చేప పిల్లలు సిద్ధం!

ABN , First Publish Date - 2022-07-07T05:14:52+05:30 IST

చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదిలేందుకు

చేప పిల్లలు సిద్ధం!

  • చెరువుల్లోకి వదిలేందుకు ఏర్పాట్లు
  • 1.61 కోట్లు చేప విత్తనాలు రెడీ
  • కార్యాచరణ రూపొందించిన జిల్లా మత్స్యశాఖ
  • సరఫరా కోసం టెండర్‌ ప్రక్రియ పూర్తి 
  • బొచ్చ, రవ్వ, బంగారు తీగ, మోసు రకాల ఎంపిక


చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ సిద్ధమవుతోంది. చేప పిల్లల కొనుగోలుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఆగస్టు మొదటి వారంలో చేప విత్తనాలను వదిలేందుకు సన్నాహాలు చేస్తు న్నారు. గతేడాదిలాగే ఈసారీ 1.61 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా మత్స్యకారులకు చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిఅర్బన్‌, జూలై 6 : చెరువులు, కుం టల్లోకి నీరు చేరగానే చేప విత్తనాలు వేసేందుకు జిల్లా మత్స్య శాఖ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణా ళిక రూపొందించింది. జిల్లాలో 108 ప్రాథమిక మత్స్య పారి శ్రామిక సహకార సంఘాలున్నాయి. వీటిలో 94మత్స్య పారి శ్రామిక సంఘాలున్నాయి. అదేవిధంగా 14 మహిళా మత్స్య పారి శ్రామిక సంఘాలున్నాయి. మొత్తం 6,616మంది సభ్యులున్నారు. 2021-22లో 819 నీటి వనరులలో వంద శాతం గ్రాట్స్‌పై 172 లక్షల చేప పిల్లలను వదిలేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 794చెరువుల్లో 1.61 కోట్ల చేప పిల్లలను వదలడం జరిగింది. 4వేల టన్నుల దిగుబడి వచ్చింది. అలాగే ఈసారి కూడా 1.61కోట్ల చేపలను వందశాతం సబ్సిడీపై చెరువుల్లో వదిలేందుకు లక్ష్యాన్ని ఆ శాఖ నిర్దేశించుకుంది. చేప పిల్లల కోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఆగస్టు మొదటి వారంలో చేప విత్తనాలను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


కైకలూరు నుంచి విత్తనాలు

టెండర్ల ప్రక్రియ పూర్తికాగా ఏపీలోని కృష్ణా జిల్లా కౌకలూరుకు చెం దిన ఏడుగురు కాంట్రాక్టర్లు ఈ టెండర్లను దక్కించుకున్నారు. సరఫరా చేసే చేపల విలువ రూ.కోటి 25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విడతల వారీగా విత్తనాలను సరఫరా చేయనున్నట్లు చెప్పారు.


నాలుగు రకాల విత్తనాలు

ఎప్పటిలాగే ఈ సారి కూడా నాలుగు రకాల విత్తనాలను వేయనున్నారు. బొచ్చ, రవ్వ, బంగారు తీగ, మోసు రకాలను ఎంచుకున్నారు. నీటి వనరులను సీజనల్‌ చెరువులు, ఎల్లపుడూ నీటి లభ్యతగల చెరువులుగా విభజిస్తారు. సీజనల్‌ చెరువుల్లో కనీసం ఆరు నెలలపాటు నీరు అందుబాటులో ఉండాలి. ఇటువంటి చెరువుల్లో 35ఎంఎం సైజుగల బొచ్చ, రవ్వ, బంగారు తీగ విత్తనాలను వదులుతారు. అలాగే 9నెలలపాటు నీటి లభ్యత ఉండే చెరువుల్లో 80 నుంచి 10 మిల్లీలీటర్ల సైజులో ఉన్న బొచ్చ, రవ్వ, బంగారు తీగ విత్తనాలను వదులుతారు. వేసిన ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఇవి ఎదుగుతాయి. 


చెరువును బట్టి సైజు.. 

చెరువు రకం, చేప విత్త నాలను బట్టి చెరువుల్లో వదిలే విత్తనాల పరిమాణంలో స్వల్ప తేడాలు ఉంటాయి. చెరువు విస్తీర్ణంలో 50 శాతం విస్తీర్ణాన్నే పరిగణలోకి తీసుకుంటారు. సీజనల్‌ వారీగా నీరు లభ్యత ఉండే చెరువుల్లో ఎకరానికి తక్కువ సైజు ఉన్న 3 వేల చేప విత్తనాలు వదులుతారు. ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండే చెరువుల్లో 80 నుంచి 100 ఎంఎం సైజు గల విత్తనాలు ఎకరానికి 2 వేలు వేస్తారు. 


టెండర్ల ప్రక్రియ పూర్తయింది

టెండర్ల ప్రక్రియ కంప్లీట్‌ అయింది. ఏడుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లా కైకలూరు నుంచి చేప విత్తనాలు వస్తున్నాయి. ఈ సారి కూడా 1.61 కోట్ల చేపలను వంద శాతం సబ్సిడీపై చెరువుల్లో వదిలేందుకు లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. ఆగస్టులో చేప విత్తనాలను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నాము. 

- సుకీర్తి, జిల్లా మత్స్యశాఖ అధికారి


ఏటా ఉపాధి పొందుతున్నాం

ప్రభుత్వం ఉచితంగా ఏటా చేప పిల్లలను అందజేస్తుంది. దీంతో మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. షాబాద్‌ మండలంలో పహిల్వాన్‌ చెరువు ఉంది. ఈ చెరువులో ఏటా 3 లక్షల నుంచి 4 లక్షలు చేపలు వదలుతున్నారు. సుమారు 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.

- గంధం శ్రీనివాస్‌, ముదిరాజ్‌ సంఘం షాబాద్‌ గ్రామ కార్యదర్శి


విపత్కర పరిస్థితుల్లో జీవనోపాధి

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. ఫలితంగా మంచి ఉపాధి పొందుతున్నారు. మండలంలో సమృద్ధిగా కురవడంతో పహిల్వాన్‌ చెరువు నిండింది. చేపల విత్తనాలు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విపత్కర పరిస్థితుల్లోనూ మత్స్యకారులు తగిన జీవనోపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.

- మాచమోని వెంకటయ్య, షాబాద్‌ గ్రామ ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు


నీటి వనరులు..

మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు : 120

గ్రామ పంచాయతీ చెరువులు : 417

విస్తీర్ణం : 6,422 హెక్టార్లు 


Updated Date - 2022-07-07T05:14:52+05:30 IST