ఆయిల్‌ పాం సాగుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2021-07-25T06:40:05+05:30 IST

పంట సాగు మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించే విధంగా రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తోంది.

ఆయిల్‌ పాం సాగుకు సన్నద్ధం

- జిల్లాలో 8,398 ఎకరాల లక్ష్యం 

- 600 ఎకరాల్లో సాగుకు 158 మంది రైతుల దరఖాస్తులు 

- ప్రభుత్వం నుంచి భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు 

- ఆసక్తి కనబరుస్తున్న రైతులు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పంట సాగు మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించే విధంగా రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తోంది. గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొగ్గు చూపని ఆయిల్‌పాం పంట సాగును ముందుకు తీసుకువచ్చింది. ఇందుకు అనుగుణంగానే రైతుల నుంచి ఆయిల్‌పాం సాగు చేయడానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఉద్యానవన శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎఫ్‌జీపీ- పీయూ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి కేటాయించారు. జిల్లాలో 8,398 ఎకరాల్లో అయిల్‌పాం సాగు చేపట్టే విధంగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 600 ఎకరాల్లో పండించేందుకు 158 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సారి జిల్లాలో భూగర్భజలాలు పెరగడంతో పాటు కాళేశ్వరం నీటి ఎత్తిపోతలతో అయిల్‌పాంకు సరిపడే వాతావరణం, తేమ శాతం కూడా పెరిగింది. ఆంధ్రాలోని కోనసీమ ప్రాంతానికే పరిమితమైన ఆయిల్‌పాం సాగు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొదలు కాబోతుంది. ఇందుకు ప్రభుత్వం రైతుల్లో అవగాహన కల్పిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. 

- రైతులకు భారీగా ప్రోత్సాహకాలు 

ఆయిల్‌ పాం సాగుకు రైతులకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఒక ఎకరంలో 50 మొక్కలు నాటుకోవచ్చు. ఎకరానికి ఒక సంవత్సరానికి 12 నుంచి 14 టన్నుల దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో ఒక టన్ను రూ. 19,114 ధర పలుకుతుంది. పంట దిగుబడి కూడా ప్రభుత్వం కేటాయించిన కంపెనీ కొనుగోలు చేస్తుంది. దీంతో మార్కెట్‌ ఇబ్బంది కూడా రైతులకు ఉండదు. రైతులకు ఎకరానికి మొదటి సంవత్సరం రూ. 26 వేలు, రెండో సంవత్సరం రూ. ఐదు వేలు, మూడవ సంవత్సరం రూ. ఐదు వేల ప్రోత్సాహన్ని రైతులకు అందిస్తారు. దీంతో పాటు డ్రిప్‌ సిస్టమ్‌కోసం ఓసీ, బీసీలకు 80 శాతం సబ్సిడీ, ఎస్సీ,  ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ కూడా పొందవచ్చు. పంట ఎదుగుదల కాలంలో అంతర్‌పంట సాగును చేసుకోవచ్చు. ప్రోత్సాహాలు ఉండడంతో రైతులు ఆయిల్‌పాంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. జిల్లాలో 2.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా రాబోయే కాలంలో జిల్లాలో ఆయిల్‌ పాం సాగు కూడా పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. 


Updated Date - 2021-07-25T06:40:05+05:30 IST