సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-05-23T06:10:03+05:30 IST

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం
పరీక్ష రాస్తున్న విద్యార్థులు(ఫైల్‌)


  • నేటి నుంచి పదో తరగతి పరీక్షలు 
  • పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు

వికారాబాద్‌/మేడ్చల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఈ పరీక్షలకు మొత్తం 14,441 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 7,272 మంది బాలురు, 7,169 మంది బాలికలున్నారు. పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలో 70 కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటిలో సీ- కేటగిరి కేంద్రాలు మూడు ఉన్నాయి. పరీక్షల నిర్వహణకు 70 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 70 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 19 మంది కస్టోడియన్లు, 1050 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షల్లో కాపీయింగ్‌ జరగకుండా 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా జంబ్లింగ్‌ విధానంలోనే నిర్వహించనున్నారు. ఈసారి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా 50 శాతం ఛాయిస్‌ ప్రశ్నలు, ఇంతకు ముందు కంటే అదనంగా 15 నిమిషాల సమయం కేటాయించడం విశేషం. పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 

సీసీ కెమెరాల నీడలో..

ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఉన్న చోటనే ప్రశ్నపత్రాల కవర్లను తెరవాల్సి ఉంటుంది. పోలీసు స్టేషన్లకు దూరంగా ఉన్న సి సెంటర్ల నుంచి ప్రశ్న పత్రాలను తరలించేందుకు పోలీసు భద్రతతో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు, సిబ్బంది ఎవరు కూడా సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాలను తీసుకు రాకుండా నిషేధం విధించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో తాగునీటి సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు ఎవరైనా అస్వస్థతకు గురైన ప్రథమ చికిత్స అందించేందుకుఅవసరమైన మందులతో ఏఎన్‌ఎంలను నియమించారు. 

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పరీక్ష కొనసాగేంత వరకు  కేంద్రాల     సమీపంలో ఉన్న జిరాక్స్‌, కంప్యూటర్‌ సెంటర్లను మూసివేయించనున్నారు. నివాస ప్రాంతాల మధ్యలో ఉన్న పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. పరీక్ష విధుల్లో ఉండే సిబ్బంది తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డు ధరించే విధంగా ఆదేశాలుజారీ చేశారు. 

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు అవసరమైన బస్సులను నడిపించే విధంగా టీఎ్‌సఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. విద్యార్థులు తమ వద్ద ఉన్నపాత బస్‌పాస్‌ లేదా పదో తరగతి హాల్‌ టికెట్‌ చూపిస్తే బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రానికి చేరుకునే సదుపాయం కల్పించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ అధికారులు రూట్‌ మ్యాపింగ్‌ సిద్ధం చేసుకున్నారు. 

పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలి. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో రవాణా సదుపాయం క ల్పించాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా రాసే విధంగా ఏర్పాట్లు చేశాం. 

గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలి

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగా కేంద్రాలకు చేరాలని అధికారులు సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద డీఈవో, ఎంఈవోల సెల్‌ఫోన్‌ నెంబర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. పాఠశాలలకు ఇది వరకే హాల్‌ టికెట్లు పంపించారు. హాల్‌ టికెట్లు రాని విద్యార్థులు బోర్డు వెబ్‌సైట్‌ నుంచి నేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షకు హాజరు కావచ్చు. ఈ మేరకు సీఎస్‌, డీవోలకు ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలకు, కేంద్రాలకు సంబంధించిన విద్యార్థులు, తల్లిదండ్రులకు ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే జిల్లా విద్యాఽశాఖాధికారి 9059085582, పరీక్షల విభాగం అధికారి 9963931075, కంట్రోల్‌రూం 08416-254964లో సంప్రదించాల్సి ఉంటుంది. 

ఆ రెండు పరీక్ష కేంద్రాలపై తికమక పడొద్దు

కొందరు విద్యార్థుల హాల్‌ టికెట్లలో టీఎ్‌సఎ్‌సడబ్ల్యుఈఆర్‌ఎస్‌ -  అనంతగిరిపల్లికి బదులుగా శివారెడ్డిపేట అని ముద్రించారని, టీఎ్‌సఎ్‌సడబ్ల్యుఈఆర్‌ఎస్‌ శివారెడ్డిపేట కేంద్రంగా జారీ అయిన హాల్‌ టికెట్ల విద్యార్థులందరూ టీఎ్‌సఎ్‌సడబ్ల్యుఈఆర్‌ఎస్‌ అనంతగిరిపల్లి కేంద్రానికి హాజరు కావాల్సి ఉంటుందని డీఈవో రే ణుకాదేవి తెలిపారు. టీఎ్‌సఎ్‌సడబ్ల్యుఈఆర్‌ఎస్‌ బాలికలు- వికారాబాద్‌ కేంద్రంగా హాల్‌టికెట్లలో నమోదైన విద్యార్థులు ఆకేంద్రాన్ని టీఎ్‌సఎ్‌సడబ్ల్యుఈఆర్‌ఎస్‌ - కొత్తగడిగా భావించాలని ఆమె సూచించారు. ఈ రెండు కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులు తికమకకు గురికాకుండా చూసుకోవాలని ఆమె తెలిపారు. 

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో...

మేడ్చల్‌, మే22 ( ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌ జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వాహణకు 251 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 43,208 మంది  రెగ్యులర్‌, 49 మంది విద్యార్థులు ప్రైవేట్‌గా పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలు మే 23 నుంచి జూన్‌ 1 వరకు జరుగనున్నాయి. విద్యార్థులు అల్పాహారం తీసుకొని రావాలని, తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడిని పెంచ వద్దని, ప్రశ్నాపత్రంపై హల్‌టికెట్‌ నెంబరు వేయాలని విద్యార్థులకు జిల్లా  విద్యాధికారి విజయకుమారి సూచించారు.

Updated Date - 2022-05-23T06:10:03+05:30 IST