సాగుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2022-06-23T04:35:44+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గత ఏడాది ఐదు లక్షలా 44,043 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, ఈ సారి ఆరు లక్షలా 35,602 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఆ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

సాగుకు సన్నద్ధం
వర్షం రాకపోవడంతో స్ర్పింక్లర్లతో పొలాన్ని తడుపుతున్న రైతు

- 3,65,602 ఎకరాల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా వానాకాలం  సాగు ప్రణాళిక 

- గతేడాది కంటే 91.119 ఎకరాలు అదనం

- వాటికి 1,39,065 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం

- రైతుబంధు కోసం ఎదురుచూపులు


అచ్చంపేట, జూన్‌ 22: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గత ఏడాది ఐదు లక్షలా 44,043 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, ఈ సారి ఆరు లక్షలా 35,602 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఆ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సారి 91.119 ఎకరాల్లో అదనంగా పంటలు సాగవనున్నాయి. నేల స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేసుకోవాలని అధికారులు క్షేత్రస్థాయిలో ఇప్పటికే సూచించారు. అయితే ఇప్పటి వరకు రైతుబంధు డబ్బులు రాకపోడంతో రైతులు పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది.


ఎరువులు

6,35,602 ఎకరాల్లో పంటల సాగుకు 1,39,065 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా యూరియా 67,511 మెట్రిక్‌ టన్నులు అవసరమని గుర్తించారు. డీఏపీ 25,472 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 30,525 మెట్రిక్‌ టన్నులు, ఎంఓపీ 12,793 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 2,761 మెట్రిక్‌ టన్నులు అవసరం ఉంటుందని ప్రణాళికలను సిద్ధం చేశారు.


రైతుబంధుకు పెరుగనున్న రైతులు

రైతుబంధు డబ్బులు గత వానాకాలంలో జిల్లాలో 2,90,679 మంది రైతులకు రూ.376.35 కోటు పంపించగా, 2,77,000 మంది రైతులు రూ.366.41 కోట్లు తీసుకున్నారు. ఈ ఏడాది రైతుల సంఖ్య పెరిగే అవకాశముంది. అయితే డబ్బులు ఇప్పటికే వచ్చి ఉంటే పెట్టుబడులకు ఆసరాగా ఉండేదని రైతులు అంటున్నారు.


దెబ్బతిన్న పంటలు

వ్యవసాయం రైతులకు కత్తిమీద సాములా మారింది. విత్తనాలు వేసినప్పటి నుంచి, దిగుబడులు అమ్ముకుని డబ్బులు చేతికొచ్చే వరకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి, తెగుళ్లు, మద్దతు ధర లేకపోవడం ఇలా అన్నీ అవాంతరాలే వస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురవగా, మరికొన్ని చోట్ల వర్షాలే పడలేదు. భారీ వర్షాలు కురిసిన చోట పత్తి, జొన్న, కంది పంటలు సాగు చేయగా, దెబ్బతిన్నాయి. పొలాలు కోతకు గురై, ఇసుక మేటలు పెట్టాయి. వర్షాలు పడని చోట బోర్ల కింద పలువురు సాగు చేపడుతున్నారు. గత ఏడాది యాసంగిలో తెగుళ్లు సోకి రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. ఈ సారైనా పంటలు బాగా పండి, గట్టెక్కుతారో లేదో చూడాలి.


ఈ సారైనా బైటపడుతామో లేదో

పోయినసారి తెగుళ్లు వచ్చి పంటలు సరిగా పండలేదు. ఈ సారైనా మంచిగా పండితే బాగుం టది. సర్కారు రైతుబంధు డబ్బులు త్వరగా ఇచ్చి ఆదుకోవాలి. ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై ఇవ్వాలి.

- జేత్యనాయక్‌, పూర్య తండా


సాగుకు ప్రణాళికలను సిద్ధం చేశాం 

ఈ ఏడాది వానాకాలానికి సాగు ప్రణాళికలను సిద్ధం చేశాం. డివిజన్‌లో లక్షా 42 వేల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా, ఇప్పటికి లక్ష ఎకరాలకు పైగా పత్తి, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల సాగుకు కొంత అలస్యమవుతుంది.

- చంద్రశేఖర్‌, ఏడీఏ, అచ్చంపేట



Updated Date - 2022-06-23T04:35:44+05:30 IST