పోరుకు సిద్ధం!

ABN , First Publish Date - 2021-01-22T08:32:02+05:30 IST

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైందని.. ఈ నెల 8న ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు.

పోరుకు సిద్ధం!

  • షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు
  • 5, 9, 13, 17 తేదీల్లో పోలింగ్‌
  • ఎన్నికల కోడ్‌ తక్షణమే అమల్లోకి
  • రేపు నోటిఫికేషన్‌ జారీకి ఏర్పాట్లు
  • ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది
  • సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు,ఎస్పీలతో త్వరలోనే సమావేశం
  • ఓటర్లను ప్రభావితం చేసేలా పథకాల పంపిణీకి వీల్లేదు
  • కమిషనర్‌ నిమ్మగడ్డ స్పష్టీకరణ
  • తీర్పు వెలువడగానే స్పందన
  • ద్వారకాతిరుమల నుంచి హుటాహుటిన కార్యాలయానికి
  • నేడు గవర్నర్‌తో సమావేశం


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైందని.. ఈ నెల 8న ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. త్వరలో సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని చెప్పారు. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో నాలుగు విడతల్లో పోలింగ్‌ జరుగుతుందన్నారు. కోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లేనని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రభుత్వ పథకాలను పంపిణీ చేసేందుకు వీల్లేదన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) త్వరలోనే సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమై ఎన్నికలకు సమాయత్తం చేస్తుందన్నారు. పోలింగ్‌ సిబ్బంది, ఓటర్లు కొవిడ్‌ బారిన పడకుండా తగు రక్షణ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వానికి సూచించామన్నారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా శాంతి భద్రతలపై దృష్టి సారించాలని అధికారులకు సూచనలు చేశామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, పౌరులు ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించేందుకు అన్ని వర్గాల వారూ సహకరించాలని కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో స్థానిక సంస్థల ప్రతినిధులు ఎంపికైతే కరోనా లాంటి సంక్షోభాలను ఎదుర్కొవడంలో కీలక భూమిక పోషిస్తారని తెలిపారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గతంలో నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకార శనివారం (23న) రాష్ట్ర ఎన్నికల సంఘం తొలి నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.


ఎన్నికల ఏర్పాట్లలో కమిషనర్‌ నిమగ్నం..

పంచాయతీ ఎన్నికలకు పచ్చజెండా ఊపుతూ.. గురువారం హైకోర్టు తీర్పు వెలువడగానే ద్వారకాతిరుమలలో ఉన్న నిమ్మగడ్డ హుటాహుటిన విజయవాడలో ఉన్న ఎస్‌ఈసీ కార్యాలయానికి వచ్చేశారు. ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపులు తట్టినప్పటికీ.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మాత్రం వెంటనే ప్రారంభమైంది. తొలి దశ ఎన్నికలకు ఈ నెల 23న ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ఇస్తుంది. 25న వాటికి జిల్లాల రిటర్నింగ్‌ అధికారులైన కలెక్టర్లు ఎన్నికల నోటీసు ఇస్తారు. రెండో దశకు 27న ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌, 29న  కలెక్టర్ల ఆర్‌వోల నోటీసులు; మూడో దశకు 31న నోటిఫికేషన్‌, ఫిబ్రవరి 2న నోటీసులు, చివరి దశకు ఫిబ్రవరి 4న నోటిఫికేషన్‌, 6న ఎన్నికల నోటీసులు జారీ అవుతాయి. ఎన్నికల నోటీసులు జారీ అయిన రోజునే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. కాగా.. ఎన్నికలకు సహకరించరాదని ప్రభుత్వ పెద్దల నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్తే మాత్రం మరోసారి ఈ ప్రక్రియకు విఘాతం ఏర్పడుతుందని.. అదే జరిగితే రాష్ట్రప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభ చర్యలకు పూనుకుంటున్నట్లు భావించాల్సి వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.


గవర్నర్‌ను కలవనున్న కమిషనర్‌..

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఽగవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో కమిషనర్‌ నిమ్మగడ్డ శుక్రవారం ఉదయం భేటీ కానున్నారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టేను డివిజన్‌ బెంచ్‌ తొలగించడం, పంచాయతీ ఎన్నికలు జరపాల్సిన ఆవశ్యకత తదితరాలపై ఆయనకు వివరించనున్నారు. కరోనా వ్యాక్సినేషన్‌కు  ఆటంకం లేకుండా..ప్రజలకు రక్షణ కల్పిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలియజేయనున్నారు.

Updated Date - 2021-01-22T08:32:02+05:30 IST