ఏడోవిడత హరితహారానికి సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-06-24T05:18:28+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏడోవిడత హరితహారం కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది

ఏడోవిడత హరితహారానికి సర్వం సిద్ధం
కోహీర్‌ మండలం పీచెరాగడి శివారులోని నర్సరీలో సిద్ధంగా ఉన్న మొక్కలు

 జూలై 1 నుంచి 10వరకు నిర్వహించాలని సీఎం ఆదేశాలు

 సంగారెడ్డిలో 647 నర్సరీల్లో 65.45 లక్షల మొక్కలు రెడీ

 మొక్కల సంరక్షణకు రూ.3.25 కోట్లు

 56.40 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్‌


సంగారెడ్డిటౌన్‌, జూన్‌ 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏడోవిడత హరితహారం కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జూలై 1నుంచి 10వ తేదీ వరకు పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలతో పాటు హరితహారాన్ని ఉధృతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ సభలో సోమవారం ప్రకటించిన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది. పర్యావరణాన్ని పెంపొందించటంతో పాటు పల్లెలు, పట్టణాలన్నీ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో 2015-16లో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆరు విడతలు పూర్తి చేసుకుని, ఏడోవిడత హరితహారాన్ని ప్రారంభించనున్నారు. జూలై 1న ఏడో విడత హరితహారానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు.


56.40 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్‌

ఏడోవిడత హరితహారం కింద సంగారెడ్డి జిల్లాలో 56.40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. ఈ మేరకు జిల్లాలోని 647నర్సరీల్లో 65.45 లక్షల మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలను నాటేందుకు కలెక్టర్‌ హనుమంతరావు ఆయా ప్రభుత్వశాఖలకు టార్గెట్‌ను నిర్దేశించారు. డీఆర్‌డీవో ద్వారా 41 లక్షలు మొక్కలు నాటాలని నిర్ణయించగా, అటవీ శాఖ ద్వారా 50 వేలు, ఎక్సైజ్‌, ఉద్యానవన, టీఎ్‌సఐఐసీల ద్వారా 10 లక్షల చొప్పున, మున్సిపల్‌, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ ఆధ్వర్యంలో 7 లక్షలు, నేషనల్‌ హైవే అధారిటీ ద్వారా 25 వేలు, ఇరిగేషన్‌ వ్యవసాయశాఖల ద్వారా 10 వేలు చొప్పున, ఎండోమెంట్‌ ద్వారా 5వేల మొక్కలు నాటాలని లక్ష్యాలను నిర్ధేశించారు. 


మొక్కల సంరక్షణకు రూ.3.25 కోట్లు

ఏడోవిడత హరితహారం కింద 56.40 లక్షలు మొక్కలు నాటాలని నిర్ణయించిన జిల్లా అధికార యంత్రాంగం మొక్కలు నాటి, వాటిని సంరక్షించేందుకు రూ.3.25 కోట్లు కేటాయించింది. నర్సరీల్లో మొక్కలను పెంచడానికి ఒక్కో మొక్కకు రూ.9చొప్పున, మొక్కలు నాటడానికి ఒక్కో మొక్కకు రూ.4, గుంతలు తీయడానికి ఒక్కో గుంతకు రూ.17 చొప్పున, మొక్కలకు నీరు పోసి, సంరక్షించడానికి ఒక్కో మొక్కకు రూ.5 చొప్పున ఖర్చు చేయనున్నారు. ఈ నిధులను ఉపాధి హామీ ద్వారా వెచ్చించనున్నారు.


ఈ సారి 77 రకాల మొక్కలు సిద్ధం

ఈసారి హరితహారంలో 77 రకాల మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఈ మేరకు 647 నర్సరీల్లో 77 రకాలైన 65.45 లక్షల మొక్కలను పెంచి, నాటడానికి సిద్ధం చేశారు. ఇందులో చింత, దానిమ్మ, జామ, జాడిమామిడి, కానుగ, కరివేపాకు, మందార, ఖర్జూర, చైనాబాదాం, వేప, మెహింది, నిమ్మ, పారిజాత, టేకు, తులసి, ఉసిరి,  నేరేడు, మునగ తదితర 77 రకాల మొక్కలు పెంచారు.


ఆరేళ్లలో సగం కూడా దక్కని మొక్కలు

గత ఆరువిడతలుగా చేపట్టిన హరితహారంలో నాటిన మొక్కల్లో సగం కూడా దక్కకపోవడం శోచనీయం. ఆరేళ్లలో మొత్తం 8.96 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యాలను నిర్దేశించగా 8.03కోట్ల మొక్కలను నాటారు. 2015-16లో కోటిమొక్కలు నాటాలని లక్ష్యం ఉండగా 89 లక్షలు నాటారు. ఇందులో 31.62శాతం మొక్కలు మాత్రమే దక్కాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2016-17లో కోటి మొక్కలు నాటాలని టార్గెట్‌ నిర్ణయింయగా, 93 లక్షలు నాటారు. ఇందులో కేవలం 46.71 శాతం దక్కినట్టు తెలిసింది. 2017-18లో లక్ష్యం మేరకు 1.50 కోట్ల మొక్కలు నాటగా, 41.21 శాతం మొక్కలు బతికినట్టు అధికారులు తెలిపారు. 2018-19లో రెండు కోట్ల మొక్కలు నాటాల్సి ఉండగా 1.39 కోట్లు మొక్కలు నాటారు. ఇందులో 38 శాతం మొక్కలు బతికాయి. 2019-20లో లక్ష్యానికి అనుగుణంగా 2.50 కోట్ల మొక్కలు నాటగా, 89 శాతం మొక్కలు బతికాయి. 2020-21 (ఆరోవిడతలో) 96.48 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్‌ నిర్దేశించగా 82.26 లక్షల మొక్కలు నాటారు. ఇందులో 91.72 శాతం మొక్కలు నాటినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. 



Updated Date - 2021-06-24T05:18:28+05:30 IST