వానాకాలం సాగుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2022-05-18T03:40:05+05:30 IST

వానాకాలం సాగుకు రైతులు సమాయత్తమవు తున్నారు. గతేడాది చేదు అనుభవాలను మర్చిపోయి, ఈ యేడు అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చేలల్లోని పత్తి, మిరప, కంది కట్టెలను తొలగించి సేంద్రియ ఎరువులను చల్లుతున్నారు. వేసవి దుక్కులు పూర్తయ్యాయి. వరి సాగు చేసే రైతులు చెరువుల్లోని నల్ల మట్టిని పొలాలకు తరలిస్తున్నారు. తొలకరి వానలకే విత్తనలు వేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ యేడు 3.63 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనాలు రూపొందించారు.

వానాకాలం సాగుకు సన్నద్ధం
చేనులో దుక్కి దున్నుతున్న రైతన్న

వ్యవసాయ పనులకు శ్రీకారం

అధిక దిగుబడులే లక్ష్యంగా ముందుకు

సాగు ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ

అందుబాటులో ఎరువులు, విత్తనాలు 

పంట రుణ లక్ష్యం రూ.1951.25 కోట్లు

3.63 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా

నెన్నెల, మే 17: వానాకాలం సాగుకు రైతులు సమాయత్తమవు తున్నారు. గతేడాది చేదు అనుభవాలను మర్చిపోయి, ఈ యేడు అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో  పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చేలల్లోని పత్తి, మిరప, కంది కట్టెలను తొలగించి సేంద్రియ ఎరువులను చల్లుతున్నారు. వేసవి దుక్కులు పూర్తయ్యాయి. వరి సాగు చేసే రైతులు చెరువుల్లోని నల్ల మట్టిని పొలాలకు తరలిస్తున్నారు. తొలకరి వానలకే విత్తనలు వేసేందుకు  ఉవ్విళ్లూరుతున్నారు.  ఈ యేడు 3.63 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనాలు రూపొందించారు. అందుకు తగ్గ విత్త్తనాలు, ఎరువులను అధికారులు సిద్ధంగా ఉంచారు. ఈ ఏడు రూ.1951.25 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు.

నష్టాల నుంచి... 

గత వానాకాలం సీజన్‌లో ప్రతికూల వాతావరణంతో పంటలు అం తంత మాత్రమే చేతికొచ్చాయి. జిల్లాలో ప్రధాన పంటైన పత్తి భారీ వర్షాలు, చీడపీడల తాకిడికి దెబ్బతిన్నది. దిగుబడి తక్కువ వచ్చినప్పటికి క్వింటాల్‌కు రూ.పది వేల వరకు ధర పలకడంతో రైతులు గట్టెక్కారు. వరి పండించిన రైతులు  నష్టాలు చవి చూశారు. ధాన్యాన్ని కొనేవారు లేక రైతులు కుదేలయ్యారు. పంట అమ్మకం డబ్బులు సకాలంలో చేతికి రాక ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనే వ్యవసాయ శాఖ తీపి కబురు రైతులకు  కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.  వానాకాలం సీజన్‌పై గంపెడాశలతో సాగుకు సన్నద్ధమవుతున్నారు.

పెరగనున్న సాగు విస్తీర్ణం

జిల్లాలో ఈ  సీజన్‌లో వివిధ పంటల సాగు విస్తీర్ణం పెరగనుంది.     జిల్లాలో  1,84,398 మంది రైతులున్నారు. 4.10 లక్షల వ్యవసాయ భూమి ఉంది.  గత వానాకాలం సీజన్‌లో 3.56 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఈ యేడు మరో ఏడు వేల ఎకరాల్లో పంట విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. 3.63 లక్షల ఎకరాల్లో సాగు కానున్నట్టు అంచనాలు రూపొందించారు. పత్తి 1,90,300 ఎకరాల్లో, వరి 1,59,473 ఎకరాల్లో,  ఇతర పంటలు 13,095 ఎకరాల్లో సాగవుతాయని అంచనాలు వేశారు. 

పత్తివైపే మొగ్గు...

ప్రభుత్వం పత్తి, కంది పంటలనే ప్రోత్సహిస్తోంది. వరి సాగు తగ్గించి ప్రత్యామ్నయ పంటలు సాగు చేయాలని సూచిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి పత్తి ధర రికార్డు స్థాయిలో క్వింటాలుకు రూ.పది వేలకు పైగా పలికింది. దీంతో  పత్తి సాగుకే మెజార్టీ రైతులు మొగ్గు చూపుతున్నారు. వందల ఎకరాలు కౌలుకు తీసుకుంటున్నారు. గత సీజ న్‌లో 1.62 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకాగా, ఈ ఏడు మరో 30 వేల ఎకరాల సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులంటున్నారు. 

అందుబాటులో విత్తనాలు, ఎరువులు 

విత్తనాలు, ఎరువులకు ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.  3,59,220 పత్తి విత్తన ప్యాకెట్లు, 31,892 క్వింటాళ్ల వరి, 37.5 క్వింటాళ్ల సోయాబీన్‌, 243.5 క్వింటాళ్ల కందులు, 127.2 క్వింటాళ్ల పెసలు, 24.4క్వింటాళ్ల మినుము విత్తనాలు అవసరం అవుుతాయని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 1050 క్వింటాళ్ల జీలుగ, 5750 క్వింటాళ్ల జనుము విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నారు. 65 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను అందివ్వనున్నారు.  ఈ సీజన్‌కు మొత్తం 80,727 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని అంచనాలు రూపొందించారు. యూరియా 42,900ల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 22,300 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 24వేల మెట్రిక్‌ టన్నులు, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌  14,075 మెట్రిక్‌ టన్నులు అవసరం ఉన్నట్లు గుర్తించారు. 8,600 మెట్రిక్‌ టన్నుల యూరియా, 824 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 4,905 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 160 మెట్రిక్‌ టన్నుల ఎస్‌ఎస్‌పీ, 71 టన్నుల పొటాష్‌ అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా ఎరువులను అవసరాన్ని బట్టి తెప్పించుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువుల నిల్వల సమాచారం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. 

రూ. 1951.25 కోట్ల రుణ లక్ష్యం

ఈయేడు రూ. 1951.25 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత సంవత్సరం కంటే ఈ యేడు రూ.147 కోట్ల మేర రుణ లక్ష్యం పెరిగింది. గత సంవత్సరం రూ. 1,713.51 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, రూ.1346.40 కోట్లు మాత్రమే రుణాలు అందజేశారు. ఈ సారి వంద శాతం రుణ లక్ష్యాన్ని సాధించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2022-05-18T03:40:05+05:30 IST