మాస్టర్‌ప్లాన్‌ అమలుకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2022-05-12T04:09:59+05:30 IST

కాగజ్‌నగర్‌ బల్దియా రూపురేఖలు మారబోతున్నాయి..! మాస్టర్‌ప్లాన్‌ అమలు చేసేందుకు అధికార యంత్రాంగం ఎట్టకేలకు పావులు కదుపుతోంది.

మాస్టర్‌ప్లాన్‌ అమలుకు రంగం సిద్ధం
కాగజ్‌నగర్‌ పట్టణం

-మారనున్న కాగజ్‌నగర్‌ రూపురేఖలు

-పట్టాలెక్కుతున్న కాగజ్‌నగర్‌ మాస్టర్‌ ప్లాన్‌

-వ్యాపార సముదాయాలకు ప్రత్యేక జోన్‌

-ప్రధాన కూడళ్లకు హైటెక్‌ రూపు 

-త్వరలోనే అఖిల పక్షభేటి

-పాలకవర్గం ఆమోదించడమే తరువాయి

కాగజ్‌నగర్‌, మే 11: కాగజ్‌నగర్‌ బల్దియా రూపురేఖలు మారబోతున్నాయి..! మాస్టర్‌ప్లాన్‌ అమలు చేసేందుకు అధికార యంత్రాంగం ఎట్టకేలకు పావులు కదుపుతోంది. కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీ ఏర్పడి ఇప్పటికీ అరవై సంవత్సరాలు గడిచింది. రోజురోజుకు జనాభా పెరుగుతుండటంతో ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2014లో అన్ని మున్సిపాల్టీలకు నూతన మాస్టర్‌ ప్లాన్‌ అమలు కోసం సర్వేలు చేపట్టాలని ఆదేశించింది. ఈ ఆదేశాలతో కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీకి ఢిల్లీకి చెందిన ప్రత్యేక ప్రతినిధులతో మాస్టర్‌ అమలు చేసేందుకు అప్పగించిన విషయం తెలిసిందే. మాస్టర్‌ప్లాన్‌ అమలు చేసేందుకు 2040సంవత్సరానికి పరిగణలోకి తీసుకొని రోడ్లు ఎంత మేర వెడల్పు చేయాలి, కూడళ్ల ఆధునికీకరణ, వార్డుల్లో అంతర్గత రోడ్ల వెడల్పు, వాటర్‌ ట్యాంక్‌ల నిర్మాణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని సర్వేలు చేపట్టి ఆన్‌లైన్‌కు అప్‌లోడ్‌ చేశారు. శాటిలైట్‌ మ్యాప్‌ రూపొందించారు. నూతనంగా రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ అమలు పరిచేందుకు పక్షం రోజుల క్రితం మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, కమిషనర్‌ సీవీఎన్‌ రాజు, సిబ్బంది ప్రత్యేక చర్చలు జరిపారు. 

వ్యాపార సముదాయాలకు ప్రత్యేక జోన్‌

నూతన మాస్టర్‌ ప్లాన్‌లో వ్యాపార సముదాయలకు ప్రత్యేక జోన్‌ కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి చెక్‌ పోస్టు వరకు వ్యాపార రంగం అభివృద్ధి చెందడంతో పాటు ప్రైవేటు ఆస్పత్రులు ఏర్పడటంతో ఈ ప్రాంతాన్ని వ్యాపార సముదాయాల జోన్‌గా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు కూడళ్ల ఆధునికీకరణ, రోడ్ల అభివృద్ధి, అంతర్గత రోడ్ల వెడల్పు, ఇతర అవసరాలు తీర్చేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సమీక్షించారు. కూరగాయాల మార్కెట్‌ కోసం ఆధునికీకరణ చేయాలని నిర్ణయించారు. నూతన మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేసేందుకు అధికారులు పనులు వేగవంతం చేస్తుండటంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా నూతన మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.? ఎక్కడ అభివృద్ధి పనులు చేపడుతారు..? వార్డులు, కూడళ్ల ఆధునీకరణ కోసం తీసుకునే చర్యలపై త్వరలోనే అఖిల పక్ష భేటి నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకోనున్నారు. నూతన మాస్టర్‌ప్లాన్‌ విషయంలో అభిప్రాయాల సేకరణ అనంతరం తుదిగా పాలకవర్గ సభ్యులు చేర్పులు, మార్పులు చేసి ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కాగానే ఉన్నతాధికారులకు ఈ నివేదికలు పంపించటంతో మాస్టర్‌ప్లాన్‌ అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించనుంది.

మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు పక్కాగా చర్యలు

-సద్దాం హుస్సేన్‌, మున్సిపల్‌ చైర్మన్‌, కాగజ్‌నగర్‌

మాస్టర్‌ప్లాన్‌ అమలు విషయంలో పక్కాగా చర్యలు తీసుకుంటున్నాం. శాటిలైట్‌ అనుసంధానంగా ఇచ్చిన మాస్టర్‌ ప్లాన్‌లో అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటాం. పట్టణ అభివృద్ధి విషయంలో తీసుకునే చర్యలు అందరికి వివరిస్తాం. భవిష్యత్తులో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాలు తీసుకుంటాం. త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తాం. 

అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

-సీవీఎన్‌ రాజు, మున్సిపల్‌ కమిషనర్‌, కాగజ్‌నగర్‌

కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో నూతన మాస్టర్‌ అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రక్రియ చేపడుతున్నాం. అన్ని కూడళ్ల ఆధునీకరిస్తున్నాం. త్వరలోనే అఖిల పక్షభేటి నిర్వహిస్తాం. ఈ ప్రక్రియ కాగానే ఉన్నతాధికారులకు పూర్తి స్థాయిలో నివేదికలను పంపిస్తాం.

Read more