థర్డ్‌ వేవ్‌కు సిద్ధం

Jun 16 2021 @ 23:37PM

 చిన్నారుల కోసం 38 పడకలు

 11 పడకలతో ప్రత్యేక ఐసీయూ 

 27 పడకలకు ఆక్సీజన్‌ ఏర్పాటు

 పిల్లల వైద్యానికి తొమ్మిది మంది డాక్టర్ల బృందం

 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి క్రమేపీ తగ్గుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పడిపోతున్నది. ముందు జాగ్రత్తగా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. అక్టోబర్‌ నాటికి రాష్ట్రంలో కరోనా మూడో దశ వస్తుందని అంచనా వేసి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం థర్డ్‌ వేవ్‌ను ఎదు ర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నది. థర్డ్‌ వేవ్‌ చిన్నారులపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పిల్లల చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.


జిల్లా ఆసుపత్రిలో పిల్లల కోసం ప్రత్యేక కొవిడ్‌ వార్డు


 రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల చికిత్స కోసం ఆరువేల పడకలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో  జిల్లాలో 38 పడకలతో ప్రత్యేక కొవిడ్‌ వార్డు సిద్ధమైంది. పిల్లలకు కరోనా సోకినా సీరియస్‌ అయ్యే అవకాశాలు తక్కువే అని నిపుణులు చెబుతున్నా వారి ద్వారా ఇతరులకు వైరస్‌ వ్యాప్తించే అవకాశం పెద్దలతో సమానంగా ఉంటుందని చెబుతున్నారు. ఐదు రోజులపాటు వ్యాధి సోకిన పిల్లల నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాపించవచ్చని, పిల్లల్లో కరోనా వ్యాపిస్తే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయని హార్వర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన కొవిడ్‌ వార్డులో 11 వెంటిలేటర్లను కొత్తగా సమకూర్చారు. దీంతో 11 పడకలతో ఐసీయూ ఏర్పడింది. మిగతా 27 పడకలకు ఆక్సీజన్‌ పైపులైన్‌ సౌకర్యం కల్పించి ఫ్లో మీటర్లను బిగించారు. కొంత కాలం క్రితం వరకు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన పిల్లల వైద్యుడు అజయ్‌కుమార్‌ ను ఈ విభాగానికి నోడల్‌ అధికారిగా నియమించా రు. మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు, జిల్లా ఆసుపత్రిలో ముగ్గురు పిల్లల వైద్యులు ఉన్నారు. నోడల్‌ అధికారితోపాటు మొత్తం తొమ్మిది పిల్లల వైద్యుల బృందం మూడో వేవ్‌లో చిన్నారులకు చికిత్స అందించడానికి సర్వసిద్ధంగా ఉన్నారు. 

ఇప్పటికే జిల్లా ఆసుపత్రిలో పెద్దలకు వినియోగిస్తున్న వెంటిలేటర్లను, పైపులు మార్చడం ద్వారా పిల్లలకు ఉపయోగించుకోవచ్చని వెంటిలేటర్ల సమస్య ఉత్పన్నం కాదని చెబుతున్నారు.  అవసరమైన మందులన్నిటిని సిద్ధం చేస్తున్నారు. కరోనా సెకం డ్‌ వేవ్‌ ఏప్రిల్‌, మే మాసాల్లో తన ఉధృతిని చూపించింది. అనధికారిక లెక్కల ప్రకారం సగటున రోజుకు 600 కేసులు నమోదు కాగా లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి క్రమేపీ అవి తగ్గుతూ వస్తున్నాయి. జూన్‌ మొదటివారంలోనూ 400 వరకు కేసులు రాగా ప్రస్తుతం ఆ సంఖ్య 125 నుంచి 150కి పడిపోయింది. మరికొద్ది రోజుల్లో రెండో వేవ్‌ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని భావిస్తున్నారు.


జాగ్రత్తలు పాటిస్తేనే రక్ష


అందరూ మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనక పోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా వ్యాప్తిని అదుపు చేయవచ్చని నిపు ణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఈనెల 21 నుంచి 18 సంవత్సరాలపై వారందరికీ ఉచితంగానే వ్యాక్సిన్‌ ఇవ్వనున్నందున అర్హులైన అందరూ తమకున్న అపోహలను విడనాడి వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఎంత వేగవంతమైతే అంత సమర్థవంతంగా మూడో వేవ్‌ను అడ్డుకోగలమని వైద్య ఆరోగ్యశాఖ చెబుతున్నది. ప్రజలందరూ వ్యాక్సిన్‌ తీసుకోవడంతోపాటు కరోనా నియంత్రణకు సూచిస్తున్న నిబంధనలు అన్నీ పాటిస్తే చిన్నారులను కరోనా బారిన పడకుండా కాపాడే అవకాశమున్నది. 

Follow Us on: