ఆ విషయాన్ని దాచిపెట్టి.. నన్ను మోసం చేశారు: ట్రంప్

ABN , First Publish Date - 2020-11-10T16:59:59+05:30 IST

అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పని చెప్పారు.

ఆ విషయాన్ని దాచిపెట్టి.. నన్ను మోసం చేశారు: ట్రంప్

వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పని చెప్పారు. ఈసారి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ), ఫైజర్ సంస్థపై విరుచుకుపడ్డారు. కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న ఫైజర్ సంస్థ తాజాగా తాము చేపట్టిన మూడో దశ ట్రయల్స్ విజయవంతమయ్యాయని.. వ్యాక్సిన్‌ 90 శాతానికి పైగా ప్రభావవంతంగా పనిచేస్తోందని ప్రకటించింది. ఈ ప్రకటనే ఇప్పుడు ట్రంప్ కోపానికి కారణమైంది. ఎన్నికల ముందు ఎందుకు ఈ ప్రకటన చేయలేదని, బైడెన్ గెలుపు ఖరారైన తర్వాత ప్రకటించడం ఏంటని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో తనను ఎఫ్‌డీఏ, ఫైజర్ మోసం చేశాయని దుయ్యబట్టారు. ఎఫ్‌డీఏ, డెమొక్రాట్లు ఈ వ్యాక్సిన్ విజయాన్ని ఎన్నికల ముందు ప్రకటించడాన్ని అడ్డుకుని.. తనను ఓడించడానికి కుట్ర పన్నాయని ఆరోపించారు.


"ఒకవేళ నా స్థానంలో బైడెన్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. మరో నాలుగేళ్లైన కరోనా వ్యాక్సిన్ వచ్చి ఉండేది కాదు. యూఎస్ ఎఫ్‌డీఏ నా కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి ఎన్నికల ముందు వ్యాక్సిన్ అత్యావసర వినియోగానికి అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేది. లక్షల మంది ఈ మహమ్మారికి బలయ్యేవారు కాదు. ఫైజర్ గానీ, ఇతర సంస్థలకు గానీ ఎన్నికల తర్వాత వ్యాక్సిన్ విజయానికి సంబంధించిన ప్రకటన చేశాయి. అంతకుముందు ప్రకటించడానికి వాటికి ధైర్యం లేకపోయింది. రాజకీయ కోణంలో కాకుండా కనీసం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ ప్రకటన ముందు చేసి ఉంటే బాగుండేది." అని అన్నారు. కావాలనే ఈ విషయాన్ని దాచిపెట్టి నన్ను మోసం చేశారని ట్రంప్ మండిపడ్డారు. ఇక ఇప్పటికీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని ట్రంప్... న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. న్యాయపోరాటం వద్దని, ఓటమిని అంగీకరించాల్సిందిగా స్వయంగా భార్య మెలానియా చెప్పిన ట్రంప్ వినడం లేదు.       

Updated Date - 2020-11-10T16:59:59+05:30 IST