ఉంటాయో..ఊడుతాయో!

ABN , First Publish Date - 2022-06-09T05:32:36+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీ గత రెండు నెలలుగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం షార్టెక్స్‌ బియ్యం సాకుగా చూపి సరఫరాను నిలిపివేసింది. కానీ సగానికిపైగా రేషన్‌కార్డులకు అర్హత లేదు. దీంతో సగం కార్డులకు సంబంధించి బియ్యానికే కేంద్ర ప్రభుత్వం నగదు అందిస్తోంది. మిగతా బియ్యం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతోంది. అందుకే బియ్యం పంపిణీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.

ఉంటాయో..ఊడుతాయో!

అనర్హత రేషన్‌ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం

మార్గదర్శకాలను జారీచేసిన కేంద్ర ప్రభుత్వం

అనర్హులు సరెండర్‌ చేయాలని ఆదేశం

ఆందోళనలో లబ్ధిదారులు

(సాలూరు)

కొవిడ్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీ గత రెండు నెలలుగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం షార్టెక్స్‌ బియ్యం సాకుగా చూపి సరఫరాను నిలిపివేసింది. కానీ సగానికిపైగా రేషన్‌కార్డులకు అర్హత లేదు. దీంతో సగం కార్డులకు సంబంధించి బియ్యానికే కేంద్ర ప్రభుత్వం నగదు అందిస్తోంది. మిగతా బియ్యం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతోంది. అందుకే బియ్యం పంపిణీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అర్హత లేని కార్డులను సరెండ్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇందుకుగాను కొన్ని ప్రమాణికాలను, మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలోపు వార్షిక ఆదాయం ఉన్నవారే అర్హులుగా తేల్చింది. 3.5 ఎకరాల్లోపు మాగాణి, 7.5 ఎకరాల్లోపు బీడు భూములు ఉన్నవారికి మాత్రమే రేషన్‌ కార్డులు పంపిణీ చేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15 వేల కంటే నెలకు ఆదాయం ఉంటే వారు అనర్హులు, వంద చదరపు మీటర్ల ఇల్లు, ప్లాట్‌ ఉన్న వారు, కారు, ట్రాక్టరు వంటి కలిగిన ఉన్నవారు అనర్హులుగా తేల్చింది. ఈ మార్గదర్శకాలు మేరకు అనర్హత కలిగిన వారు స్థానిక తహసీల్దారు కార్యాలయంలో కార్డులను సరెండర్‌ చేయాలి. ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌, ఇన్‌కం ట్యాక్స్‌, సేల్‌ ట్యాక్స్‌ చెల్లించని వారు మాత్రమే రేషన్‌కార్డు పొందటానికి అర్హులని తాజా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. డాక్టర్లు,లాయర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు రేషన్‌కార్డులు పొందడానికి అనర్హులు. గతంలో రేషన్‌కార్డు తీసుకున్నవారు ఎవరైనా ఆర్థికంగా స్థిరపడితే సరేండర్‌ చేయాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలొచ్చాయి. రేషన్‌కార్డుదారులు ఎంతమంది? ఇందులో అర్హులు ఎంతమంది? అనర్హులు ఎంత? అన్నదానిపై సర్వే ప్రారంభించాలని కూడా ఆదేశించారు. దీంతో రేషన్‌కార్డు లబ్ధిదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. 

 జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో 2,75,517 రేషన్‌కార్డులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎనిమిది ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. వీటి నుంచి 5,738 మంది రేషన్‌ డీలర్లకు సరుకు పరఫరా అవుతోంది. 196 ఎండీయు వాహానాలు ద్వారా రేషన్‌ సరఫరా చేస్తున్నారు.  జాతీయ ఆహార భద్రతా చట్టం-2013ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌కార్డులను జారీచేశాయి. కానీ చాలా రాష్ట్రాల్లో రేషన్‌కార్డులు దుర్వినియోగమవుతున్నాయని.. అనర్హులు పొందారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై భారం పడుతుండడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతమని కేంద్రం భావిస్తోంది. అందుకే పారదర్శకంగా సర్వే చేసి రేషన్‌కార్డుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమేరకు సహకరిస్తుందో చూడాలి మరీ.  

 పక్కదారి

రేషన్‌ బియ్యం ఎక్కువగా పక్కదారి పడుతోంది. పేదల కడుపునింపుతుందో లేదో కానీ మిల్లర్ల లెవీ లక్ష్యానికి రేషన్‌ బియ్యం ఉపయోగపడుతోంది. రేషన్‌ బియ్యం కొనుగోలు, సేకరణలో పెద్ద మాఫియానే నడుస్తోంది. కొందరు రైస్‌ మిల్లర్లు గ్రామాల్లో చిల్లర వ్యాపారులను ఏజెంట్లుగా పెట్టుకుంటున్నారు. వారు రేషన్‌ అందిన వెంటనే లబ్ధిదారుల నుంచి కిలో రూ.10 నుంచి రూ.15 వరకూ కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని మిల్లులకు చేర్చుతున్నారు. కిలో దగ్గర రూ.5 వరకూ మిల్లర్లు చిల్లర వ్యాపారులకు కమీషన్‌గా అందిస్తున్నారు. ఈ బియ్యాన్ని రీ పాలిష్‌ చేసి కొత్త సంచుల్లో ఎక్కిస్తున్నారు. వీటినే లెవీ లక్ష్యం మేరకు అందిస్తున్నారు. కొందరు మిల్లర్లు రేషన్‌ బియ్యాన్ని నూకలుగా మార్చి బయట మార్కెట్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. 


ఆదేశాలు రావాల్సి ఉంది

కేంద్ర ప్రభుత్వం రేషన్‌కార్డుల విషయంలో నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించిన విషయం వాస్తవమే. అనర్హత రేషన్‌ కార్డులకు సంబంధించి మౌఖికమైన ఆదేశాలు రావాల్సి ఉంది.  వచ్చిన తరువాతే కార్యాచరణ ప్రారంభిస్తాం. 

కె.మధుసూదన్‌రావు ,డీఎస్‌వో, పార్వతీపురం మన్యం జిల్లా 



Updated Date - 2022-06-09T05:32:36+05:30 IST