పది పరీక్షలకు అంతా సిద్ధం

ABN , First Publish Date - 2022-05-23T04:01:48+05:30 IST

జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి పది పరీక్షలు ప్రారం భమై జూన్‌ 1 వరకు జరగనున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జోన్‌లు, రూట్‌లు, పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్టుమెంటల్‌ అధికారులు, సిట్టింగ్‌స్క్వాడ్‌, ఫ్లైయింగ్‌స్క్వాడ్‌, ఇన్విజిలేటర్ల నియామక ప్రక్రియ పూర్తి కాగా ఆదివారం ఆయా కేంద్రాల్లోని గదుల్లో బెంచీలపై హాల్‌ టికెట్ల నెంబర్లను వేశారు.

పది పరీక్షలకు అంతా సిద్ధం
పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు

నిఘా నీడన నేటి నుంచి పరీక్షలు 

జిల్లాలో 58 పరీక్ష కేంద్రాలు

హాజరు కానున్న 10,684 మంది విద్యార్థులు 

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు 

కోటపల్లి, మే 22: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి పది పరీక్షలు ప్రారం భమై జూన్‌ 1 వరకు జరగనున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జోన్‌లు, రూట్‌లు, పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్టుమెంటల్‌ అధికారులు, సిట్టింగ్‌స్క్వాడ్‌, ఫ్లైయింగ్‌స్క్వాడ్‌, ఇన్విజిలేటర్ల నియామక ప్రక్రియ పూర్తి కాగా ఆదివారం ఆయా కేంద్రాల్లోని గదుల్లో బెంచీలపై హాల్‌ టికెట్ల నెంబర్లను వేశారు. పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించనుండగా గదుల్లోకి 30 నిమిషాల ముందే విద్యార్థులకు అనుమతి కల్పించారు. పరీక్షలు ప్రారంభమైన ఐదు నిమిషాలు (9.35) తర్వాత ఎవర్ని అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. 

కేంద్రాల ఏర్పాటు 

పదో తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లాలో 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 10,684 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, మరో 30 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో బాలురు 5,537 మంది కాగా, బాలికలు 5,147 మంది ఉన్నారు. ఒక్కో కేంద్రానికి ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఒక డిపార్టుమెంటల్‌ అధికారి, సిట్టింగ్‌ స్క్వాడ్‌తోపాటు 620 మంది ఇన్విజిలేటర్లు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 3 పరీక్షల నిర్వహణ చేపడతారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వెలుతురు, వైద్యం తదితర సౌకర్యాలు,   పూర్తి చేశారు. అలాగే జిల్లాలో 4సీ కేటగిరి కేంద్రాలు కుష్నపల్లి, పారుపెల్లి, మల్కేపల్లి, ఇందారంలలో ఉండగా ఈ కేంద్రాలకు ప్రత్యేక వాహనం ద్వారా బందోబస్తు మధ్య పరీక్ష పత్రాలను తీసుకువెళ్తారు. 

 నిఘా నీడన

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంటల్‌ అధికారుల సమక్షంలో ప్రశ్నపత్రాలు తెరవడానికి ఏర్పాట్లు చేశారు. ఆంద్రప్రదేశ్‌లో పేపరు లీకేజీ వ్యవహారం బయటపడడంతో అలాంటి ఘటనలు జరగ కుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. అలాగే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 08736-252420ను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ భారతి హోళికేరీ, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, డీసీపీ అఖిల్‌ మహాజన్‌ అధ్యక్షతన ఇప్పటికే అధికారులకు పరీక్షల నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేసి జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. 

ఉచిత బస్సు సౌకర్యం 

పదో తరగతి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు టీఎస్‌ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ప్రస్తుత బస్‌ పాస్‌ కాలపరిమితిని జూన్‌ 1 వరకు పెంచుతూ అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. బస్‌పాస్‌తోపాటు హాల్‌ టికెట్‌ చూపించి పరీక్ష కేంద్రానికి, తిరుగు ప్రయా ణం ఉచితంగా పొందాలని ఆర్టీసీ చేదోడు పేరుతో ప్రచార పత్రం విడుదల చేశారు. 

పకడ్బందీగా పరీక్షల నిర్వహణ

- వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి 

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాం. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. కేంద్రాల్లోని అధికారులు, సిబ్బంది బాధ్యతతో పరీక్షలు నిర్వహించాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా బాధ్యులపై చర్యలు తప్పవు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ఉపాధ్యాయులను సంప్రదించాలి. ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి విజయం సాధించాలి. 

Updated Date - 2022-05-23T04:01:48+05:30 IST