగు చేశారు. ఈ సారి 30వేల ఎకరాల్లో అధికంగా సాగయ్యే అవకాశం ఉందని ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భజలాలు కూడా పెరిగాయి. వానాకాలానికి నెలరోజుల ముందే పంటసాగుపై రైతులను సమాయత్తం చేసేలా వ్యవసాయశాఖ అధికారుల కార్యాచరణను తయారు చేశారు. 


తగ్గనున్న వరిసాగు

2021 వానాకాలంతో పోలిస్తే ఈసారి జిల్లాలో వరి సాగు గణనీయంగా తగ్గనున్నట్టు ప్రణాళికలు సిద్ధం చేశారు. గతేడాది వానాకాలంలో 1,13,783 ఎకరాల్లో వరిసాగు చేయగా 2022 వానాకాలంలో 78 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. గతేడాది 3,61,166 ఎకరాల్ల పత్తిసాగు చేయగా ఈసారి 3,99,000 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉన్నది. గతేడాది 56,473 ఎకరాల్లో సోయాబీన్‌ సాగు చేయగా ఈసారి 72,800 ఎకరాల్లో సాగు చేయనున్నట్టు పేర్కొన్నారు. 27,630 ఎకరాల్లో చెరుకు పంటను సాగు చేయగా ఈ సారి 27,600 ఎకరాల్లో సాగు చేయవచ్చని అంచనా వేశారు. గతేడాది 90,655 ఎకరాల్లో కందులు సాగు చేయగా ఈసారి లక్షా 8వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని ప్రణాళికను ప్రకటించారు.  


1,21,672 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం

సంగారెడ్డి జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో మొత్తం 7,45,708 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు అయ్యే అవకాశం ఉందని ప్రణాళికలు చేసిన వ్యవసాయశాఖ 1,21,672 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో 1,07,476 మెట్రిక్‌ టన్నుల ఎరువులు జిల్లాకు కేటాయించగా (అలాట్‌మెంట్‌), 14,196 మెట్రిక్‌ టన్నుల ఎరువులు బఫర్‌జోన్‌ కింద నిల్వ ఉంచనున్నారు. జిల్లాలో 40,580 మెట్రిక్‌ టన్నుల యూరియా, 15,882 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 19,657 మెట్రిక్‌ టన్నుల ఎంవోపీ, 36,421 మెట్రిక్‌ టన్నుల ఎన్‌పీకేఎ్‌స, 9,132 మెట్రిక్‌ టన్నుల ఎస్‌ఎ్‌సపీ ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు. 


అందుబాటులో విత్తనాలు

వానాకాలంలో దుక్కులు దున్నగానే రైతులకు అవసరమయ్యే విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉండేలా కార్యాచరణను సిద్ధం చేశారు. 19,500 క్వింటాళ్ల వరి విత్తనాలు, 21,840 క్వింటాళ్ల సోయాబీన్‌, 7,98,000 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. 4,320 క్వింటాళ్ల కందులు, 1,610 క్వింటాళ్ల మొక్కజొన్న, 1,760 క్వింటాళ్ల పెసల్లు, 920 క్వింటాళ్ల మినుములు, 5,964 క్వింటాళ్ల జిలుగ, 8,562 క్వింటాళ్ల జనుము విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు తెలిపారు. 


ఆరుతడి పంటలకు అధిక ప్రాధాన్యం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, మే 20: మెదక్‌ జిల్లాలోనూ వానాకాలం పంటల సాగును వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశా రు. ఈ సారి ఆరుతడి పంటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించారు. ప్రత్యామ్నాయ పంటలపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరి స్థానంలో పత్తి, కంది, మొక్కజొన్న పంటలను వేసేందుకు రైతులను ప్రోత్సాహిస్తున్నారు. మెదక్‌ జిల్లాలో మొత్తం 4లక్షల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. ఈ వానాకాలం సీజన్‌లో 3,31,280 ఎకరాల్లో సాగుకు అంచనాలు తయారు చేశారు. 


తగ్గిన వరి...పెరిగిన పత్తి 

మెదక్‌ జిల్లాలో ఈసారి వరి సాగు విస్తీర్ణాన్ని వ్యవసాయశాఖ అధికారులు తగ్గించారు. గతేడాది 2.56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే ఈ వానాకాలం సీజన్‌లో 1.75 లక్షల ఎకరాలకు పరిమితం చేశారు. గతేడాది పత్తిపంట 52 వేల ఎకరాల్లో సాగుచేశారు. ఈ సారి మొత్తం 92 వేల ఎకరాలలో పత్తి సాగు చేయాలని నిర్ణయించారు. పోయిన వానాకాలంలో 3 వేల ఎకరాలకే పరిమితమైన కంది ఈసారి 21 వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. 


పెరగనున్న మొక్కజొన్న సాగు

మొక్కజొన్న సాగు ఈ సారి పెరగనున్నది. ఏడాది క్రితం జిల్లాలో 7 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. అయితే ప్రస్తుతం 19 వేల ఎకరాలలో సాగు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.1,850 ఉంటే బయటి మార్కెట్‌లో మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.2,300 నుంచి రూ.2,400 వరకు పలుకుతున్నది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటే మార్కెట్‌లో వచ్చే మద్దతు ధరే ఎక్కువ. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న మొక్కజొన్న తక్కువ ధరకు లభిస్తుంది. దీంతో మొక్కజొన్న సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి విజ్ఞప్తి చేసింది. దీంతో రైతాంగం మొక్కజొన్న సాగును బాగా తగ్గించింది. ప్రస్తుతం మార్కెట్‌లో మొక్కజొన్నకు డిమాండ్‌ పెరగడంతో రైతులు మళ్లీ మొక్కజొన్న పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. 

Updated Date - 2022-05-20T05:30:00+05:30 IST