వానాకాలం ప్రణాళిక సిద్ధం

Published: Tue, 17 May 2022 00:49:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వానాకాలం ప్రణాళిక సిద్ధంపత్తి పంటలో దౌర కొడుతున్న రైతులు(ఫైల్‌)

జిల్లాలో పంటల సాగుకు వ్యవసాయ అధికారుల ప్రణాళికలు

మొత్తం 5.71 లక్షల ఎకరాల్లో సాగవనున్న వివిధ రకాల పంటలు

ఈ యేడు గణనీయంగా పెరుగనున్న పత్తి పంట సాగు

ప్రతీ సంవత్సరం అన్నదాతలను వెంటాడుతున్న కల్తీ విత్తనాలు, ఎరువుల కొరత

ఊపందుకుంటున్న వానాకాలం పంటల సాగు పనులు

జిల్లావ్యాప్తంగా పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు

ఆదిలాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): ఈ యేడు వానాకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. దీననుగుణంగానే 2022-23 సంవత్సర పంటల సాగును చేపట్టనున్నారు. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5లక్షల 71వేల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో నల్లరేగడి నేలలకు అనువైన పంటలైనా పత్తి, సోయా, కంది, జొన్న, మొక్కజొన్న పంటలకు ఎక్కువగా అనుకూలమని అధికారులు చెబుతున్నారు. గతేడు సమృద్ధిగా వర్షాలు కురవడంతో దిగుబడులు ఆశాజనకంగానే కనిపించాయి. ఈసారి కూడా సకాలంలోనే రుతుపవనాల రాక ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొనడంతో రైతులు వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రణాళిక ఆధారంగానే జిల్లాకు అవసరమైన ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేయనుంది. 94వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. 11లక్షల 85వేల పత్తి ప్యాకెట్లు, 30వేల క్వింటాళ్ల సోయాబీన్‌ విత్తనాలు, ఐదు వేల క్వింటాళ్ల కంది విత్తనాలు, 500 క్వింటాళ్ల జొన్న విత్తనాలు అవసరమని గుర్తించారు. అయితే కల్తీ విత్తనాల కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వానాకాలం పంటల సాగుకు మరో పక్షం రోజులు మాత్రమే సమయం ఉండడంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో తొలకరి వర్షాలకే పత్తి, సోయా పంటలను వేసేందుకు రైతులు వేసవి దుక్కులతో సిద్ధం చేస్తున్నారు. పంట చేలల్లో వ్యవసాయ దుక్కులు చేయడం, ఎరువులు, చెరువు మట్టిని తరలించడంలాంటి పనులను చేపడుతున్నారు. ఇప్పటికే పత్తి, సోయా కంపెనీల ప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు విత్తనాలను అంటగడుతున్నారు. అలాగే, కొన్ని కంపెనీలైతే ఓ అడుగు ముందుకేసి ఆఫర్ల పేరిట రైతులను మభ్యపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. 

పత్తి వైపే రైతుల పరుగులు

గతేడు మద్దతుధరను మించి ధర పలకడంతో ఈసారి రైతులు పత్తి వైపే పరుగులు తీస్తున్నారు. దీంతో ఈ యేడు పత్తి సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వ హించి లాభదాయకమైన పత్తి పంటనే సాగును చేయాలని సూచిస్తున్నారు.  దీంతో 3లక్షల 95వేల 200 ఎకరాలలో పత్తి పంట సాగయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే సోయాబీన్‌ పంట 88వేల920 ఎకరాలు, కంది 61వేల 750, జొన్న 4,446, వరి రెండు వేలు ఎకరాలలో సాగుకాగా, మిగి లిన ఎకరాలలో ఇతర పంటలను సాగు  చేయనున్నారు. మొత్తం 5లక్షల 71 వేల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉంది. దీనికి అను గుణంగా సోయాబీన్‌, పత్తి ప్యాకెట్లను అందుబాటులో ఉంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో నాన్‌ సబ్సిడీ విత్తనాలు అందు బాటులో ఉండడంతో రైతులు కొనుగోలు చేస్తూ నిల్వ చేసుకుంటున్నారు. రైతు ల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యాపారులు కల్తీ విత్తనాలను అంటగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు అడ్డుకట్ట వేయకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. గతేడు సుమారుగా 80వేల ఎకరాలలో కల్తీ విత్తనాలను సాగు చేసిన రైతులు.. పంట దిగుబడులు రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.

సీజన్‌లో ఎరువులకు డిమాండ్‌

ఈ యేడు వానాకాల సీజన్‌లో 94వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 44వేల 969 మెట్రిక్‌ టన్నుల ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. యూరియా 34వేల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 13వేలు, కాంప్లెక్స్‌ ఎరువులు 36 వేలు, ఎంవోపీ 7వేలు, ఎస్‌ ఎస్‌పీ 4వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేస్తున్నారు. అయితే తొలకరి వర్షాలకే పత్తి, సోయా పంటలను విత్తుతే ఎరువుల కొరత తలె త్తే అవకాశం కనిపిస్తుంది. ముందుచూపుతో అధికారులు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచితే రైతులకు ఇబ్బందులు దూరమవుతాయని పేర్కొంటున్నారు. రుతుపవనాల రాకకు ముందే సరిపడా ఎరువులు, విత్తనాలను అందు బాటులో ఉంచాల్సి ఉంటుంది. లేకపోతే రైతులందరూ ఒకేసారి విత్తనాలు, ఎరు వులను కొనుగోలు చేసేందుకు ఎగబడితే గందరగోళ పరిస్థితులకు దారి తీస్తుం ది. అందరు ఒకేసారి కాకుండా సీజన్‌ ప్రారంభానికి ముందే ఎరువులు, విత్త నాలు కొనుగోలు చేయాలని అధికారులు ముందే అవగాహన కల్పించాలి. ఈనెల చివరి వరకు అవసరమైన ఎరువులు, విత్తనాలను కొను గోలు చేస్తే మార్కెట్‌లో కొంత రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. నెలవారీగా ముందుగానే ఎరువుల ప్రణాళికను సిద్ధం చేసిన అధికారులు దానికి అనుగుణంగానే సరఫరా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, ఎరువుల కొరత ఏర్పడితే కొంత ఇబ్బందికర పరిస్థితులు తప్పవంటున్నారు.

విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి

: శివకుమార్‌, వ్యవసాయ శాఖ అధికారి, ఆదిలాబాద్‌

వానాకాలం పంటల సాగుకు విత్తన ఎంపికనే ప్రధానం. రైతులు విత్తనాల ను కొనుగోలు చేసే సమయంలో తగు జాగ్రత్తలను పాటించాలి. నేలలకు అనుగుణంగా పంటలను సాగు చేస్తే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. మిశ్రమ పంటలను సాగు చేస్తే ఒక పంటలో నష్టం వచ్చినా.. మరో పంట ఆదుకునే అవకాశం ఉంది. ఈసారి ఎక్కువగా పత్తి పంటను పం డించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అధికారుల సూచనలు, సలహాలు పాటించి పంటలను సాగు చేయాలి. పత్తిలో గులాబీ రంగు పురుగును ముందుగానే గుర్తిస్తే నష్ట నివారణ తగ్గించే అవకాశం ఉంటుంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.