వర్షాలతో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధం

ABN , First Publish Date - 2020-09-22T06:04:36+05:30 IST

భారీ వర్షాల కారణంగా ఉత్పన్నమయ్యే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొని ప్రజలకు రక్షణ కల్పించేందుకు జిల్లా యంత్రాంగం

వర్షాలతో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధం

జిల్లా అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం 

వరదనీరు, మురుగునీటికాలువ నిర్మాణంతో తప్పిన ముప్పు

లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గంగుల కమలాకర్‌ 


కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 21: భారీ వర్షాల కారణంగా ఉత్పన్నమయ్యే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొని ప్రజలకు రక్షణ కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహారపౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు స్థానికంగా ఉండి వర్షాభావ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 17,18,19 డివిజన్లలో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలైన రేకుర్తి సమ్మక్క సారలమ్మ గద్దె సమీపంలోని చెరువు, శ్రీరాంనగర్‌కాలనీలను మేయర్‌ వై.సునీల్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతితో కలిసి సందర్శించారు.  ఇళ్ల మధ్య నీరు నిల్వ ఉంటే వెంటనే జేసీబీతో కచ్చా కాలువలు తవ్వి నీటిని మళ్ళించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ నగరంలో మురుగునీటి కాలువలు, వరదకాలువలను నిర్మించుకోవ డంతో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం కలుగలేదని చెప్పారు.


దశలవారీగా నగర మంతటా మురుగునీరు, వరద నీటి కాలువలను నిర్మించి ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 17వ డివిజన్‌లో వర్షాలతో గడ్డం నాగరాజు ఇల్లు కూలిపోవడంతో మంత్రి గంగుల కమలాకర్‌ తక్షణ సహాయం కింద 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడంతోపాటు నష్టపరిహారం ఇప్పించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ చల్లస్వరూపరాణి హరిశంకర్‌, కార్పొరేటర్లు సుధగోని మాధవి, ఎదుల్ల రాజశేఖర్‌, కోల భాగ్యలక్ష్మి, ఆర్టీఏ సభ్యుడు తోట శ్రీపతిరావు, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్‌, నాయకులు సుంకల సంపత్‌రావు, కృష్ణగౌడ్‌, కోల ప్రశాంత్‌, ఎస్‌ఈ కృష్ణారావు, ఈఈ రామన్‌, ఏఈ వెంకట్‌కుమార్‌, సానిటరీ సూపర్‌వైజర్‌ రాజమనోహర్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-22T06:04:36+05:30 IST